జూబ్లిహిల్స్ పై రేవంత్ రెడ్డి మొండిపట్టు..

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు సాధారణంగా చిన్నపాటి ఎన్నికలుగా కనిపించినా, తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇవి ప్రతిష్టాత్మక పోరాటంగా మారిపోయాయి.;

Update: 2025-11-03 23:30 GMT

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు సాధారణంగా చిన్నపాటి ఎన్నికలుగా కనిపించినా, తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇవి ప్రతిష్టాత్మక పోరాటంగా మారిపోయాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది తన నాయకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని మరోసారి నిరూపించే పరీక్షగా మారింది. అందుకే ఈ ఉపఎన్నికను రేవంత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

* ప్రభుత్వ పనితీరుపై 'మినీ రిఫరెండం'

2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే జోష్‌తో మళ్లీ రంగంలోకి దిగారు. “ఈ ఎన్నిక సాధారణం కాదు, ఇది ప్రభుత్వ పనితీరుపై ప్రజల రిఫరెండం” అని బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలతో రేవంత్ కూడా ఈ పోరును సీరియస్‌గా తీసుకున్నారు. దీనిని కేవలం ఉపఎన్నికగా కాకుండా 'మినీ అసెంబ్లీ ఎన్నిక'గా భావించి, ఏ పరిస్థితిలోనూ కాంగ్రెస్ విజయం సాధించాలన్న సంకల్పంతో ముందుకు సాగాలని ఆయన తన పార్టీ నేతలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.

*రేవంత్ రెడ్డి కఠిన వ్యూహం: ప్రతీ బూత్‌కు బాధ్యత

జూబ్లీహిల్స్ గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి పకడ్బందీగా రూపొందించిన కార్యాచరణ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ వ్యూహంలో కఠినమైన బాధ్యతలు, కచ్చితమైన సమన్వయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి 100 మంది ఓటర్ల బాధ్యతను ఒక ఎమ్మెల్యేకు అప్పగించారు. ప్రతి 7 నుంచి 8 పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షించే బాధ్యతను ఒక మంత్రి లేదా రాష్ట్ర స్థాయి నాయకుడికి అప్పగించారు. ప్రతి రోజు కనీసం 250 ఇళ్లలో ఇంటింటి ప్రచారం తప్పనిసరి చేశారు. ప్రతి రాష్ట్ర నాయకుడు 20-30 మంది బృందంతో ప్రచారం చేయాలి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తాము ఉన్న ప్రాంతాల్లో డివిజన్ వారీగా పర్యవేక్షణ చేయాలి. ప్రచార గడువు ముగిసే నవంబర్ 9 వరకు మంత్రులు, నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు పిలిస్తే వెంటనే హాజరు కావాలి. నామినేటెడ్ పదవుల నాయకులు ఏడు రోజులపాటు ప్రజల మధ్యే ఉండాలి.ఈ కఠినమైన ప్రణాళికతో ఓటు శాతం పెంచడం, బూత్‌ స్థాయిలో కచ్చితమైన ప్రణాళికతో పని చేయించడం రేవంత్ లక్ష్యం.

* ఉద్దేశం స్పష్టం: కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు

ఈ ఉపఎన్నికను రాజకీయ ప్రతిష్ట పోరాటంగా మార్చడం వెనుక రేవంత్ రెడ్డి లక్ష్యం స్పష్టంగా ఉంది. జూబ్లీహిల్స్ ఫలితం కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు సూచించేలా ఉండాలి. తన నిర్ణయాత్మక ధోరణి చూస్తుంటే, ఈ ఉపఎన్నికను కేవలం స్థానిక పోటీగా కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు తిప్పే ప్రయత్నంగా మలచినట్లు స్పష్టమవుతోంది.

“రేవంత్ ప‌ట్టుబ‌డితే అంతే” అన్న మాట ఇప్పుడు కాంగ్రెస్ నేతల నినాదంగా మారింది. జూబ్లీహిల్స్ ఫలితం ఎటు వైపు వాలుతుందో తెలియాలంటే నవంబర్ 9 వరకు వేచి చూడాల్సిందే.. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, రేవంత్ ప్లాన్ ఈసారి మామూలుగా లేదుగా!

Tags:    

Similar News