అపార్టు మెంట్ లో పార్కింగ్ ఇష్యూ.. ఒకరి ప్రాణాన్ని తీసింది
అపార్టు మెంట్ అన్న తర్వాత ఎక్కువ సందర్భాల్లో చోటు చేసుకునే పంచాయితీ పార్కింగ్ మీదనే. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఒక పార్కింగ్ లొల్లి ఒకరి ప్రాణాలు తీసే వరకు వెళ్లటం షాకింగ్ గా మారింది.;
అపార్టు మెంట్ అన్న తర్వాత ఎక్కువ సందర్భాల్లో చోటు చేసుకునే పంచాయితీ పార్కింగ్ మీదనే. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఒక పార్కింగ్ లొల్లి ఒకరి ప్రాణాలు తీసే వరకు వెళ్లటం షాకింగ్ గా మారింది. దిల్ షుక్ నగర్ కు దగ్గర్లో ఉండే కొత్తపేటలోని వైష్ణవి రుతిక అపార్టుమెంట్ లో చోటు చేసుకున్న ఈ దారునం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. మరణించిన అపార్టుమెంట్ వాసి సతీమణి అన్నపూర్ణ వెల్లడించిన వివరాల ప్రకారం.. మే 21న ఈ దారుణం చోటు చేసుకుందని చెప్పారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలానికి చెందిన 48 ఏళ్ల గండ్ర నాగిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. 13 ఏళ్లుగా కొత్తపేట వైష్ణవి రుతిక అపార్టుమెంట్ లో ఉంటున్నారు. అదే అపార్టుమెంట్ లో ప్లాట్ నెంబరు 402లో సూరి కామాక్షి అద్దెకు ఉంటున్నారు. ఆమె ఇంటికి ఆమె అల్లుడు క్రిష్ణ రాజమండ్రి నుంచి కారులో వచ్చి.. అపార్టుమెంట్ ఆవరణలో పార్కు చేవారు. నాగిరెడ్డి బయట నుంచి వచ్చి క్రిష్ణ కారు వెనుక తన కారును పార్క్ చేశారు.
తిరిగి వెళ్లిపోయేందుకు క్రిష్ణ కిందకు రాగా.. తన కారు మీద గీతలు కనిపించాయి. అందుకు నాగిరెడ్డి కారణమని పేర్కొంటూ.. వాచ్ మెన్ తో అతడ్ని కిందకు పిలిపించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటం.. ఆవేశంతో నాగిరెడ్డి మీద దాడి చేశాడు. ఈ క్రమంలో చెవిలోంచి రక్తం.. నోటి నుంచి నురగ వచ్చి కిందకు పడిపోయిన నాగిరెడ్డిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్లుగా వైద్యులు తెలిపారు.
భర్త మరణంపై పోలీసులకు ఆయన సతీమణి కంప్లైంట్ ఇచ్చారు. మరోవైపు తాను చేసిన దాడిలో నాగిరెడ్డి కింద పడిపోవటంతో క్రిష్ణ పరారయ్యాడు. కామాక్షి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. నిందితుడ్ని అరెస్టు చేయకపోవటంపై అపార్టుమెంట్ వాసులు ప్రశ్నించటంతో ఈ విషయం వెలుగు చూసింది.