బాబు మీద జగన్ కి పెద్ద డౌటే మరి !
నిజానికి చంద్రబాబుకు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఉద్దేశ్యం ఉంటే కచ్చితంగా బీసీ రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తూ ముందుకు వెళ్ళేవారు అని జగన్ అన్నారు.
ఏపీలో స్థానిక ఎన్నికల వేడి రాజుకుంది. ప్రస్తుతం రాజకీయ పార్టీలు అన్నీ సమావేశాలు ఎన్నికల వ్యూహాలతో హోరెత్తిపోతున్నాయి. కూటమిలోని మూడు పార్టీలతో పాటు వైసీపీ కూడా పెద్ద ఎత్తున స్థానిక ఎన్నికల విషయంలో సన్నాహాలు చేసుకుంటోంది. జగన్ సైతం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో మీటింగ్స్ పెడుతున్నారు. ఆయన తాజాగా పార్టీ నేతల సమావేశంలో స్థానిక ఎన్నికల మీద కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి స్థానిక ఎన్నికలు సజావుగా జరుగుతాయని నమ్మకం లేదని జగన్ చెప్పడం విశేషం. అదే సమయంలో అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా అని మరో పెద్ద డౌట్ వ్యక్తం చేశారు.
బీసీ రిజర్వేషన్లు అంటూ :
నిజానికి చంద్రబాబుకు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఉద్దేశ్యం ఉంటే కచ్చితంగా బీసీ రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తూ ముందుకు వెళ్ళేవారు అని జగన్ అన్నారు. అలా కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో జారీ చేయడమేంటని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలొ 34 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికల్లో ఇవ్వాలని జీవో ఇస్తే దానికి హైకోర్టు కొట్టేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. అలాగే తెలంగాణాలోనూ జరిగింది అన్నారు. కోర్టు తీర్పులు ఇంత కచ్చితంగా ఉంటే అవన్నీ తెలిసి కూడా చంద్రబాబు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అని ఎలా సాధ్యం అవుతుందని అనుకున్నారని జగన్ ప్రశ్నించారు. అలా చేయడం ద్వారా ఎన్నికలను మరింత కాలం వాయిదా వేయడమే బాబు ఉద్దేశ్యం అని జగన్ ఆరోపించారు.
సర్ ప్రక్రియ సాగుతోంది :
ఏపీలో ఒక వైపు సర్ ప్రక్రియ సాగుతోంది అని జగన్ గుర్తు చేసారు. సర్ ద్వారా 44 లక్షల ఓట్లను తొలగించారు అని ఆయన చెప్పారు. అందులో చనిపోయిన వారితో పాటు చాలా ఓట్లు ఉన్నాయని అవన్నీ ఘోస్ట్ ఓట్లు అని జగన్ అన్నారు. సక్రమంగా సర్ తుది జాబితా సిద్ధమై వచ్చిన తర్వాత ఎవరైనా ఎన్నికలు నిర్వహిస్తారు కానీ ఘోస్ట్ ఓటర్లతో పెట్టాలని అనుకుంటారా అని జగన్ మరో సందేహం వ్యక్తం చేశారు. వీటిని బట్టి చూస్తే కనుక చంద్రబాబుకు ఎన్నికలు నిర్వహించే ఉద్దేశ్యం ఏ కోశానా లేనట్లుగా కనిపిస్తోంది అని జగన్ అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఎన్నికలు పెడతారే అనుకుని వైసీపీ సిద్ధంగా ఉండాలని జగన్ పార్టీ నేతలకు సూచించారు.
సాఫీగా జరగవు :
ఇక స్థానిక సంస్థల ఎన్నికలు సాఫీగా జరిగే అవకాశాలు అసలు లేవని జగన్ అన్నారు. చంద్రబాబు హయాంలో ఎపుడూ ఇలాగే ఉంటుందని చెప్పారు. అధికార దుర్వినియోగం పోలీసు జులుంతో ఎన్నికలను ఆయన జరపాలని చూస్తారని విమర్శించారు. సర్పంచ్, ఎంపీటీసీ వంటి చిన్న ప్రాణాల మీద కూడా బాబు తన ప్రతాపం చూపిస్తారు అని జగన్ ఎద్దేవా చేశారు. అయినా సరే పోరాడాలని వైసీపీ నేతలకు సూచించారు. ప్రజలకు అండగా తాము తోడు ఉన్నామని గట్టి భరోసా ఇచ్చేలా ఈ ఎన్నికలలో వైసీపీ ఎక్కడికక్కడ పాల్గొనాలని జగన్ కోరారు. ప్రజల పక్షాన నిలిచి ధర్మంగా విజయం కోసం ఉద్యమించాలని అన్నారు. సాఫీగా పద్ధతిగా ఎన్నికలు జరిపితే వైసీపీదే నూరు శాతం విజయం అని కూడా జగన్ చెప్పడం విశేషం. మొత్తం మీద చూస్తే జగన్ స్థానిక ఎన్నికల గురించి చాలానే చెప్పారు.