బిగ్ స్టేట్మెంట్ : పవన్ లేకుండా తెలుగు రాజకీయమే లేదు !

ఏపీలో వివిధ ప్రాంతాలలో వేరు పేర్లతో ఉన్నా మొత్తంగా చూస్తే కాపుల జనాభా సంఖ్య అధికమే అని వెల్లడి అయింది. అందువల్లనే ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు అని అంటున్నారు.

Update: 2026-09-09 17:30 GMT

ఒక విధంగా ఇది నిజమైన రాజకీయ విశ్లేషణగానే చూడాల్సి ఉంది. ఏపీలో 2024 ఎన్నికలు చూసుకున్నా అంతకు ముందు 2019 ఎన్నికలు చూసుకున్నా పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ జనసేన చూపించిన ప్రభావం ఏమిటో అర్థం అవుతుంది. అంతకు ముందు 2014 కి వెళ్తే కూడా జనసేన తాను పోటీ చేయకుండా టీడీపీ బీజేపీకి మద్దతు ఇచ్చిన వైనం కూడా బోధపడుతుంది. ఇలా మూడు ఎన్నికల్లో జనసేన రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు ఏపీ రాజకీయాలను విశేషంగా ప్రభావితం చేశాయన్న విశ్లేషణలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పొత్తులతో ఉంటే గెలుపు దక్కుతోంది. ఆయన విడిగా పోటీ చేస్తే వైసీపీ గెలుస్తోంది. ఇదీ ఏపీ ఫలితాలు మూడు ఎన్నికల్లో చెప్పిన వాస్తవ ముఖ చిత్రం. దాంతో జనసేన నేతలు అదే విషయాన్ని మరో సారి గట్టిగా చెబుతున్నారు. జనసేనకు చెందిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అమలాపురంలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ పవన్ లేకపోతే తెలుగు రాష్ట్రాలలో రాజకీయమే లేదు బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

పవన్ గేమ్ చేంజర్ గా :

పవన్ కళ్యాణ్ తెలుగు రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా మారారని ఆయన అంటున్నారు. ఏపీ వరకూ చూస్తే అదే నిజమని తేలుతోంది. తెలంగాణా రాజకీయాల్లో జనసేన ఇపుడే బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. దాంతో అక్కడ ఆ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అన్నది చూడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పక్కన పెడితే జనసేన ఎమ్మెల్యే వ్యాఖ్యలు అయితే ఇపుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఆయన అన్న మరో మాట కూడా ఉంది, కాపులు లేకుండా తెలుగు రాజకీయాలు లేవు అని. అది నిజమే అన్నది రాజకీయ లెక్కలు చెబుతున్నాయి. ఏపీలో కానీ తెలంగాణాలో కానీ కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తెలంగాణాలో అయితే మున్నూరు కాపులు అని బీసీ జాబితాలో ఉన్నారు. ఏపీలో వివిధ ప్రాంతాలలో వేరు పేర్లతో ఉన్నా మొత్తంగా చూస్తే కాపుల జనాభా సంఖ్య అధికమే అని వెల్లడి అయింది. అందువల్లనే ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు అని అంటున్నారు.

పవన్ వల్లనే గౌరవం :

అదే విధంగా ఆయన మరో మాట వాడారు, కాపులకు పవన్ వల్లనే గౌరవం దక్కుతోందని. ఇది కూడా నిజమే అని అనుకోవాలి. ఎందుకంటే గతంలో కాపులకు అనేక మంది నాయకులు ఉండేవారు. ఒక వంగవీటి ఒక ముద్రగడ ఇలాంటి నాయకులు కాపు సామాజిక వర్గంలో ఐకాన్లుగా ఉన్నారు. అయితే వర్తమానంలో మాత్రం పవన్ కళ్యాణ్ వారికి ఆశా జ్యోతిగా ఉన్నారు. పవన్ తరచూ తనకు కులాలతో సంబంధం లేదని అంటారు, కానీ ఆయన సామాజిక వర్గం మాత్రం పవన్ ని సొంతం చేసుకుంది అందుకే జనసేనకు స్థిరమైన బలమైన ఓటు బ్యాంక్ గా వారు అంతా గట్టిగా నిలబడ్డారు. ఇక రాజకీయంగా ప్రతీ ఎన్నికకూ ఒక పార్టీని బలపరుస్తూ వచ్చిన కాపులు జనసేన ఆవిర్భావం తరువాత తమకంటూ ఒక రాజకీయ వేదిక ఉందని భావిస్తున్నారు.

రెండు పార్టీల వ్యవస్థ నుంచి :

ఈ నేపథ్యం నుంచే బొలిశెట్టి ఈ వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే జనసేన నేతలు క్యాడర్ తో పాటు బలమైన కాపు సామాజిక వర్గంలో ఆశలను ఆత్మ స్థైర్యాన్ని మరింతగా పెంచడానికి బొలిశెట్టి ఈ తరహా వ్యాఖ్యలు చేసినా వర్తమాన రాజకీయ వాస్తవాలు కూడా అందులో ఇమిడి ఉన్నాయని అంటున్నారు. అదే సమయంలో ఏపీ రాజకీయాలు రెండు పార్టీల వ్యవస్థ నుంచి మూడుగా మారేందుకు జనసేన బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేసేందుకు కూడా ఆ పార్టీ నాయకుల వ్యాఖ్యలు కానీ ఆలోచనలు కానీ దోహదపడుతున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News