బిడ్డకు భరోసా ఇవ్వడం ఎలా? అంతర్మథనంలో కేసీఆర్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్నారా? పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు అపర చాణుక్యుడిగా పేరుతెచ్చుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఇద్దరు పిల్లలను సమన్వయం చేయలేకపోతున్నారా? అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.;

Update: 2025-05-23 10:30 GMT

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్నారా? పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు అపర చాణుక్యుడిగా పేరుతెచ్చుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఇద్దరు పిల్లలను సమన్వయం చేయలేకపోతున్నారా? అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణపై కూతురు కవిత సంధించిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ లేఖతో బీఆర్ఎస్ లో అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు ఉన్నట్లు వెల్లడిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత పెరిగిపోతోందని చెబుతూ, ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనదే అధికారమన్న ధీమా ప్రదర్శిస్తున్న బీఆర్ఎస్ లో తాజా గందరగోళం కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోందని అంటున్నారు.

బీజేపీని ఒక్కమాట కూడా అనలేదని ఎత్తిచూపుతూ కవిత రాసిన లేఖ బీఆర్ఎస్ లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. గత కాలంగా పార్టీలో సముచిత స్థానం ఆశిస్తున్న కవిత తన మనోగతాన్ని బహిరంగంగా ఆవిష్కరిస్తున్నారు. తన ప్లేస్ ఏదో చెప్పకపోతే తన దారి తాను చూసుకుంటానని, తన వెంట ఎవరు వస్తారని బీఆర్ఎస్ నేతలను ఆమె విచారిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పరిస్థితులు ఇలానే కొనసాగితే కారు పార్టీ రెండు ముక్కలు అవుతుందా? లేక హరీశ్ రావు తన దారి తాను చూసుకుంటే మూడు ముక్కలాటలా అయిపోతుందా? అని కార్యకర్తల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫాం హౌసులో రెస్టు తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తెలంగాణ జాతిపితగా పేరు గడించిన కేసీఆర్ కు ప్రస్తుత పరిస్థితి సంకటంగా మారిందని అంటున్నారు. భారతీయ సంప్రదాయంలో కుమారుడి వారసత్వం అప్పగించడం సాధారణ విషయం. కానీ, తాను ముఖ్యమంత్రిగా ఉండగా, కుమారుడితోపాటు కుమార్తెను బాగా ప్రోత్సహించారు కేసీఆర్. తాను తెలంగాణ కోసం ఉద్యమిస్తే తన పోరాటానికి సహకారంగా తెలంగాణ జాగృతి ద్వారా సంపద్రాయ భావోద్వాగాన్ని అద్దారు కవిత. దీంతో తెలంగాణ ఉద్యమానికి మహిళల నుంచి పెద్ద ఎత్తున మద్దుతు లభించింది. అయితే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కవిత అనూహ్యంగా అనేక చిక్కుల్లో చిక్కుకున్నారు. తనకు సొంత నియోజకవర్గం అంటూ ఒకటి ఏర్పాటు చేసుకోలేకపోవడంతోపాటు రాజకీయంగా ఓటములు ఎదుర్కొంటూ వెనకబడిపోయారు.

ఇదే సమయంలో తన సోదరుడు భావిముఖ్యమంత్రిగా ప్రచారం జరుగుతుండటం, తన కష్టానికి ఎక్కడా గుర్తింపు దక్కడం లేదని ఆమె భావిస్తుండటంతో వేరు కుంపటికి నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు అధికారం లేదని బాధపడుతున్న కేసీఆర్ కి పిల్లల మధ్య ఆధిపత్య పోరు మరింత తలపోటుగా మారిందని అంటున్నారు. దీంతో తన గారాలపట్టికి సమన్యాయం ఎలా చేయాలన్నదానిపై ఆయన దృష్టి పెట్టారని అంటున్నారు. అందుకే కవిత 20 రోజుల క్రితం రాసిన లేఖను తాజాగా బయటపెట్టారని అంటున్నారు. ఈ లేఖ ద్వారా ప్రజల్లో చర్చ జరిగితే, అందులో మంచి చెడులపై సమాచారం తెప్పించుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.

పార్టీలో కేటీఆర్ కు ప్రమోషన్ ఇస్తే ఆయన స్థానంలో కవితను పెట్టడంపై ఎవరికైనా అభ్యంతరం ఉంటుందా? ప్రధాన నేతగా చెలామణి అవుతున్న మాజీ మంత్రి, తన మేనల్లుడు హరీశ్ రావు ఎలా స్పందిస్తారన్నది కూడా కేసీఆర్ ఆలోచనగా ఉందని అంటున్నారు. అంతేకాకుండా ప్రతిపక్షంలోకి వచ్చిన నుంచి హరీశ్ రావు, కేటీఆర్ కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల హరీశ్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లారు. ఇదే సమయంలో వరంగల్ సభలో హరీశ్ రావు కటౌట్లు సరిగా లేవంటూ కవిత లేవనెత్తారు. అంటే బీఆర్ఎస్ లో ఎవరు నేతగా ఉండాలన్నా మాస్ ఫాలోయింగు ఉన్న హరీశ్ రావు మద్దతు అవసరమనే అభిప్రాయం ఉంది. ఈ పరిస్థితుల్లో హరీశ్ ఆలోచన ఏంటన్నది తెలియాల్సివుంది. అందుకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా కవిత లేఖను లీక్ చేశారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బిడ్డ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలనే ఆలోచనతో కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News