విజయవాడలో కాపుల భారీ సభకు రంగం సిద్ధం !
కాపుల భారీ సభను ఏపీ రాజకీయ రాజధాని విజయవాడలో నిర్వహించాలని కాపు సంఘాల నాయకులు నిర్ణయించారు.
కాపుల భారీ సభను ఏపీ రాజకీయ రాజధాని విజయవాడలో నిర్వహించాలని కాపు సంఘాల నాయకులు నిర్ణయించారు. విజయవాడ గాంధీనగర్‌లోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో దివంగత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభను తాజాగా కాపు సంఘాలు ఘనంగా నిర్వహించాయి. ఈ సభకు వివిధ పార్టీల కాపు నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభలో ప్రముఖులు ప్రస్తావించిన ముఖ్యమైన అంశాలు చూస్తే కనుక ముద్రగడ పద్మనాభానికి సంస్మరణగా విజయవాడలో కాపుల ఐక్యతను చాటేలా తొందరలోనే భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు.
కాపుల ఐక్యత అంటూ :
ఇక దే సమావేశంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ కాపుల ఐక్యత చాటాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను విజయవాడ సెంట్రల్ లో ముద్రగడ పద్మనాభం భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తాను అని ఆయన ప్రకటించారు. కాపులంతా రాజకీయాలకు అతీతంగా కలసి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవాలని బోండా ఉమా పిలుపు ఇవ్వడం విశేషం. తెలుగుదేశం నాయకుడిగా ఎమ్మెల్యేగా ఉన్న బోండా ఉమా కాపుల ఐక్యత అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషంగా చూస్తున్నారు. మరో వైపు చూస్తే ముద్రగడ వంటి వారిని స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని కూడా కోరారు.
అన్ని రాజకీయ పార్టీలతో :
ఇక కాపుల హక్కులు రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసం జీవితాంతం చేసిన పోరాటాలను చేసిన నాయకుడిగా ముద్రగడను పలువురు కాపు నేతలు కొనియాడారు. భౌతికంగా ముద్రగడ ఈ రోజున అందరి మధ్యన లేకపోయినా, ఆయన ఆశయాలు చిరకాలం సజీవంగా ఉంటాయని గుర్తుచేసుకున్నారు.ముద్రగడ ఆశయ సాధనకు, కాపు సమాజ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి త్వరలోనే విజయవాడలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కాపు నాయకులతో ఓ భారీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించడంతో రాజకీయ రాజధాని వేదికగా సంచలన నిర్ణయాలు ఉంటాయా అన్న చర్చ సాగుతోంది.
ఒకే రోజు రెండు చోట్ల :
ఇదిలా ఉంటే జూలై 20న ఒకే రోజున రెండు చోట్ల ముద్రగడను తలుస్తూ వేరు వేరుగా కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. రాజమండ్రిలో జరిగిన ముద్రగడ సంస్మరణ సభకు వైసీపీ నేతలు ఎక్కువగా తరలి వచ్చారు. అలాగే పాత కాంగ్రెస్ నేతలు కూడా హాజరయ్యారు. వంగవీటి రాధా జ్యోతుల నెహ్రూ వంటి టీడీపీ నేతలు వచ్చినప్పటికీ మెజారిటీ అంతా వైసీపీ నేతలే ఉండడం విశేషం. అదే రోజున విజయవాడలో నిర్వహించిన ముద్రగడ సంస్మరణ సమావేశంలో టీడీపీ జనసేన నేతలు ఎక్కువగా పాల్గొనడం విశేషం. ముద్రగడ విగ్రహంతో పాటు విజయవాడలో కాపు సభను నిర్వహిస్తామని చెప్పడం కూడా ఈ సభలో హైలెట్ గా ఉంది. మొత్తం మీద చూస్తే రాజకీయాలకు అతీతంగా ముద్రగడ సంస్మరణ సభలు అని నిర్వహిస్తున్నా అందులో కూడా పార్టీల చాయలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇంకో వైపు మరోసారి కాపునాడు ఉద్యమాలు కాపుల ఐక్యత వంటి నినాదాలు వినిపిస్తున్నాయి. మరి ఏపీ రాజకీయాలలో ఈ సామాజిక ప్రకంపనలు ఏ విధమైన సంకేతాలను ఇస్తాయో ఏ రకమైన పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాల్సి ఉంది అని అంటున్నారు.