తమిళ రాజకీయాల్లోకి మరో యాక్టర్.. బరిలో 'కమర్షియల్' కింగ్, స్టార్ డైరెక్టర్ సుందర్
తమిళనాడు ఎన్నికలకు కోలివుడ్ నుంచి వరుసగా క్యూ కడుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరో విజయ్ తమిళ ఎన్నికల్లో దుమ్ము రేపుతున్నారు.;
తమిళనాడు ఎన్నికలకు కోలివుడ్ నుంచి వరుసగా క్యూ కడుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరో విజయ్ తమిళ ఎన్నికల్లో దుమ్ము రేపుతున్నారు. అధికార, ప్రతిపక్షాలకు దీటుగా పోటీ ఇస్తున్నారు. విజయ్ పొలిటికల్ గేమ్ ఎవరి ఫేట్ ను మార్చుతుందనేది రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళ సినీ రంగం నుంచి మరో నటుడు ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగారు. సెన్సిబుల్ డైరెక్టర్, నటుడు సుందర్ సి మదురై సెంట్రల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంపై సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ స్టార్ డైరెక్టర్, ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.
సుందర్ సి తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. అన్నాడీఎంకే కూటమిలోని పుదియ నీతి కట్చి (పీఎస్కే) తరపున ఆయన పోటీ చేయనున్నట్లు పీఎస్కే వ్యవస్థాపకుడు షణ్మగం ప్రకటించారు. అయితే తమ పార్టీ అభ్యర్థి అయినప్పటికీ సుందర్ అన్నాడీఎంకే గుర్తుపైనే పోటీలో ఉంటారని షణ్ముగం వెల్లడించారు. కాగా, సుందర్ సతీమణి ఖష్బూ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కానీ, సుందర్ బీజేపీ మిత్రపక్షం అయిన పీఎస్కే తరఫున పోటీ చేస్తుండటం గమనార్హం. కాగా, సుందర్ పొలిటికల్ ఎంట్రీని ఆహ్వానిస్తూ ఖబ్బూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. సుందర్ రాజకీయ ప్రవేశం తనకు గర్వకారణంగా ఉందని ఖుష్బూ తన పోస్టులో రాశారు.
ఇక సుందర్ సి. పేరు వినగానే తమిళ ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది స్వచ్ఛమైన వినోదం. 1995లో 'మురై మామన్' సినిమాతో దర్శకుడిగా పరిచయమై, తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. రజనీకాంత్‌తో 'అరుణాచలం', కమల్ హాసన్‌తో 'అన్బే శివం' వంటి క్లాసిక్ సినిమాలను తెరకెక్కించిన ఘనత ఆయనది. నటుడిగానూ సుందర్ రాణించారు. 'తలై నగరం' సినిమాతో హీరోగా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన రూపొందించిన 'అరణ్మనై' (చంద్రకళ/గంగ) సిరీస్ హారర్ కామెడీ విభాగంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
సుందర్ సి. కేవలం సినిమాలు తీయడమే కాకుండా, తన చిత్రాల్లో తరచుగా మధ్యతరగతి సమస్యలను, సామాజిక అంశాలను హాస్యం జోడించి చెప్పేవారు. ఆయన సతీమణి, నటి ఖుష్బూ సుందర్ ఇప్పటికే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నా, అయిన మాత్రం ఇప్పటివరకు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటూనే ఉన్నారు. కానీ, ఖుష్బూ రాజకీయ ప్రస్థానంలో సుందర్ సి. ఎప్పుడూ వెన్నుముకగా నిలిచారు. ఈ అనుభంతో క్షేత్రస్థాయిలో రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై ఆయన అవగాహన పెంచుకున్నట్లు చెబుతున్నారు.
కాగా, సుందర్ సి. తాజా ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఇన్నాళ్లూ వినోదం పంచిన తాను, ఇకపై నేరుగా ప్రజల సమస్యల పరిష్కారంలో భాగస్వామి కావాలని ఆయన భావిస్తున్నారని చెబుతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో, విద్యావంతులు, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు చట్టసభల్లో ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇక తన భార్య రాజకీయ అనుభవం తనకు తోడవుతుందని, కేవలం గ్లామర్ కోసమే కాకుండా బాధ్యతాయుతమైన నాయకుడిగా ఎదగడమే తన లక్ష్యమని సుందర్ చెబుతున్నారు.
సుందర్ సి.కి ఉన్న "క్లీన్ ఇమేజ్" ఆయనకు ప్లస్ పాయింట్ అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ, కేవలం పనిపై దృష్టి పెట్టే వ్యక్తిగా ఆయనకు పేరుంది. ముఖ్యంగా మహిళలు, యువతలో ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ ఓట్లుగా మారుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వెండితెరపై ఎన్నో సవాళ్లను ఎదుర్కొని హిట్ చిత్రాలను అందించిన సుందర్ సి., ఇప్పుడు రాజకీయాలనే రంగుల ప్రపంచంలో ఎలా రాణిస్తారో చూడాల్సివుంది. ఆయన వేసే ప్రతి అడుగు ఇప్పుడు కోలీవుడ్‌లోనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.