జూబ్లీహిల్స్‌లో కేంద్ర ఎన్నికల సంఘం.. రీజనేంటి?
హైదరాబాద్‌లోని కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీహిల్స్‌కు త్వరలోనే ఉప ఎన్నిక రానుంది.;
హైదరాబాద్‌లోని కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీహిల్స్‌కు త్వరలోనే ఉప ఎన్నిక రానుంది. ఇక్కడ నుంచి 2023లో విజయం దక్కించుకున్న మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణంతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే దీనిపై కసరత్తు ప్రారంభించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఇటీవల ఓటర్ల వివరాలతో ప్రకటన జారీ చేసింది. దీనిలో అన్ని వివరాలను వెల్లడించింది.
నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు.. పురుషులు ఎంతమంది..? మహిళలు ఎంత మంది? ఇలా.. అన్ని వివరాలను వెల్లడించింది. అంతేకాదు.. కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకునే వారికి ఈ నెల 30వ తేదీ(రేపు) వరకు అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అదేవిధంగా ప్రస్తుతం ఇంటింటి సర్వే కూడా సాగుతోంది. చనిపోయినవారు.. వలస వెళ్లిన వారి వివరాలను రాష్ట్ర ఎన్నికల అధికారులు సేకరిస్తున్నారు. వారి పేర్లను జాబితా నుంచి తొలగించనున్నారు.
ఈ క్రమంలో తాజాగా సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చారు. స్థానిక ఎన్నికల అధికారులతో వారు భేటీ అయ్యారు. స్థానికంగా ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వివాదాస్పద పోలింగ్ బూతులు, సమస్యాత్మక ప్రాంతాలు.. వంటివాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అదేవిధంగా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను కూడా అడిగి తెలుసుకున్నారు. అలాగే.. ఓటరు గుర్తింపు కార్డులు, జాబితాలను సిద్ధం చేసే విధానంపై వారికి అవగాహన కల్పించారు. ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ పరిణామాలను బట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా ఈ సీటు బీఆర్ ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఆ పార్టీ దూకుడుగా ఉంది. ఇప్పటికే ప్రచారానికి సంబం ధించి.. పెద్ద ఎత్తున ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఇక, అధికార పార్టీ కాంగ్రెస్ కూడా.. ఇక్కడ విజయం దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. మొత్తంగా ఒకవైపు.. స్థానిక సమరం.. మరోవైపు జూబ్లీహిల్స్ యుద్దం ఒకే సారి జరుగుతుండడం గమనార్హం.