ఓటేయడం మరచిపోయిన వైసీపీ అభ్యర్థి!

కడప జిల్లాలో జరిగిన రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.;

Update: 2025-08-13 05:51 GMT

కడప జిల్లాలో జరిగిన రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం జరిగిన పోలింగులో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోగా, పోలీసుల పకడ్బందీ చర్యలతో ఎన్నిక ప్రశాంతంగా ముగిసిపోయింది. ఇక ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరిగిన ఎన్నికల్లో పులివెందుల వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. సుమారు వారం రోజుల పాటు తనను గెలిపించాలని ఉదృతంగా ప్రచారం చేసిన హేమంత్ రెడ్డి పోలింగు రోజు కూడా ప్రచారం చేస్తూ ఓటు వేయడం మరిచిపోయారని చెబుతున్నారు.

మంగళవారం ఉదయం పోలింగు మొదలైన వెంటనే ఓటు వేయాలని హేమంత్ రెడ్డి భావించారు. అయితే ఉదయం నుంచే ఓటింగ్ సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం వల్ల ఆయన తన స్వగ్రామం తమ్మలపల్లిలోనే ఉండిపోయారు. సాయంత్రం వరకు సమయం ఉన్నందున తీరిగ్గా ఓటు వేయొచ్చని అనుకున్నారట. సాయంత్రం గ్రామంలో మిగిలిపోయిన ఓటర్లను గుర్తించి పోలింగు కేంద్రానికి వెళ్లమని చెబుతూ తాను మాత్రం వెళ్లలేకపోయారని చెబుతున్నారు. ఓటర్లను పోలింగు కేంద్రానికి పంపే హడావుడిలో ఉండిపోయిన హేమంత్ రెడ్డి తాను ఓటు వేయని విషయం గుర్తుకొచ్చి పోలింగు కేంద్రానికి రాగా, అప్పటికే సమయం ముగిసిపోవడంతో ఆయన ఓటు వినియోగించుకోలేపోయారు.

ఇక పులివెందులలో మొత్తం 76.44 శాతం ఓటింగు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ మండలంలో మొత్తం 10,600 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా ఒంటిమిట్టలో 81.53 శాతం పోలింగు నమోదైంది. ఓటింగు సందర్భంగా వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య అక్కడక్కడ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అయితే డీఐజీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో సుమారు 700 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించడంతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదు.

Tags:    

Similar News