ఇండీ కూటమికి షాకిచ్చేలా...విజయ్ కొత్త కూటమి !
తమిళనాడుతో కలసి వచ్చిన మిత్రులతో ప్రభుత్వాన్ని నడుపుతున్న విజయ్ ఇపుడు తమ కూటమికి కొత్త పేరు పెట్టారు. అలా కొత్త ఫ్రంట్ కి శ్రీకారం చుట్టారు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాజకీయంగా ఆరితేరుతున్నారు. ఆయన సినిమా నటుడు, రాజకీయాలు ఏమి తెలుసు అన్న వారు అంతా నోళ్ళు వెళ్ళబెట్టేలా పార్టీ పెట్టిన వెంటనే ముఖ్యమంత్రి అయి ఎంజీఆర్ ఎన్టీఆర్ ల సరసన నిలిచారు. అంతటితో ఆగలేదు. ఆయన పేరు జాతీయ స్థాయిలోనూ మారుమోగుతోంది. ఈ మధ్యన మూడ్ ఆఫ్ ది నేషన్ అంటూ నిర్వహించిన ఒక సర్వేలో ప్రధాని పదవి రేసులోకి దూసుకుని వచ్చారు. తొలి ప్రయత్నంలోనే ఏకంగా తొమ్మిది శాతం ఓటు షేర్ సాధించారు. దాంతో విజయ్ కాబోయే ప్రధాని అంటూ టీవీకే నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు మొదలెట్టారు, అది ఎంతదాకా వెళ్ళింది అంటే కాంగ్రెస్ కలవరపడేటంతగా. దాంతో కాంగ్రెస్ ఇండియా కూటమి నాయకుడు ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ అని గట్టిగా ప్రకటించాల్సి వచ్చింది. ఆ విషయం అలా ఉండగానే విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇపుడు ఇది కూడా సంచలనం రేపేలా ఉంది.
కొత్త కూటమితోనే :
తమిళనాడుతో కలసి వచ్చిన మిత్రులతో ప్రభుత్వాన్ని నడుపుతున్న విజయ్ ఇపుడు తమ కూటమికి కొత్త పేరు పెట్టారు. అలా కొత్త ఫ్రంట్ కి శ్రీకారం చుట్టారు. తమిళనాడులో కాంగ్రెస్ ఇతర మిత్రులతో కలసి విజయ ఏర్పాటు చేసిన కూటమికి సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలెయన్స్‌గా నమకరణం చేశారు. చెన్నైలోని పార్టీ ఆఫీసులో అధికారికంగా ఈ పేరుని విజయ్ ప్రకటించడం విశేషం. అయితే విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన సీపీఎం సీపీఐ పార్టీలు ఈ కొత్త కూటమి పేరు ప్రకటించిన కార్యక్రమానికి హాజరు కాలేదు. మిగిలిన మిత్రులు అటెండ్ అయ్యారు. అయితే అందరికీ ఇపుడు కలుగుతున్న సందేహం ఏమిటి అంటే కాంగ్రెస్ వామపక్షాలు సహా అన్నీ ఇండియా కూటమిలో ఉన్నాయి. తమిళనాడులో కూడా ఇండియా కూటమి ప్రభుత్వమే ఉందని అంతా చెప్పుకుంటున్న వేళ కొత్త పేరుతో విజయ్ సరికొత్త ఫ్రంట్ ని ప్రకటించడమేంటి అన్నది.
భవిష్యత్తు ఆలోచనలు :
దాంతో దీని మీద పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు ఉండగా ఎన్డీయేలో మరిన్ని పార్టీలు ఉన్నాయి. అయితే ఈ రోజుకీ ఈ రెండు కూటములలో లేని పార్టీలు తటస్థ పార్టీలు ఉన్నాయి. అందులో ఏపీలో వైసీపీ, తెలంగాణాలో బీఆర్ఎస్, ఒడిషాలో బిజూ జనతాదళ్, యూపీలో బీఎస్పీ సహా మరిన్ని ఉన్నాయి. ఈ పార్టీలకు పార్లమెంట్ లో అరవై దాకా ఎంపీలు ఉన్నారని అంటున్నారు. ఈ విషయం ఇపుడు ప్రస్తావనకు వస్తోంది. బహుశా మూడవ ఫ్రంట్ కి అంకురార్పణ విజయ్ ఈ కొత్త పేరుతో కూటమిని ప్రకటించారా అన్నది కూడా చర్చకు వస్తోంది. టీవీకే నేతలు తరచూ ఒక మాట అంటున్నారు. 2029 లో దేశ రాజకీయాలను దక్షిణాది పార్టీలే శాసిస్తాయని.
జాతీయ రాజకీయాల మీద ఆశలు :
దానికి తగినట్లుగా భవిష్యత్తు ఆలోచనలతోనే ఈ విధంగా కూటమికి పేరు పెట్టారా అని కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి విజయ్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయింది. ఇప్పటిదాకా లేని కూటమి పేరు ఇపుడే ఎందుకు అని కూడా అంటున్నారు. పైగా ఇండియా కూటమికి రాహుల్ నాయకత్వం వహిస్తారు అని కాంగ్రెస్ స్పష్టంగా చెప్పేసిన తర్వాత ఈ కూటమి పురుడు పోసుకోవడంతో విజయ్ కి ఆయన పార్టీకి జాతీయ రాజకీయాల మీద ఆశలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయా అన్నది అంతా ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ కూటమి మాత్రం రాజకీయ చర్చగ్గా మారింది. చూడాలి మరి ఈ కూటమి కేవలం తమిళనాడుకే పరిమితం అవుతుందా లేక జాతీయ స్థాయిలో తన ప్రభావం చూపించేందుకు అడుగులు వేస్తుందా అన్నది.