ఆ మాజీ ముఖ్యమంత్రి.. కరెంటు దొంగ?

కర్ణాటకకు పూర్తి కాలం కాకున్నా.. పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కుమారస్వామి మీద ఇప్పుడు కరెంటు దొంగ ముద్ర పడింది.

Update: 2023-11-15 04:40 GMT

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి టైం అస్సలు బాగోలేదు. ఆయన ఏం చేసినా ఏదో అయి.. మరేదోగా మారి ఆయన ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేస్తోంది. ఒకటి తర్వాత ఒకటిగా వెలుగు చూస్తున్న ఆయన లీలలు.. ఆయనకు కొత్త ఇబ్బందుల్ని తెచ్చి పెడుతున్నాయి. తాజాగా అలాంటిదే మరో ఉదంతం తెర మీదకు వచ్చింది. కర్ణాటకకు పూర్తి కాలం కాకున్నా.. పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కుమారస్వామి మీద ఇప్పుడు కరెంటు దొంగ ముద్ర పడింది.

బెంగళూరులోని జేపీ నగర్ లో ఆయన నివాసం ఉంది. దీపావళి పండుగ సందర్భంగా ఇంటిని అందంగా డెకరేట్ చేసి.. విద్యుత్ లైట్లతో మెరిసేలా చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తన ఇంటికి అలంకరణగా ఏర్పాటుచేసిన విద్యుత్ లైట్లకు అవసరమైన విద్యుత్ ను కరెంటు లైన్ కు కొక్కెం వేయటం ద్వారా అక్రమ విద్యుత్ సరఫరా చేస్తున్నట్లుగా కాంగ్రెస్ ఆరోపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రపంచంలోనే నిజాయితీపరుడైన కుమారస్వామి ఇల్లు అక్రమ విద్యుత్ వెలుగులతో నిండిపోయింది. పేదరికం కారణంగా ఒక మాజీ ముఖ్యమంత్రి విద్యుత్ ను చోరీచేసే పరిస్థితికి రావటం విషాదకరమంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ఎద్దేవాకు కుమారస్వామి కదిలిపోయారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆయన లబోదిబోమంటున్నారు.

తప్పు తనది కాదని.. విద్యుత్ దీపాల అలంకరణ కోసం ఒక వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే.. అతడి కక్కుర్తితోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. తనకు ఈ విషయం తెలిసిన వెంటనే దాన్ని తొలగించి.. తన ఇంటి మీటర్ బోర్డు నుంచి కనెక్షన్ తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. జరిగిన పొరపాటుకు క్షమించాలని.. తాను జరిమానా కట్టేందుకు సిద్ధమని పేర్కొన్నారు. చిన్న అంశంపై కాంగ్రెస్ రచ్చ చేస్తుందని పేర్కొన్నారు. జరిగిన తప్పును ఎత్తి చూపినంతనే.. తప్పు ఒప్పుకొని ఫైన్ కట్టేందుకు సిద్ధమైన కుమారస్వామిని అభినందిస్తున్న వైనం ఆయనకు కొంతలో కొంత ఊరటగా మారిందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News