జగన్ కాన్వాయ్ ఢీకొట్టలేదు.. కానీ ఆ వాహనం ఓనర్ మాత్రం...

ప్రమాదంపై టీడీపీ సోషల్ మీడియా మాత్రం జగన్ కాన్వాయే కారణమంటూ ఫొటోలు వైరల్ చేస్తోంది.;

Update: 2025-06-19 06:56 GMT

మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటనలో చోటుచేసుకున్న ప్రమాదాలపై వస్తున్న కథనాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. గుంటూరు బైపాస్ రోడ్డులోని ఏటుకూరు జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో వృద్ధుడు సింగయ్య మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి జగన్ కాన్వాయే కారణమని తొలుత విస్తృత ప్రచారం జరిగింది. అయితే బుధవారం మధ్యాహ్నం ఈ సంఘటనపై మాట్లాడిన గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ ప్రమాదానికి జగన్ కాన్వాయ్ కారణం కాదని చెప్పారు. అయితే ఇక్కడే ఓ ట్విస్టు ఉందని అంటున్నారు.

ప్రమాదంపై టీడీపీ సోషల్ మీడియా మాత్రం జగన్ కాన్వాయే కారణమంటూ ఫొటోలు వైరల్ చేస్తోంది. ప్రమాదానికి కారణమైన కారు (AP26CE0001 టాటా సఫారీ) జగన్ వాహన శ్రేణిలోనే ఉందని, అది విజయవాడకు చెందిన వైసీపీ నేత దేవినేని అవినాశ్ అనుచరుడిది అంటూ ఫొటోలు విడుదల చేసింది. అయితే అధికారిక సమాచారానికి, అధికార పార్టీకి మధ్య ఈ వైరుధ్యంపైనే చర్చ జరుగుతోంది.

జగన్ వాహన శ్రేణిలోనే ప్రమాదానికి కారణమైన కారు ఉన్నప్పటికీ అది మాజీ సీఎం జగనుకు ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన వాహనం కానందునే ఎస్పీ సతీశ్ కుమార్ అలా చెప్పారని అంటున్నారు. రెంటపాళ్ల పర్యటనకు జగన్ కాన్వాయ్ లో మూడు కార్లకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ, జగన్ పదుల సంఖ్యలో కార్లతో భారీ ర్యాలీగా తాడేపల్లి నుంచి రెంటపాళ్ల వెళ్లారు. ప్రమాదానికి కారణమైన కారు ఈ ర్యాలీలోనే ఉందని అంటున్నారు. అయితే అధికారికంగా జగన్ కాన్వాయ్ అని పోలీసులు చెబితే అనధికార ర్యాలీకి పోలీసులు అంగీకరించనట్లు అవుతుందన్న కారణంగా ఎస్పీ అలా చెప్పలేదని అంటున్నారు.

కానీ, టీడీపీ తన అధికారిక హ్యాండిల్స్ లో మాత్రం ప్రమాదానికి జగన్ కాన్వాయే కారణమని ప్రచారం చేస్తోంది. అంతేకాకుండా జగన్ పర్యటన సందర్భంగా ఇద్దరు మరణిస్తే ఏ ఒక్కరి కుటుంబాన్ని జగన్ పరామర్శించకపోవడాన్ని ఎత్తి చూపుతోంది. ఏడాది క్రితం బెట్టింగు కారణంగా చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఇప్పుడు పరామర్శించడాన్ని తప్పుపడుతోంది. మరోవైపు రెండు ప్రమాదాల్లో ఇద్దరు మరణిస్తే, కొందరు వైసీపీ నేతలు సత్తెనపల్లి ఆటోనగర్ కు చెందిన ఉదయకుమార్ రెడ్డి కుటుంబాన్ని మాత్రమే పరామర్శించడాన్ని టీడీపీ ప్రశ్నిస్తోంది.

Tags:    

Similar News