కలమట కలత తీర్చిన బాబు !

టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన సందర్భంగా పార్టీలో చెలరేగిన అసంతృప్తిని చల్లార్చే చర్యలు చేపట్టారు.

Update: 2024-04-25 04:00 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన సందర్భంగా పార్టీలో చెలరేగిన అసంతృప్తిని చల్లార్చే చర్యలు చేపట్టారు. పాతపట్నం టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ ఒక దశలో ఇండిపెండెంట్ గా పోటీకి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. దాని కంటే ముందు ర్యాలీలు నిర్వహించారు. బల ప్రదర్శనలు చేశారు. తనకు టికెట్ ఇవ్వాల్సిందే అని కూడా డిమాండ్ చేశారు.

తన సత్తా ఏంటో చూపిస్తాను అని ఆయన బస్తీ మే సవాల్ అన్నారు. దాంతో టీడీపీ హై కమాండ్ ఆయనతో సంప్రదింపులు జరిపింది. అయినా సరే కలమట దారికి రాలేదు. ఇక నామినేషన్ల పర్వం సాగుతూండగానే చంద్రబాబు ఉత్తరాంధ్రా పర్యటన పెట్టుకోవడం కీలకం. ఆయన రెబెల్స్ ని బుజ్జగించేందుకు దారికి తెచ్చేందుకే ఈ పర్యటన చేపట్టారు అని అంటున్నారు.

చంద్రాబాబు పర్యటన ఈ విధంగా సక్సెస్ అయింది అని అంటున్నారు. కలమట వెంకట రమణను దారికి తేవడమే కాదు ఆయన ఆగ్రహాన్ని చల్లార్చారు. దాంతో ఆయన పోటీ నుంచి విరమించుకోవడమే కాకుండా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.

అదే విధంగా చూస్తే కనుక విజయనగరం జిల్లాలో కూడా మాజీ ఎమ్మెల్యే మీసాల గీత నామినేషన్ దాఖలు చేస్తారు అని వినిపించింది. ఇపుడు ఆమె కూడా చల్లబడినట్లుగా తెలుస్తోంది. ఎస్ కోట నుంచి ఎన్నారై గంప క్రిష్ణ రెబెల్ గా ఉంటాను అని చెప్పారు. కానీ ఆయన సైతం తెల్ల జెండా చూపించేశారు. ఇపుడు మాడుగుల నుంచి ఎన్నారై పైలా ప్రసాదరావు, అలగే పాడేరు నుంచి రమేష్ నాయుడు నామినేషన్లు దాఖలు చేసి ఉన్నారు.

Read more!

వారిని కూడా నచ్చచెప్పి విత్ డ్రా చేసుకునేలా చూస్తున్నారు. మొత్తానికి అయితే అందరి కంటే ఎక్కువ హడావుడి చేసిన కలమట వెంకట రమణ ఎలా దారికి వచ్చారు అన్నది మాత్రం ప్రత్యర్ధులకు అర్ధం కాకుండా ఉందిట. ఏది ఏమైనా అసంతృప్తులు సెగలూ పొగలతో సిక్కోలు టీడీపీ చిరిగిన విస్తరాకు అయింది అని అనుకున్న వారికి ఇపుడు ఆ పార్టీలో ఐక్యతను చూసి షాక్ తగిలింది అంటున్నారు. ఈ ఐక్యత కొనసాగితే మాత్రం సైకిల్ పరుగులు తీయడం ఖాయం అని అంటున్నారు.

Tags:    

Similar News