‘కియా’ బోట్లు, చెరకు రసం బళ్లు! పోలీసు దర్యాప్తులో సంచలన విషయాలు
కియా యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు విచారణను చాలెంజింగ్ గా తీసుకున్న పెనుగొండ పోలీసులు మొత్తం వ్యవహారం ఎలా నడిచింది తెలుసుకున్నారు.;
కియా కార్ల పరిశ్రమలు చోరీ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో సుమారు 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల విచారణ సమయంలో చోరీ ఎలా చేసింది? ఇంజిన్లు ఎక్కడ విక్రయించింది? పూర్తిగా తెలుసుకున్నారు. మూడేళ్లుగా పరిశ్రమ నుంచి అక్రమంగా తరలించిన కారు ఇంజిన్లను ఢిల్లీకి తరలించారని అక్కడ నుంచి మత్స్యకారుల మోటారు బోట్లు, చెరకు రసం బళ్లకు ఇంజిన్లు విక్రయించారని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరికొంత మందిని అరెస్టు చేయాల్సివుందని అంటున్నారు.
కియా కారు ఇంజిన్ల మాయం కేసులో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. ప్రధాన నిందితులుగా భావిస్తున్న తమిళనాడుకు చెందిన వినాయకమూర్తి, మణికంఠ, అర్మగన్, పఠాన్ సలీం, అర్జున్, మరో ఇద్దరిని ప్రస్తుతానికి అరెస్టు చేశారు. వీరిచ్చే సమాచారంతో మరికొందరిని అరెస్టు చేయాల్సివుందని అంటున్నారు. కేసు ఛేదనలో తెలుసుకున్న విషయాలతో పోలీసులే షాక్ తిన్నారని అంటున్నారు. భారీ పరిశ్రమ నుంచి మూడేళ్లుగా ఇంజిన్లు మాయమవుతున్నాయని పోలీసు విచారణలో బయటపడింది.
కియా యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు విచారణను చాలెంజింగ్ గా తీసుకున్న పెనుగొండ పోలీసులు మొత్తం వ్యవహారం ఎలా నడిచింది తెలుసుకున్నారు. కియా పరిశ్రమలో పనిచేసిన కొందరు ఉద్యోగులు చాకచక్యంగా ఇంజిన్లు మాయం చేసి తొలుత తమిళనాడు అక్కడి నుంచి ఢిల్లీకి తరలించినట్లు గుర్తించారు. చెన్నై పోర్టు నుంచి పెనుకొండ ప్లాంట్ కు చేరాల్సిన ఇంజిన్లు ఒక్కోసారి కంటెనర్ల నుంచి దించకుండానే అక్కడి నుంచి అటే తరలించేవారని పోలీసు విచారణలో బయటపడింది. వాస్తవానికి చెన్నై పోర్టు నుంచి తీసుకువచ్చిన ఇంజిన్లను గ్లోవిస్ కంపెనీ గోడౌన్ లో నిల్వ చేయాల్సివుంటుంది. కానీ, అక్కడికి చేరకుండానే 900 ఇంజిన్లను తీసుకువచ్చిన కంటెనర్లలోనే తిరిగి తమిళనాడు పంపించేవారని పోలీసులు చెబుతున్నారు.
ఇలా తరలించిన ఇంజిన్లు తొలుత తమిళనాడుకి అక్కడి నుంచి ఢిల్లీలోని ఓ వ్యాపారవేత్తకు విక్రయించినట్లు పోలీసులు కనుగొన్నారు. ఇప్పుడు ఆ వ్యాపార వేత్తను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఢిల్లీ వెళ్లనున్నారని చెబుతున్నారు. ఇక చోరీ చేసి విక్రయించిన ఇంజిన్లను రికవరీ చేయడం కూడా కష్టంగా చెబుతున్నారు.కొన్ని ఇంజిన్లను విడిభాగాలుగా మార్చి అమ్మేయగా, మరికొన్నింటిని మత్స్యకారుల బోట్లు, చెరకు రసం తయారు చేసే బళ్లకు వినియోగించినట్లు చెబుతున్నారు. దీంతో ఆయా ఇంజిన్లు ఎక్కడున్నాయో కూడా తెలియడం లేదంటున్నారు.