డ్రైవింగ్ లైసెన్సు లేదా.. అయితే జీతం కట్.. తాడిపత్రిలో జేసీ సంచలన నిర్ణయం
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, సీనియర్ తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.;
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, సీనియర్ తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడూ హాట్ కామెంట్లతో పతాక శీర్షికల్లో నిలిచే జేసీ తాజా నిర్ణయం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రజా ప్రతినిధిగా ఆయన తీసుకున్న చర్యపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తన మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల క్షేమం కోరి జేసీ తీసుకున్న నిర్ణయం ఆదర్శనీయమని అంతా అంటున్నారు. అయితే ఆ నిర్ణయం తీసుకోడానికి జేసీ అనుసరించిన పద్ధతి మాత్రం విమర్శలకు తావిస్తోందని అంటున్నారు.
దూకుడు రాజకీయం, ఘాటు విమర్శలతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకత చాటుకుంటుంటారు. తన రాజకీయ ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో వ్యక్తిగత వైరం పెట్టుకున్న ఈ మధ్య రచ్చరచ్చ చేశారు జేసీ. అదేవిధంగా ఈ ఏడాది ప్రారంభంలో బీజేపీ మహిళా నేతలపై ఆయన చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపాయి. మరోవైపు ప్రతిపక్షం వైసీపీపై తరచూ పరుష వ్యాఖ్యలతో ఆయన విమర్శల దాడి చేస్తూనే ఉంటారు. ఇక నిన్న కాక మొన్న తాడిపత్రి మాజీ డీఎస్పీ చైతన్యను వదిలిపెట్టేది లేదన్న వార్నింగుతో కాక రేపారు. ఇలా నిత్యం అగ్గి రగుల్చుతూ రాజకీయంగా వాడివేడిగా సాగే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆకస్మాత్తుగా తన దృష్టి తాడిపత్రి మున్సిపల్ ఉద్యోగులపైకి మళ్లించారు.
తాడిపత్రి మున్సిపాలిటీతో పాటు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిలో ఎంత మందికి డ్రైవింగు లైసెన్సులు ఉన్నది తెలుసుకోవాలని భావించిన జేసీ ప్రభాకర్ రెడ్డికి మతిపోయినత పనైందని చెబుతున్నారు. 18 ఏళ్ల లోపు వయసు వారికి ద్విచక్ర వాహనాలు ఇస్తే నిబంధనల ప్రకారం తల్లి దండ్రులకు జైలు శిక్షలు వేయొచ్చని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ హోదాలో తన బిడ్డలు లాంటి సిబ్బందిలో ఎంతమందికి లైసెన్సులు ఉన్నాయో లేవో తెలుసుకోవాలని ప్రత్యేక సర్వే చేయించారట జేసీ. ఇందులో కేవలం 30 శాతం మందికి మాత్రమే లైసెన్సులు ఉన్నాయని, 70 శాతం మంది లైసెన్సులు లేకుండానే మోటారు సైకిల్లతో తిరుగుతున్నారని గ్రహించారు.
లైసెన్సు లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడాన్ని తీవ్ర నేరంగా పరిగణించిన జేసీ మున్సిపల్ చైర్మన్ గా సంచలన నిర్ణయం తీసుకున్నారు. లైసెన్సులు లేని మున్సిపల్, వార్డు సచివాలయ సిబ్బంది 84 మందికి ఈ నెల జీతాలు నిలిపివేసినట్లు జేసీ స్వయంగా ప్రకటించారు. వీరందరికీ ఐదు రోజులు సమయం ఇచ్చారు. ముందుగా డ్రైవింగ్ లెర్నర్ లైసెన్సు తీసుకోవాలని, అలా ఎల్ఎల్ఆర్ తీసుకున్నవారికి 6వ తేదీన జీతాలు చెల్లిస్తానని వెల్లడించారు. అంతేకాకుండా ఎల్ఎల్ఆర్ తీసుకున్న సిబ్బంది నెక్ట్స్ మంత్ పూర్తి స్థాయి డ్రైవింగు లైసైన్సును మున్సిపాలిటీలో చూపించాల్సివుంటుంది. అప్పుడే ఆ నెల జీతం చెల్లిస్తారు. జేసీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ నెల ఎల్ఎల్ఆర్ తీసుకోని వారికి జీతం కట్ అయిపోయినట్లేనని అంటున్నారు.
జీతాలు నిలిపివేయడం, డ్రైవింగు లైసెన్సులు తీసుకోమని సూచించడమే కాకుండా, కలెక్టర్, జిల్లా రవాణా అధికారితో మాట్లాడి తాడిపత్రి మున్సిపల్, వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్సు మేళా నిర్వహించాలని కూడా కోరుతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఉద్యోగుల సంక్షేమం కోసం ఆయన తీసుకున్న చర్య అభినందనీయమైనా, జీతాలు నిలిపివేయడంపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిర్ణయం తీసుకున్నది మొండి ఘటం జేసీ కనుక ఎవరూ పల్లెత్తి మాట్లాడటం లేదని అంటున్నారు. పెద్దాయన మొండిపట్టు తెలిసిన ఉద్యోగులు లైసెన్సుల కోసం రవాణా కార్యాలయానికి పరుగు తీస్తున్నట్లు సమాచారం.