దక్కని మంత్రి పదవి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తన స్పష్టమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి;

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తన స్పష్టమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో తనకు స్థానం దక్కకపోయినా, తాను దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగతంగా తీసుకోనని, పదవి లేకపోయినా ప్రజల కోసం, పార్టీ బలోపేతం కోసం నిరంతరంగా శ్రమిస్తానని ఆయన స్పష్టం చేశారు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన పోస్ట్‌లో... "రాజకీయాల్లో పదవులు, హోదాలే కీలకమైతే ప్రజల సేవకు గమ్యం దొరకదు. నాకు పదవి లేదు కాబట్టి నేను వెనక్కి తగ్గనన్న మాట కాదని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే నా ప్రధాన ధ్యేయమని" తెలిపారు.
ఇటీవల కేబినెట్‌లోకి వచ్చిన కొత్త మంత్రులను అభినందిస్తూ.. వారికి ప్రజాసేవలో విజయాలు కలగాలని ఆకాంక్షించారు. “పదవులు కాకుండా ప్రజల మీద ఉన్న నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం మీద కలలే నాకు ప్రేరణ. అందుకే మళ్లీ కాంగ్రెస్‌లో చేరాను” అని పేర్కొన్నారు. రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగిపోదని, పదవి లేకపోయినా ప్రజల మధ్య ఉండే అవకాశాన్ని తాను శక్తిమంతమైనదిగా భావిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ వ్యాఖ్యలు కోమటిరెడ్డి రాజకీయ వైఖరికి అద్దం పడుతున్నాయని, ఆయన పార్టీ పట్ల నిజమైన విధేయతను చూపిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, గత కొంతకాలంగా ఆయన మునుగోడు నియోజకవర్గంలో కార్యకలాపాలను మరింత ఉధృతం చేశారు.
పదవులు మారినా, స్థానాలు మార్చినా తన లక్ష్యం మాత్రం ప్రజల అభివృద్ధే అని మరోసారి స్పష్టం చేసిన రాజగోపాల్ రెడ్డి ఈ ప్రకటనతో తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలకు దారితీసే సంకేతాలనిచ్చారు.