వెయ్యి రోజుల్లో మ‌నం వ‌స్తున్నాం!: క‌విత‌

టీఆర్ ఎస్ ఆవిర్భావ వేళ తాను ప్ర‌క‌టించిన పాంచ‌జ‌న్యం(5 హామీలు) అమ‌లు చేసి తీరుతామ‌ని క‌విత చెప్పారు.;

Update: 2026-05-02 09:48 GMT

తెలంగాణ ర‌క్ష‌ణ స‌మితి(టీఆర్ ఎస్‌) చీఫ్ కల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు నిప్పులు చెరుగుతున్నార‌ని, త్వ‌ర‌లోనే టీఆర్ ఎస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆమె చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అరాచ‌క వాదిగా మారార‌ని.. ఆయ‌న అరాచ‌కాల‌కు మ‌రో 800 రోజులు మ‌హా అయితే.. వెయ్యి రోజుల గ‌డువు మాత్ర‌మే ఉంద‌న్నారు. ఆ త‌ర్వాత‌.. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపి.. టీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌న్నారు.

శ‌నివారం ప్రెస్‌క్ల‌బ్ లో మీడియాతో మాట్లాడిన క‌విత‌.. వెయ్యి రోజుల కార్యాచ‌ర‌ణ‌ను రెడీ చేస్తున్నామ‌న్నా రు. ప్ర‌తి గ్రామం, మండ‌లం, జిల్లాలో టీఆర్ ఎస్ కోసం ప్ర‌జ‌లు వేయి క‌ళ్ల‌తో వేచి చూస్తున్నార‌ని తెలిపా రు. ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకునే తీరిక లేని పాల‌కులు వ‌ద్ద‌ని ప్ర‌జ‌లు చెబుతున్నార‌ని అన్నారు. గ‌తంలో కూడా ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్లే.. ఆ నాయ‌కుడు(కేసీఆర్‌) ఫామ్ హౌస్‌లో పడుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు.

హైడ్రా వ‌చ్చింది.. అక్ర‌మార్కుల‌ను బెదిరించేందుకు కాద‌ని.. పేద‌ల‌ను బెదిరించి.. వారి ఇళ్లు కూల‌గొట్టి ముఖ్య‌మంత్రికి మేలు చేసేందుకు వ‌చ్చింద‌ని క‌విత దుయ్య‌బ‌ట్టారు. పేద‌ల ఇళ్లంటే హైడ్రాకు ఆట విడుపుగా మారింద‌ని అన్నారు. ఏ పెద్ద‌ల జోలికైనా హైడ్రా వెళ్లిందా? ఏ మంత్రి ఇంటిముందుకైనా హైడ్రా వెళ్లే ధైర్యం ఉందా? మాజీ మంత్రుల అక్ర‌మ ఇళ్ల‌ను కూల‌గొట్టే ధైర్యం ఉందా? అని నిల‌దీశారు. ఇలాంటి వ్య‌వ‌స్థ వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఒరిగింది క‌న్నీరేన‌ని.. పేద‌లు రోడ్డు పాల‌వుతున్నార‌ని అన్నారు.

పాంచ‌జ‌న్యానికి క‌ట్టుబ‌డ్డాం..

టీఆర్ ఎస్ ఆవిర్భావ వేళ తాను ప్ర‌క‌టించిన పాంచ‌జ‌న్యం(5 హామీలు) అమ‌లు చేసి తీరుతామ‌ని క‌విత చెప్పారు. వీటిపై ప్ర‌జ‌ల‌కు అవగాహ‌న కూడా క‌ల్పిస్తామ‌న్నారు. 4 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు ఇస్తామంటే న‌వ్వేటోళ్ల‌కు బుద్ధి చెబుతామ‌ని వ్యాఖ్యానించారు. ల‌క్ష ఉద్యోగాల‌ను సూప‌ర్ న్యూమ‌ర‌రీ కింద ఉద్య‌మ కారుల‌కు ఇస్తామంటే న‌వ్వుతున్నార‌ని.. కానీ, ఇవ‌న్నీ చేసి చూపిస్తామ‌ని.. పాంచ‌జన్యం పూరించి.. ప్ర‌జా ద్రోహుల‌ను వెళ్ల గొడ‌తామ‌ని త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు. ప‌నిచేయ‌డం తెలియ‌ని వారి గురించి తాను మాట్లాడ‌బోన‌ని ప‌రోక్షంగా కేటీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

Tags:    

Similar News