కరెక్ట్ టైం లో కేసీఆర్ పేరు చెప్పిన జగన్
వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ కి తెలంగాణా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి మంచి అనుబంధం ఉందన్న సంగతి అంతా చెప్పుకుంటారు;
వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ కి తెలంగాణా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి మంచి అనుబంధం ఉందన్న సంగతి అంతా చెప్పుకుంటారు. ఈ ఇద్దరూ అధికారంలో ఉన్న కాలంలో రెండు రాష్ట్రాలకు జరిగిన మేలు ఏమిటి అన్నది పక్కన పెడితే ఇద్దరూ ఎంతో సన్నిహితంగా మెలిగారు అన్నది మాత్రం అంతా చెప్పుకునేవారు. జగన్ కేసీఆర్ ఇంటికి విందుకు వెళ్తే కేసీఆర్ ఏపీకి వచ్చి జగన్ నివాసంలో ఆయనతో గడిపిన ముచ్చట్లు ఉన్నాయి. ఈ ఇద్దరికీ మంచి దోస్తీ కుదిరింది అని అంతా అనుకునేవారు.
జూబ్లీ హిల్స్ హీట్ వేళ :
తెలంగాణలో రెండేళ్ళ క్రితం బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. నిజానికి హ్యాట్రిక్ సీఎం గా తెలుగు రాష్ట్రాలలో కేసీఆర్ సరికొత్త చరిత్ర సృష్టిస్తారు అని గులాబీ పార్టీ పూర్తిగా నమ్మింది. కానీ జరిగింది వేరు. ఓటమి తరువాత పది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ వైపు మళ్ళారు. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటూ బీఆర్ఎస్ గెలుచుకోలేదు, మరో వైపు చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇపుడు బీఆర్ఎస్ కి అతి పెద్ద సవాల్ గా మారింది. ఆ సీటు నుంచి గతంలో రెండు సార్లు బీఆర్ఎస్ గెలిచింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ కి అధికారం ఉంది, దాంతో ఆ పార్టీ దూకుడు చేస్తోంది. అయితే హైదరాబాద్ పరిసరాలలో చూస్తే కనుక బీఆర్ఎస్ కి మంచి పట్టు ఉంది. ఒక బలమైన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ తెలివిగానే అభ్యర్థి ఎంపికతో పాటు అన్నీ చూసి మరీ బరిలోకి దిగింది.
కేసీఆర్ కి కితాబు :
ఇదిలా ఉంటే కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యారు ఆయన పాలన బాగుందని అంటారు. అయితే మార్పు కోసమో మరో కారణంగానో కాంగ్రెస్ కి చాన్స్ ఇచ్చారు. బీఆర్ఎస్ అతి ధీమా కూడా ఓటమికి కారణం. అభివృద్ధిని కోరుకునే అర్బన్ ఓటర్లు మాత్రం 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ కే పట్టం కట్టారు. ఇపుడు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అర్బన్ సెక్టార్ లోనే జరుగుతోంది. సరిగ్గా ఈ సమయంలో కేసీఆర్ మంచి పాలన అందించారు అని ఏపీ మాజీ సీఎం జగన్ కితాబు ఇవ్వడం తెలంగాణ ఉప ఎన్నికల వేళ అత్యంత కీలకమైన అంశంగా మారుతోంది. తెలంగాణా సహా హైదరాబాద్ అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారు అన్న జగన్ మాటలు నిజంగా ఈ సమయంలో బీఆర్ఎస్ కి ఎంతో బూస్టింగ్ ఇచ్చినట్లే అని అంటున్నారు.
యాంటీ కాంగ్రెస్ స్టాండ్ :
ఇక వైసీపీ పొలిటికల్ ఫిలాసఫీ చూస్తే యాంటీ కాంగ్రెస్ స్టాండ్ గా ఉంటుంది. తనను అన్యాయంగా కాంగ్రెస్ అరెస్ట్ చేయించింది అన్నది జగన్ కి ఈ రోజుకీ ఉందని అంటారు. అంతే కాదు ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని పూర్తిగా తిప్పుకుని వైసీపీ ఆవిర్భవించింది. అందువల్ల కాంగ్రెస్ ఎదగకూడదు అన్నదే ఉంటుంది. తెలంగాణలో అధికారంలోకి కాంగ్రే ఎట్టకేలకు రాగలిగింది కానీ ఆ ప్రభావం ఇప్పటిదాకా అయితే ఏపీ మీద పడలేదు, అయినా వైసీపీ తన అప్రమత్తతో ఉంటోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కాకుండ బీఆర్ఎస్ గెలవలాని సహజంగానే వైసీపీకి ఉంటుందని అంటారు. అందుకే కరెక్ట్ టైం లో తన మిత్రుడిని మంచి పాలన అందించారు అని పొగుడుతూ జగన్ ఏపీలో ఈ తరహా వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు. మరి దీని ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అన్నది చూడాల్సి ఉంది.