నాడు - నేడు... పురుషులపైనే ఉగ్రదాడి వెనుక?

అనంత్ నాగ్ జిల్లాలో ఛత్తిసింగ్ పొరలో 2000 మార్చి 20న ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సిక్కువర్గంలోని వారిని లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డారు.;

Update: 2025-04-23 08:30 GMT

అనునిత్యం భారత్ నాశనం కోరుకోవడమే పాక్ ఉద్దేశ్యం అనే సంగతి తెలిసిందే! కోరిక కశ్మీర్ అని పైకి చెబుతున్నా.. ఆ విషయంలో భారత్ ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టాలనో.. లేక, కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమాజం ముందు ప్రపంచ సమస్యగా చెప్పాలనో తెలియదు కానీ.. విదేశీ అతిథులు భారత్ లో పర్యటిస్తున్నప్పుడే ఉగ్రదాడులు జరుగుతుంటాయి.

అవును... ఓ పక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు.. మరోపక్క అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ లో పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ సమయంలోనే జమ్ముకశ్మీర్ లోని పహల్గాం దాడి చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో... జమ్మూకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి ఇలాంటివే సువర్ణావాకాశాలని పాక్ భావిస్తోందని అంటున్నారు!

2000 మార్చి 20!:

అనంత్ నాగ్ జిల్లాలో ఛత్తిసింగ్ పొరలో 2000 మార్చి 20న ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సిక్కువర్గంలోని వారిని లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డారు. ఈ ఉగ్రదాడిలో 36 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. అయితే.. సరిగ్గా ఆ సమయంలోనే అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ న్యూఢిల్లీలో ఉన్నారు.

నాడు జమ్మూకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే లక్ష్యంతోనే అమెరికా అధ్యక్షుడు భారత్ లో పర్యటిస్తోన్న సమయంలో పాక్ ఈ దాడికి పాల్పడినట్లు భావించారు.

2025 ఏప్రిల్ 22!:

ఇక తాజాగా ఏప్రిల్ 22 మంగళవారం పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కూడా అమెరికా అతిథులు భారత్ లో పర్యటిస్తున్న సమయంలోనే జరగడం గమనార్హం. ప్రస్తుతం అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సతీసమేతంగా భారత్ లో పర్యటిస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలో ఉగ్రవాదులు పర్యటకులపై రెచ్చిపోయారు. 28 మంది పురుషులను పొట్టన పెట్టుకున్నారు!

అయితే... ఈ రెండు సందర్భాల్లోనూ ఉగ్రమూకలు పురుషులనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం గమనార్హం. నాడు బిల్ క్లింటన్ పర్యటన సందర్భంగా... ఛత్తీస్ పొర గ్రామంలోకి వచ్చిన ఉగ్రమూకలు.. సైనిక సిబ్బంది తనిఖీల నిమిత్తం పురుషులు బయటకు రావాలని ఆదేశించారు. ఆ తర్వాత వారందరినీ కాల్చి చంపారు.

ఇక తాజా ఘటనలోనూ మహిళలను, చిన్నపిల్లలను వదిలేసి కేవలం పురుషులపైనే ఉగ్రమూకలు దాడి చేశాయి. దీంతో... ఈ రెండు నరమేధాలకూ దగ్గరి సంబంధాలు కనిపిస్తున్నాయనే చర్చ తెరపైకి వచ్చింది.

Tags:    

Similar News