తెలంగాణ ఉజ్వల భవిత కోసం కేసీఆర్ ఓడుతూనే ఉండాల?

తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగినా? ఎలాంటి విపత్తు విరుచుకుపడినా నోరెత్తి మాట్లాడే వారందరికి చుక్కలు చూపించిన ఘనత గులాబీ బాస్ కేసీఆర్ కే దక్కుతుంది.

Update: 2024-05-06 16:30 GMT

తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగినా? ఎలాంటి విపత్తు విరుచుకుపడినా నోరెత్తి మాట్లాడే వారందరికి చుక్కలు చూపించిన ఘనత గులాబీ బాస్ కేసీఆర్ కే దక్కుతుంది. ఈ కారణంగానే పదేళ్లు పవర్ లో ఉన్నప్పటికి బలమైన నిరసనలు.. ధర్నాలు.. రాస్తారోకోలు లాంటివి చోటు చేసుకున్నది లేదు. ఎవరైనా ఏదైనా నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే చాలు.. వారిని ముందస్తుగానే హౌస్ అరెస్టు చేయటం.. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టనీయకుండా చూడటం కేసీఆర్ జమానాలో తరచూ చోటు చేసుకునేది. ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనేందుకు అవకాశం లేకుండా తన బలాన్ని చూపిన గులాబీ బాస్ కు.. పవర్ కాస్తా తన ప్రత్యర్థి చేతుల్లోకి వెళ్లిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

తాను అధికారంలో ఉన్నప్పుడు.. ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదనే ప్రశ్న ఎవరైనా జర్నలిస్టు నోటి నుంచి వస్తే.. వెనుకా ముందు చూడకుండా విలేకరుల సమావేశంలో ఎటకారం చేసి.. తన అధికారంతో నోరు మూపించిన కేసీఆర్.. విపక్ష నేతగా మాత్రం.. ప్రభుత్వాన్ని అదే పనిగా నిలదీయాలని కోరటం కనిపిస్తుంది. రాజరిక పోకడలకు పోయి చేతిలో ఉన్న పవర్ ను పోగొట్టుకున్న కేసీఆర్.. విపక్ష నేతగా ఆయన దూకుడు చూస్తే ముచ్చట వేసే పరిస్థితి.

గడిచిన కొద్దిరోజులుగా బస్సుయాత్ర పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారాన్నిచూసినప్పుడు.. గులాబీ బాస్ చేతిలో అధికారం ఉండే కన్నా.. విపక్ష నేత పోస్టులో ఉండటమే తెలంగాణకు మంచిదన్న భావన వ్యక్తమవుతుంది. ఎందుకుంటే.. ప్రశ్నించేవాడు పవర్ లో ఉంటే.. ఎవరిని ప్రశ్నించకుండా చేయటాన్ని పదేళ్లుగా చూస్తున్నదే. అదే అధినేత చేతిలో పవర్ లేనప్పుడు.. అందరికి పలు అంశాల మీద అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నారు.

Read more!

ఎన్నికల వేళ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని.. సరిగ్గా వారు చెప్పిన టైం కంటే కాసిన్ని రోజులు ఎక్కువైనంతనే విరుచుకుపడిన తీరు చూసినప్పుడు.. ఇదే కేసీఆర్ సర్కారు కేజీ నుంచి పీజీ విద్య ఉచితం.. నిరుద్యోగ భ్రతి మొదలుకొని ఎన్నో ఆశల్ని.. ఆకాంక్షల్నివల్లెవేసేది. మరి.. అలాంటివేమీ పదేళ్ల కాలంలో పూర్తి కాని విషయాన్ని వారు మర్చిపోయారా? అన్నదిప్రశ్న. ఎందుకుంటే.. పదేళ్లలో తాము నెరవేర్చని హామీల జాబితా పెద్దదిగా ఉన్నప్పటికి పట్టించుకోని కేసీఆర్.. ప్రభుత్వం కొలువు తీరిన నాలుగు నెలల్లో మొదటి 3 నెలలు అవగాహన కోసం వెచ్చిస్తే.. అంతలోనే మరోసారి ఎన్నికలు వస్తే ఏ ప్రభుత్వం మాత్రం ఏం చేయగలదు? అన్నది కేసీఆర్ అండ్ కోకు ఎందుకు మనసుకు రాదన్నది ప్రశ్న.

ఒకందుకు చూస్తే ఇది మంచిదేనని చెప్పాలి. కేసీఆర్ చేతికి అధికారం లేకుంటే.. ఆయన నిత్యం ప్రశ్నిస్తూ ఉంటారు. చైతన్యంగా ఉంటారు. ప్రభుత్వం చేసే తప్పుల్ని తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. ప్రజల్ని కలుస్తుంటారు. వారిబాగోగుల్ని తెలుసుకుంటూ ఉంటారు. వారితో కలిసి ఫోటోలు దిగుతారు. వారితో మాట్లాడతారు. సమస్యల గురించి.. కష్టాల గురించి వాకబు చేస్తారు.

ప్రభుత్వం మీద విరుచుకుపడటంతోపాటు.. విపక్ష నేతగా తన చేతిలోని ముల్లు కర్ర తీసుకొని వెంటపడి.. పాలకుల ప్రభుత్వ రథాన్ని పరుగులు తీయిస్తారు. ఇదంతా చూస్తే.. కేసీఆర్ చేతికి అధికారం ఉండే కన్నా.. ముళ్ల కర్ర ఒకటి చేతికి ఇచ్చి.. విపక్ష నేత హోదాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. పరుగులు తీయమంటే బాగుంటుందేమో? తెలంగాణ ఫ్యూచర్ బాగుండాలంటే.. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉంటేనే మంచిదన్న మాట కొందరి నోట వినిపిస్తోంది. ఈ యాంగిల్ కేసీఆర్ కు తెలిస్తే ఎలా రియాక్టు అవుతారో?

Tags:    

Similar News