జూబ్లీ హీట్ : టీడీపీ జనసేన వైసీపీ కీలకమా ?

ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఉంటూ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి.;

Update: 2025-11-05 10:30 GMT

ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఉంటూ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. తెలంగాణాలో అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తోంది. సహజంగా అయితే ఎన్డీయే మిత్రులు ఇక్కడ కూడా బీజేపీకి మద్దతు ఇవ్వాలి. తమ కూటమి పార్టనర్ కాబట్టి. అయితే బీజేపీకి ఏపీ పార్టీల ఆంధ్రా ముద్ర పడుతుంది అనుకుందో ఏమో కానీ బాహాటంగా పొత్తు పార్టీలను పిలవడం లేదు. సొంతంగా పోటీ చేస్తూనే వారి సాయం కోరుతోంది. అయితే జనసేన ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి బీజేపీకి మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ నేతలు కమలానికే ఓటు వేయమని ప్రచారంలోకి కూడా తాజాగా దిగిపోయారు.

టీడీపీ స్టాండ్ ఎటు :

ఇక తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఇక్కడ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ నుంచి 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఆ పార్టీకి బలం ఉంది. మరీ ముఖ్యంగా టీడీపీని ఇష్టపడే బలమైన సామాజిక వర్గం ఓట్లు కూడా ఇక్కడ అధికంగా ఉన్నాయి. లెక్క ప్రకారం అయితే బీజేపీకే టీడీపీ అభిమాన అనుకూల వర్గాలు సామాజిక వర్గాల ఓట్లు పడాలి. కానీ అఫీషియల్ గా అయితే టీడీపీ నుంచి ఏ ప్రకటన లేదని అంటున్నారు. దాంతో ఎవరికి తోచిన విధంగా వారు వ్యవహరించే వీలుంది. ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన ఒకనాడు టీడీపీలో ఒక వెలుగు వెలిగారు. పైగా బాబుకు సన్నిహిత నేతగా ఉన్నారు. దాంతో ఆయనకు అనుకూలంగా కాంగ్రెస్ కి మద్దతుగా ఒక బిగ్ టెస్ట్ గా ఉన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో టీడీపీని అభిమానించే సెటిలర్ల ఓట్లు పడవచ్చు అని అంచనా వేస్తున్నారు.

వైసీపీ సంగతి అదే :

వైసీపీ విషయం తీసుకుంటే ఆ పార్టీకి బీఆర్ఎస్ తో జిగినీ దోస్త్ ఉందని అంటారు. 2014 నుంచి ఈ రెండు పార్టీలు అధినాయకత్వాలు కూడా పరస్పరం సహకరించుకుంటూనే వస్తున్నాయి. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఈ రెండు పార్టీలు ఉన్నాయి. ఇద్దరికీ కష్టాలు ఉన్నాయి. దాంతో బీఆర్ఎస్ కి కాస్తా లేపే ఆ కార్యక్రమం అయినా వైసీపీ మద్దతు ఉంటుందని అంటున్నారు. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా బాగానే ఉన్నాయని అంటున్నారు దాంతో వైసీపీని అభిమానించేవారు అంతా బీఅర్ఎస్ వైపు ఉంటారు అన్న చర్చ అయితే ఉంది.

కీ రోల్ గా సెటిలర్స్ :

ఏపీకి చెందిన సెటిలర్స్ ఓట్లు పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయి. దాంతో ఈ ఓట్లే అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయిస్తాయని అంటున్నారు. ఈ ఓట్లతోనే గెలుపు సాధ్యపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీకి చెందిన ప్రధాన పార్టీల తీరు వాటి అధినాయకత్వాల ఆలోచనలు ఫ్యూచర్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి. ఏది ఏమైనా జూబ్లీ పోరులో ఏపీ పార్టీలు కూడా ఎదురెదురు నిలిచి మరీ అక్కడ తమ స్టాండ్ ఏమిటో చెబుతున్నారని అంటున్నారు. చూడాలి మరి ఎవరిది గెలుపు ఎవరిది వ్యూహం అన్నది.

Tags:    

Similar News