జగన్ నెక్ట్స్ టూర్ అక్కడికే.. వైసీపీ అధినేత చేతికి కీలక అస్త్రం!

ఏపీ రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ముగిసిన తర్వాత రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.;

Update: 2025-07-15 21:30 GMT

ఏపీ రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ముగిసిన తర్వాత రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. ఏడాది పాలన సక్సెస్ అంటూ టీడీపీ.. హామీలు ఏవీ నెరవేరలేదంటూ ప్రతిపక్ష వైసీపీ బల ప్రదర్శనకు దిగాయి. టీడీపీ ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ అన్న కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పర్యటిస్తుండగా, ప్రభుత్వంపై దశల వారీగా పోరాటంలో భాగంగా వైసీపీ జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది. ‘రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ పేరుతో వైసీపీ చేపడుతున్న ఈ కార్యక్రమం రాజకీయంగా వేడి రాజేస్తోంది. మరోవైపు జిల్లాల పర్యటనల ద్వారా వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.

అధికారం కోల్పోయిన కొద్ది నెలలకే మళ్లీ యాక్టివ్ అయిన మాజీ సీఎం జగన్.. క్రమంగా ఒక్కో అంశాన్ని, సమస్యలను అందిపుచ్చుకుని ప్రభుత్వంపై పోరాడుతున్నారు. తొలుత గుంటూరులో మిర్చి రైతులను పరామర్శించిన మాజీ సీఎం జగన్ ఆ తర్వాత పొదిలిలో పొగాకు రైతులను, బంగారుపాళ్యంలో మామిడి రైతుల సమస్యలపై గళం ఎత్తారు. అదే విధంగా ధాన్యం సేకరణతోపాటు రైతులకు సంబంధించిన పలు సమస్యలపై పోరాడుతూ తాను నోరు విప్పిన తర్వాతే ప్రభుత్వ స్పందిస్తోందన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపుతున్నారు. ఇక తాజాగా తాను అధికారంలో ఉండగా ప్రతిపాదించిన ప్రాజెక్టునే అస్త్రంగా చేసుకుని కూటమి ప్రభుత్వంపై బాణం ఎక్కుపెట్టేలా మరో అవకాశం అందిపుచ్చుకున్నారు జగన్.

జగన్ సీఎంగా ఉండగా, నెల్లూరు జిల్లా కరేడులో ఇండోసోల్ సోలార్ పవర్ ఇండస్ట్రీకి ప్రతిపాదనలు వచ్చాయి. అయితే అప్పట్లో జగన్ బినామీ కంపెనీ అంటూ టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. ఏ కారణం చేతో జగన్ అధికారంలో ఉండగా, కరేడులో ఇండోసోల్ సోలార్ పవర్ ప్రతిపాదనలు ముందుకు కదల్లేదు. కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం నాటి ప్రతిపాదనలనే పట్టాలెక్కించింది. అయితే ఇండోసోల్ కోసం పచ్చని పంట పొలాలను సేకరిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాడు విమర్శించిన వారే ఇప్పుడు కంపెనీ పెట్టేందుకు సహకరించడంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ ను కలిసి మద్దతు కోరారు.

మంగళవారం తాడేపల్లి వచ్చిన కరేడు గ్రామానికి చెందిన రైతులు వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. తమ పోరాటానికి మద్దతు కోరారు. పచ్చటి పంట భూముల్లో పవర్ ప్లాంట్ పెడతామని ప్రభుత్వం ప్రతిపాదించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రైతులకు ధైర్యం చెప్పిన మాజీ సీఎం జగన్, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దీంతో మాజీ సీఎం జగన్ నెక్ట్స్ వార్ కు గ్రౌండ్ రెడీ అయినట్లేనని అంటున్నారు. ఇప్పటివరకు జగన్ పర్యటనలపై పలు రకాల విమర్శలు చేసిన అధికార పక్షం.. ఆయన కరేడు వస్తే ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఏదిఏమైనా అధికార, విపక్షాల మధ్య యుద్ధానికి కరేడు కొత్త వేదిక కాబోతుందని అంటున్నారు.

Tags:    

Similar News