హత్య తర్వాత ఎలా ఏడవాలి?.. కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో షాకింగ్ 'చాట్ జీపీటీ' సెర్చ్‌లు!
ఒక హత్యను ప్లాన్ చేయడం.. దాన్ని అమలు చేయడం ఒక ఎత్తయితే.. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఎలా నటించాలి.. పోలీసులకు దొరక్కుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై నిందితులు వేసిన ప్లాన్ చూసి దర్యాప్తు అధికారులే దిగ్భ్రాంతి చెందుతున్నారు
ఒక హత్యను ప్లాన్ చేయడం.. దాన్ని అమలు చేయడం ఒక ఎత్తయితే.. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఎలా నటించాలి.. పోలీసులకు దొరక్కుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై నిందితులు వేసిన ప్లాన్ చూసి దర్యాప్తు అధికారులే దిగ్భ్రాంతి చెందుతున్నారు. కేతన్ అగర్వాల్ హత్య కేసులో పూణే రూరల్ పోలీసులు దాఖలు చేసిన భారీ ఛార్జ్‌షీట్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. నేరం చేసిన తర్వాత ప్రవర్తించాల్సిన తీరుపై నిందితులు ఏకంగా ఆన్‌లైన్.. చాట్‌జీపీటీ సహాయం తీసుకున్నట్లు ఈ విచారణలో వెల్లడైంది.
మహారాష్ట్రలోని లోహగఢ్ కోట సమీపంలో జూన్ 18న కేతన్ అగర్వాల్ లోయలో పడి మరణించాడు. ప్రారంభంలో దీనిని అందరూ సాధారణ ప్రమాదంగా భావించినప్పటికీ పోలీసుల లోతైన విచారణలో ఇది పక్కా స్కెచ్ ప్రకారం జరిగిన హత్య అని తేలింది. కేతన్‌కు కాబోయే భార్య సియా గోయల్, ఆమెతో సంబంధం ఉన్న చేతన్ చౌధరి, అతడి స్నేహితుడు రితేష్ హంగే కలిసి ఈ కుట్రకు తెరలేపారని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో వడ్గావ్ మావల్ కోర్టులో పోలీసులు దాఖలు చేసిన 5,053 పేజీల ఛార్జ్‌షీట్‌లో కాల్ డేటా, ఫోరెన్సిక్ ఆధారాలతో పాటు పలువురి వాంగ్మూలాలను చేర్చారు.
ఈ కేసులో అత్యంత విస్తుగొలిపే అంశం ఏమిటంటే హత్య జరిగిన తర్వాత నిందితురాలు సియా గోయల్ చేసిన డిజిటల్ సెర్చ్‌లు. కేతన్ కుటుంబ సభ్యుల ముందు అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె ప్రత్యేకంగా ఆన్‌లైన్ వెతుకులాట సాగించింది. బాధితుడి కుటుంబం ఘటనా స్థలానికి వచ్చినప్పుడు తీవ్రమైన బాధలో ఉన్నట్లు ఎలా కనిపించాలి..? వారి ముందు ఏ రకంగా ఏడవాలి అన్న అంశాలపై ఆమె ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసింది. అంతేకాకుండా ఒకవేళ పోలీసులు ప్రశ్నిస్తే భయం లేకుండా ఎలా సమాధానాలు చెప్పాలి? విచారణ సమయంలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి అనే విషయాలను చాట్‌జీపీటీ, గూగుల్‌లో శోధించినట్లు ఆధారాలు లభించాయి. దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించేందుకు నిందితులు హత్య తర్వాతి పరిణామాలపై ముందే ఒక స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారని పోలీసులు పేర్కొన్నారు.
అయితే ఈ ఆన్‌లైన్ సెర్చ్‌లు కేవలం హత్య తర్వాతకే పరిమితం కాలేదు. నేరానికి ముందు కూడా నిందితులు మేఘాలయ హనీమూన్ హత్య కేసుతో పాటు గతంలో లోయలలో పడి మరణించిన పలు ఘటనల గురించి విస్తృతంగా చదివారు. అలాగే నేరం ఏ రకంగా చేయాలో తెలుసుకునేందుకు పలు క్రైమ్ సినిమాలు, పాడ్‌కాస్ట్‌ల ద్వారా సమాచారం సేకరించారని పోలీసులు తెలిపారు. కేతన్‌ను లోహగఢ్ ప్రాంతానికి రప్పించేందుకు ‘మాహి’ అనే నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఉపయోగించి అతడితో చాటింగ్ చేసి నమ్మకంగా అక్కడకు పిలిపించారు. డిలీట్ చేసిన సోషల్ మీడియా చాటింగ్‌ను ఫోరెన్సిక్ నిపుణులు తిరిగి సేకరించడంతో ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి.
ఈ కేసులో మొబైల్ డేటా, తొలగించిన చాట్స్, కాల్ రికార్డులు వంటి డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలే దర్యాప్తులో అత్యంత కీలకంగా మారాయి. నేరానికి కుట్ర పన్నడం దగ్గర్నుంచి.. దాన్ని అమలు చేయడం.. ఆ తర్వాత పోలీసులను తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాల వరకు ప్రతి అడుగును డిజిటల్ సాక్ష్యాలు ఎత్తిచూపుతున్నాయి. అయితే ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలు ప్రస్తుతం పోలీసుల ఆరోపణలు మాత్రమేనని.. న్యాయస్థానంలో విచారణ పూర్తయి తుది తీర్పు వెలువడే వరకు నిందితులపై నేరం పూర్తిగా నిరూపితమైనట్లు కాదని గుర్తుంచుకోవాలి.