3 రోజులు.. 62 ప్రశ్నలు.. కాకాణి సమాధానం మాత్రం ఒక్కటేనట

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మూడు రోజుల పాటు విచారించిన పోలీసులు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.;

Update: 2025-06-09 04:46 GMT

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మూడు రోజుల పాటు విచారించిన పోలీసులు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్ లో ఉన్న ఆయన్ను పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు ఇవ్వటం తెలిసిందే. ఈ మూడు రోజుల్లో ఆయన్ను విచారించిన పోలీసులు.. కాకాణి నుంచి ఎలాంటి సమాధానాన్ని పొందలేకపోయారు.

నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన్ను పోలీసులకు ఇచ్చిన మూడు రోజుల కస్టడీ ఆదివారంతో ముగిసింది. నెల్లూరు నుంచి క్రిష్ణపట్నం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు అధికారులు.. ఆయన్ను అక్కడే ఉంచి.. మూడు రోజులు విచారించారు. ఆయనపై ఉన్న ఆరోపణలకు సంబంధించిన అంశాలు.. వాటిని బలపరుస్తూ ఉన్న వాంగ్మూలాలు.. అక్రమ మైనింగ్ కు సంబంధించిన అన్ని వివరాల్ని పోలీసులు సేకరించినా.. కాకాణి నుంచి మాత్రం ఎలాంటి సమాధానం పొందలేకపోయినట్లుగా చెబుతున్నారు.

మూడు రోజుల విచారణలో మొదటి రోజు 22 ప్రశ్నలు సంధించగా.. రెండో రోజు 35 ప్రశ్నలు విచారణ అధికారులు ప్రశ్నించారు. మూడో రోజున ఐదు ప్రశ్నలు అడిగారు. అయితే.. వీటన్నింటికి కాకాణి నుంచి వచ్చిన ఆన్సర్ మాత్రం ఒక్కటేనని చెబుతున్నారు. అదేమంటే.. మౌనం. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆయన నోరు మెదపలేదని.. దాదాపుగా 62 ప్రశ్నలు అడిగినప్పటికీ.. ఏ ఒక్క దానికి సమాధానం ఇవ్వలేదని.. ఆయన నుంచి ఎలాంటి సమాచారాన్ని పోలీసులు రాబట్టలేకపోయినట్లుగా చెబుతున్నారు.

పోలీసుల విచారణకు పనికి వచ్చే ఏ ఆన్సర్ ఇవ్వని కాకాణి..మీడియా భేటీల సందర్భంగా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఆ తరహాలో మాట్లాడినట్లుచెబుతున్నారు. తనపై రాజకీయ ఒత్తిళ్లతో అక్రమ కేసులు నమోదు చేసినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించి ఏ1, ఏ2, ఏ3లుగా ఉన్న వారు పోలీసుల విచారణలో వెల్లడించిన వాంగ్మూలాన్ని చదివి వినిపించి.. ప్రశ్నలు అడిగినా.. మౌనంగా ఉండటం.. మరింత లోతుగా ప్రశ్నిస్తే.. తాను మర్చిపోయినట్లుగా చెప్పినట్లు తెలుసతోంది. కావాలంటే తమ లాయర్ తో మాట్లాడుకోవాలన్న మాటలు తప్పించి.. ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదంటున్నారు. ఈ కేసుకు సంబంధించి కాకాణి పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ రోజు జరగనుంది.

Tags:    

Similar News