వైసీపీ నుంచి కావటి మనోహర్ నాయుడు సస్పెన్షన్ కు అంబటి కారణమా?
గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు వైసీపీకి రాజీనామా చేయడం వెనుక గ్రూపు తగాదాలే కారణమా? అన్న చర్చ జరుగుతోంది.;
గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు వైసీపీకి రాజీనామా చేయడం వెనుక గ్రూపు తగాదాలే కారణమా? అన్న చర్చ జరుగుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అంబటి రాంబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనతో కావటికి పొసగలేదని చెబుతున్నారు. అధిష్టానం వద్ద తనకు ఉన్న పలుకుబడితో కావటిపై అంబటి సస్పెన్షన్ వేటు వేయించారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ మేయర్ గా పనిచేసిన కావటికి కార్పొరేషన్ లో అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. దీంతో ఆయన తన పదవిని వదులుకోవాల్సివచ్చిందని అంటారు. అదే సమయంలో కావటికి పార్టీ నుంచి మద్దతు లభించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి కారణమంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గుంటూరు మేయర్ గా ఉంటూ 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు మనోహర్ నాయుడు. అయితే ఎన్నికల్లో ఓడిన ఆయన గుంటూరు మేయరుగా ఈ ఏడాది మార్చి వరకు కొనసాగారు. స్టాండింగ్ కౌన్సిల్ లో ఓటమి, అధికారుల నుంచి సహాయ నిరాకరణ, సొంత పార్టీ సభ్యుల ఫిరాయింపులతో మార్చి నెలలో తన పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో మాజీ సీఎం జగన్ దయతోనే తనకు మేయర్ పదవి వచ్చిందని చెప్పారు. అయితే ఏమైందో కానీ, ఈ నెల ఆరంభంలో కావటిని వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.
2011లో వైసీపీ ఆవిర్భవించిన నుంచి కావటి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన సేవలకు నిదర్శనంగానే మేయర్ పదవితోపాటు చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం ఇచ్చారని చెబుతున్నారు. అయితే మేయర్ పదవికి రాజీనామా తర్వాత ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపణలతో కావటిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. దీనికి కారణం మాజీ మంత్రి అంబటి అంటూ మనోహర్ నాయడు అనుచరులు విమర్శిస్తున్నారు.
పార్టీ వేటు వేసిన నుంచి మౌనంగా ఉంటున్న కావటి ఇటీవల తన అనుచరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతున్నారని అంటున్నారు. సత్తెనపల్లిలో ఓడిపోయిన అంబటి గుంటూరు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసకున్న తర్వాత తనకు వ్యతిరేకంగా అధిష్ఠానానికి నివేదికలు ఇచ్చినట్లు ఆయన ఆరోపిస్తున్నారని చెబుతున్నారు.తానొక్కడినే కాదని, జిల్లాలోని ఏడు నియోజవకర్గాల ఇన్చార్జిలతో అంబటికి విభేదాలు ఉన్నట్లు కావటి చెబుతున్నారు. తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, అనవసరంగా తమ రాజకీయాల్లో తలదూర్చుతున్నారని అంబటిపై విమర్శలు చేస్తున్నారు.