స్టార్ హోటల్ వంట మనుషులతో సంతకాలా? చంద్రబాబుపై కేసీఆర్ సెటైర్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెట్టుబడుల సదస్సుల నిర్వహణ తీరుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.;
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెట్టుబడుల సదస్సుల నిర్వహణ తీరుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఇటీవల విశాఖలో జరిగిన ఏపీ పెట్టుబడిదారుల సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రస్తుత సీఎం తన గురువు చంద్రబాబును ఆదర్శంగా తీసుకొని కేవలం ‘హైప్’ క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కార్యకర్తలతో సమావేశం అనంతరం సుధీర్ఘంగా మాట్లాడారు... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గతంలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడుల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబుకు అలవాటు అని.. ఇప్పుడు అదే బాటలో ప్రస్తుత ప్రభుత్వం నడుస్తోందని ఆయన మండిపడ్డారు.
లక్షల కోట్ల లెక్కలు ఎక్కడ?
ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో భారీ స్థాయిలో పెట్టుబడుల సదస్సు నిర్వహించారని కేసీఆర్ గుర్తు చేశారు. ఆ సమయంలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. ఒకవేళ ఆ ఎంవోయూలు నిజంగా సక్సెస్ అయి ఉంటే ఆంధ్రప్రదేశ్ కు రూ.20 లక్షల కోట్లు వచ్చి ఉండాలని ఆయన విశ్లేషించారు. కానీ వాస్తవ రూపంలో కనీసం రూ.10వేల కోట్లు కూడా రాలేదని ఆయన విమర్శించారు.
స్టార్ హోటల్ వంట మనుషులతో సంతకాలా?
చంద్రబాబు సదస్సుల వెనుక ఉన్న డొల్లతనాన్ని వివరిస్తూ కేసీఆర్ ఒక ఆసక్తికరమైన ఆరోపణ చేశారు. ‘పెట్టుబడుల సదస్సులో ఎంవోయూలపై సంతకాలు చేసేందుకు మనుషులు దొరకక.. స్టార్ హోటళ్లలో పనిచేసే వంట మనుషుల తో సంతకాలు చేయించారని నాకు తెలిసింది’ అంటూ సెటైర్లు వేశారు. కేవలం గ్రాఫిక్స్ , బిల్డప్ లతో పెట్టుబడులు రావని.. వాస్తవ పరిస్థితులు వేరని ఆయన స్పస్టం చేశారు. ‘పెట్టుబడుల సదస్సుల పేరుతో హైప్ క్రియేట్ చేయడం చంద్రబాబు మార్క్ రాజకీయం. ఆ ఎంవోయూలకు, క్షేత్రస్థాయిలో వచ్చే పెట్టుబడులకు పొంతనే ఉండదు’ అంటూ కేసీఆర్ సెటైర్ వేశారు.
ప్రస్తుత ప్రభుత్వం కూడా అదేపంథాను అనుసరిస్తూ పెట్టుబడుల విషయంలో కేవలం ప్రచారానికే పరిమితమవుతోందని కేసీఆర్ ఆరోపించారు. పారిశ్రామికాభివృద్ధి అంటే కాగితాల మీద సంతకాలు కాదని.. అవి ఉపాధి కల్పించే పరిశ్రమలుగా మారాలని ఆయన హితవు పలికారు.