జగన్‌కు ఛాన్స్ ఇస్తోన్న చంద్రబాబు...?
రాజకీయాల్లో ప్రత్యర్థులు రోడ్డెక్కారంటే అది ఎవరి తప్పు? ప్రతిపక్ష నాయకులు రోడ్డెక్కకుండా ఉండాలంటే.. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? అనే విషయాలు ఏ రాష్ట్రంలో అయినా కీలకమే;
రాజకీయాల్లో ప్రత్యర్థులు రోడ్డెక్కారంటే అది ఎవరి తప్పు? ప్రతిపక్ష నాయకులు రోడ్డెక్కకుండా ఉండాలంటే.. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? అనే విషయాలు ఏ రాష్ట్రంలో అయినా కీలకమే. ఇప్పుడు ఏపీ విషయానికి వచ్చినా.. జగన్ దూకుడుగా ఉంటుంన్నా రు.నిన్న మొన్నటి వరకు ఆయన ఎలా ఉన్నారన్నది పక్కన పెడితే.. ఇప్పుడు మాత్రం ఆయన పర్యటనలు చేస్తున్నారు. కీలకమైన రెండు ప్రజా సమస్యలపై ఆయన స్పందించారు. దీనిని ఎవరూ కాదనలేరు. కానీ, ఈ విషయంలో సర్కారు సరిగా వ్యవహరించి ఉంటే అడిగే వారు ఎవరూ ఉండరు కదా!
జగన్ రోడ్డెక్కాడని బాధపడే బదులు.. అసలు ఆయన ఎందుకు బయటకు వస్తున్నాడన్న కోణంలో కూటమి సర్కారు ఆలోచన చేస్తోందా? అనేది ప్రశ్న. పొదిలి పర్యటన కావొచ్చు.. గుంటూరు మిర్చి యార్డు పర్యటన కావొచ్చు. ఈ రెండూ కూడా రైతుల కోణంలోనే జగన్ బయటకు వచ్చేలా చేశాయి. వాస్తవానికి ఈ రెండు పర్యటనలే వివాదానికి కూడా దారి తీశాయి. పొదిలి పర్యటనను తీసుకుంటే.. సుదీర్ఘకాలంలో పొగాకు రైతులకు మేలు జరగడం లేదు. ముఖ్యంగా బర్లీ పొగాకు పండించే రైతులు కన్నీరు పెడుతున్నారు. ఈ విషయం సర్కారుకు కూడా తెలుసు. కానీ, నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు వ్యవహరించారు.
ఆ తర్వాత.. వరుసగా జగన్ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. అప్పుడు పట్టించుకుని ఉంటే జగన్ బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. కానీ.. చిత్రంగా జగన్ పొదిలి పర్యటన తర్వాత.. సీఎం చంద్రబాబు నుంచి మంత్రుల వరకు దీనిపై స్పందించారు. ఢిల్లీ పెద్దలను అమరావతికి పిలిపించుకుని మాట్లాడారు. ఇదంతా వాస్తవానికి ముందుగానే చేసి ఉంటే.. జగన్‌కు ఛాన్స్ వచ్చేది కాదు. ఈ విషయంలో సర్కారు ఆలోచన చేసుకోవాలి. ఇక, గుంటూరు మిర్చి విషయంలోనూ ఇదే జరిగింది. ఇక్కడి రైతులు అనేక సందర్భాల్లో ప్రజాప్రతినిధులను కలుసుకుని విన్నపాలు చేశారు. తమను ఆదుకోవాలని కోరారు.
కానీ, ఎవరూ పట్టించుకోలేదు. కానీ, జగన్ వచ్చి.. ఇక్కడి రైతులను పట్టించుకున్నాక.. మరుసటి రోజే దీనిపై మంత్రివర్గంలో చర్చించడం.. మద్దతు ధరలపై సమీక్ష నిర్వహించడం వంటివి జరిగాయి. ఇది కూడా సర్కారే చేజేతులా జగన్‌కు అవకాశం ఇచ్చినట్టు అనిపించడం లేదు. ఇక, తెనాలి ఘటనలో .. బహిరంగ దండనకు ఎవరు అవకాశం ఇచ్చారు. ఇలాంటివి చేయడం ద్వారా తలెత్తే భావోద్వేగాన్ని ప్రతిపక్షం తనకు అనుకూలంగా మార్చుకుంటుందని అధికార పక్షం భావిస్తే.. ఎవరిది తప్పు. గతంలో డాక్టర్ సుధాకర్ అంశాన్ని టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకోలేదా?. సో.. రాజకీయాల్లో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండానే ఉండాలి. ఇచ్చాక.. చేతులు కాలాక.. స్పందించడం సరికాదనేది సీనియర్ విజన్ వున్న చంద్రబాబుకు ఎవరైనా చెప్పాలా..!