ఇన్నయ్య.. నరేంద్ర.. విజయశాంతి.. ఈటల.. గులాబీ నుంచి రేకులెన్నో?
2001లో బీఆర్ఎస్ ఏర్పడినప్పుడు గాదె ఇన్నయ్య, మందాడి సత్యనారాయణరెడ్డి తదితరులు సభ్యులుగా ఉన్నారు.;
కొన్ని రోజులుగా ఒకటే చర్చ.. తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ (ఒకనాటి టీఆర్ఎస్)లో అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అసమ్మతి.. తాజాగా ఆమె రాసిన లేఖ బయటకు రావడం.. అదే సమయంలో కవిత అమెరికా నుంచి తిరిగొచ్చి తన దేవుడు లాంటి డాడీ చుట్టూ దెయ్యాలు ఉన్నాయనడం సంచలనంగా మారింది. ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ.. అధికారంలో ఉన్నప్పుడు కానీ.. బీఆర్ఎస్ లో అధినేత కేసీఆర్ చెప్పిందే శాసనం. ఇప్పుడు ప్రతిపక్షంలో.. కేసీఆర్ మౌనంగా ఉన్నా ఆయన మౌనమే శాసనం. పార్టీని, అధిష్ఠానాన్ని ధిక్కరించే, తన అభిప్రాయాలతో విభేదించే వారిని కేసీఆర్ ఉపేక్షించరు. అది పార్టీ వ్యవస్థాపన నుంచి ఉన్న నేతలైనా.. తాను ఎంతగానో చేరదీసిన, అభిమానించిన నాయకులైనా సరే..
2001లో బీఆర్ఎస్ ఏర్పడినప్పుడు గాదె ఇన్నయ్య, మందాడి సత్యనారాయణరెడ్డి తదితరులు సభ్యులుగా ఉన్నారు. కానీ, కాలక్రమంలో ఇన్నయ్య పార్టీ నుంచి వైదొలగారు. మందాడి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు.
తెలంగాణ టైగర్ గా గుర్తింపు తెచ్చుకున్న, బీజేపీలో మంచి పేరున్న, బీసీ నాయకుడు అయిన ఆలె నరేంద్ర 2004 నాటికి బీఆర్ఎస్ లోకి వచ్చారు. నాటి ఎంపీ ఎన్నికల్లో మెదక్ నుంచి గెలిచి కేంద్రంలో సహాయ మంత్రి కూడా అయ్యారు. కానీ, మూడేళ్లలోనే నరేంద్ర బీఆర్ఎస్ ను వదిలేయాల్సి వచ్చింది. అధినేత కేసీఆర్ ఆయనపై వేటు వేశారు.
బీజేపీలో చేరి, తల్లి తెలంగాణ పార్టీ పేరిట సొంతంగా పార్టీని పెట్టిన విజయశాంతి.. నరేంద్ర స్థానాన్ని భర్తీ చేస్తూ.. 2004లో ఆయన గెలిచిన మెదక్ నుంచే 2009లో గెలిచి ఎంపీ అయ్యారు. 2009-14 మధ్య తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగిన సమయంలో కేసీఆర్, విజయశాంతి మాత్రమే ఆ పార్టీ పార్లమెంటు సభ్యులు. కానీ, 2014 నాటికి విజయశాంతి కూడా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు.
2001 నుంచి బీఆర్ఎస్ లో ప్రధాన పాత్ర పోషిస్తూ.. 2014లో రాష్ట్రం ఏర్పడ్డాక మంత్రి కూడా అయి.. కీలక బాధ్యతలు చూసిన ఈటల రాజేందర్ 2021 నాటికి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. వీరంతా బీఆర్ఎస్ ను పుట్టించి, పెంచి, పెద్దచేసిన అధినేత కేసీఆర్ కు ఓ దశలో ఎంతో సన్నిహితులు.
ఇప్పుడు చూస్తే అధినేత కేసీఆర్ ఎంతో ప్రేమించే కుమార్తె కవితనే పార్టీలో అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. పైకి ఆమె లేఖ మాత్రమే కనిపిస్తున్నా.. తనను పార్టీలో అణగదొక్కుతున్నారని ఇటీవల ప్రకటించడాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మరోవైపు కవిత లేఖ రాసి అమెరికా వెళ్లిన సమయంలోనే బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్ ఆకస్మికంగా సమావేశమయ్యారు. దీనికి ఎవరూ అప్పట్లో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. మరిప్పుడు పరిస్థితులు ఎక్కడకు దారితీస్తాయో?