జ‌గ‌న్ ప్రైవేటు సైన్యం.. రాజ‌కీయమేనా ..!

వైసిపి అధినేత జగన్ తనకంటూ ప్రత్యేకంగా ప్రైవేటు సైన్యాన్ని నియమించుకుంటున్నారని తెలుస్తోంది. దీనిపై వార్తలు కూడా వస్తున్నాయి.;

Update: 2025-08-05 15:30 GMT

వైసిపి అధినేత జగన్ తనకంటూ ప్రత్యేకంగా ప్రైవేటు సైన్యాన్ని నియమించుకుంటున్నారని తెలుస్తోంది. దీనిపై వార్తలు కూడా వస్తున్నాయి. సుమారు 200 మంది దాకా బౌన్సర్లను ఆయన వ్యక్తిగత భద్రత కోసం వినియోగించుకుంటున్నారని పార్టీ వర్గాల్లోనూ కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. అయితే దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి రావాలనేది అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే అసలు జగన్ ప్రైవేటు సైన్యం వైపు వెళ్లడం అనేది రాజకీయంగా ఎటువంటి సంకేతాలను ఇస్తుంది. ఇది అధికార పార్టీ టిడిపికి ఎటువంటి ఇబ్బందులు కలిగిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది.

వాస్తవానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రిగా జగన్‌కు ప్రభుత్వం భద్రత కల్పించాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే గత రెండు నెలలుగా జగన్ చేసిన పర్యటనలు, ప్రజల్లోకి వచ్చినప్పుడు ఆయనకు కల్పించే భద్రత వంటి అంశాలు వివాదానికి దారి తీశాయి. తను జెడ్ కేటగిరి భద్రత లో ఉన్నానని కానీ కనీసం తాను వెళుతుంటే రోప్ పార్టీ కూడా ఉండడం లేదని జగన్ ఆరోపిస్తున్నారు. దీనిపై ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు.

తన ప్రాణాలకు రక్షణ కల్పించడం లేదని, తనకు మాజీ ముఖ్యమంత్రిగా అలాగే ఒక పార్టీ అధినేతగా ఇవ్వవలసిన మేరకు భద్రత ఇవ్వడం లేదనేది ఆయన చేస్తున్న వాదన. ఇది ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది. ఈలోగా 200 మంది ప్రైవేట్ సైన్యాన్ని జగన్ రంగంలోకి దింపుతున్నారని ఆయన వ్యక్తిగత భద్రతకు ఆయ‌నే ప్రాధాన్యం ఇస్తున్నారనేది తాజాగా వెలుగు చూసిన అంశం. ఒకరకంగా చెప్పాలంటే ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది తప్పు కాదు. వ్యక్తిగతంగా ఎవరి భద్రతను వాళ్ళు చూసుకోవడం కూడా నేరం ఏమి కాదు.

ఒకవేళ ప్రభుత్వం అనుమతించకపోయినా రేపు న్యాయస్థానాలు పరిధిలోకి వెళ్ళినప్పుడు కోర్టులైన అనుమతిస్తాయి. కానీ, ఇక్కడ ప్రధానంగా వస్తున్న విమర్శ రాష్ట్ర ప్రభుత్వం తనకు సరైన భద్రత కల్పించడం లేదు కాబట్టే తాను ప్రైవేటు సైన్యాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందనేది జగన్ చెబుతున్న మాట. ఇదే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. వాస్తవానికి రెంటపాళ్ళ ఘటనను తీసుకుంటే అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు నిజంగానే వివాదాస్పదమైంది. దీనిపై అంతర్గతంగా సీఎం చంద్రబాబు కూడా చర్చించారు.

పోలీసులు ఎక్కడా కనిపించకపోవడం సింగయ్య మృతి వంటి విషయాలు అప్పట్లో దుమారం రేపాయి. ఆ తర్వాత నెల్లూరు పర్యటనలో కూడా వైసిపి కార్యకర్తలను లేదా జగన్ను చూసేందుకు వస్తున్న వారిని కంట్రోల్ చేయడానికి ప్రాధాన్యం ఇచ్చిన పోలీసులు ఆయన భద్రతలకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న చర్చ కూడా ఉంది ఈ రెండు అంశాలు వైసిపి సీరియస్గా తీసుకుని ఇప్పుడు ప్రైవేట్ సైన్యం దిశగా అడుగులు వేసింది. తద్వారా ప్రభుత్వాన్ని ముఖ్యంగా టిడిపిని ఇరకాటంలో పెట్టాలనేది వైసిపి వ్యూహం. ఇది ఏ విధంగా సక్సెస్ అవుతుంది అనేది ఒక అంశం.

అయితే దీనిని టిడిపి ఏ మేరకు ఎదుర్కొంటుంది రేపు న్యాయస్థానాలకు వెళ్తే ఏ రకంగా వాదనలు వినిపిస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం దీని వెనక రాజకీయాలే ఉన్నాయి తప్ప వ్యక్తిగతంగా జగన్కు తాము ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదన్నది ప్రభుత్వ వర్గాలు చెబుతున్న మాట. కానీ వైసీపీ మాత్రం వ్యక్తిగతంగా జగన్ ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి తాము ప్రైవేటు సైన్యాన్ని నిర్మించుకుంటున్నామని చెబుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం అనేక రాజకీయం మలుపులు అయితే తిరుగుతోంది. ఏం జరుగుతుందనేది చూడాలి.

Tags:    

Similar News