బీజేపీని గెలిపించాల‌ని.. కోట్లు కుమ్మ‌రించేశారు!

ఈ వివ‌రాల‌ను తాజాగా బుధ‌వారం సాయంత్రం కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే వివ‌రించింది. ఒక్క బీజేపీకే కాదు.. కాంగ్రెస్ పార్టీకి కూడా అందాయి.

Update: 2026-09-09 15:57 GMT

రాజకీయ పార్టీల‌కు విరాళాలు రావ‌డం స‌హ‌జం. బాండ్లు, ప్ర‌త్య‌క్ష విరాళాలు, కార్పొరేట్ కోటా విరాళాలు.. స్వ‌చ్ఛంద విరాళాలు.. పేరు ఏదైనా అనేక రూపాల్లో అన్ని పార్టీల‌కు నిధులు అందుతున్నాయి. అయితే.. ఇవి ఎన్నిక‌ల స‌మ‌యంలో అందితే!. అదే ఇప్పుడు జ‌రిగింది. ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. నిజం. ఈ ఏడాది ఐదు కీల‌క రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రిగాయి. ఖ‌చ్చితంగా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన త‌ర్వాత‌.. ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభం అయ్యాక‌.. ప‌లు రాజ‌కీయ పార్టీల‌కు విరాళాలు విడ‌త‌ల వారీగా అందాయి. వాటిని ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు పెట్టారు.

అయితే.. ఈ ప‌రంప‌ర‌లో బీజేపీకి ఏకంగా 1475 కోట్ల రూపాయ‌లు రావ‌డం మ‌రింత ఆశ్చ‌ర్యంగా ఉంది. ఈ వివ‌రాల‌ను తాజాగా బుధ‌వారం సాయంత్రం కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే వివ‌రించింది. ఒక్క బీజేపీకే కాదు.. కాంగ్రెస్ పార్టీకి కూడా అందాయి. స‌హ‌జం గా పార్టీల‌కు విరాళాలు ఎప్పుడైనా ఇవ్వ‌చ్చు. కానీ, ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఇవ్వ‌డం ఇక్క‌డ చ‌ర్చ‌నీయాంశం. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో భారీ ఎత్తున నిధుల ప్ర‌వ‌హించాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే.. ఆ స‌మ‌యంలోనే బీజేపీకి 1475 కోట్లు, కాంగ్రెస్ పార్టీకి 200 కోట్ల రూపాయ‌లు.. తృణ‌మూల్ కాంగ్రెస్‌(ప‌శ్చిమ బెంగాల్ )కు 150 కోట్ల రూపాయ‌లు, టీవీకే(త‌మిళ‌నాడు)కు 100 కోట్ల రూపాయ‌లు అందాయి. ఒక్క బీజేపీకి మాత్ర‌మే 1475 కోట్ల రూపాయ‌లు విరాళాలుగా రావ‌డం.. గ‌మ‌నార్హం. ఈ మొత్తం ఎవ‌రు ఇచ్చారు? అనేది మాత్రం ఎన్నిక‌ల సంఘం వివ‌రించ‌లేదు. కానీ.. ఈ మొత్తాన్ని ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైన స‌మ‌యంలోనే ఇవ్వ‌డాన్ని చెప్పుకొచ్చింది. ఇది త‌ప్పుకాద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఇత‌ర పార్టీల‌కు కూడా వ‌చ్చాయ‌ని పేర్కొంది.

గెలిపించాల‌నేనా?

ఎన్నిక‌ల స‌మ‌యంలో విరాళాలు ఇవ్వ‌డం అనేది గ‌తంలో లేదు. అయితే.. 10 ఏళ్లుగా ఈ ప్ర‌క్రియ సాగుతోంది. స‌ర్వేల ఆధారంగా.. ప్ర‌జ‌ల నాడి ఆధారంగా ఎవ‌రు అధికారంలో కి వ‌స్తున్నారు? ఏ పార్టీకి ఎడ్జ్ ఉంద‌ని తెలుసుకుంటున్న పారిశ్రామిక వేత్త‌లు.., పెట్టుబ‌డి దారులు.. ఇలా నిధుల వ‌ర‌ద ప్ర‌వ‌హించేలా చేస్తున్నార‌ని.. ఇటీవ‌ల రిఫార్మ్స్ ఫ‌ర్ డెమొక్ర‌టిక్ సంస్థ‌కూడా వెల్ల‌డించింది. ఇప్పుడు కూడా అదే జ‌రిగి ఉంటుంద‌ని అంటున్నారు. తాము ముందుగానే నిధులు ఇచ్చిన పార్టీలు విజ‌యం ద‌క్కించుకున్నాక‌.. త‌మ ప‌నులు సులువు అవుతాయ‌న్న భావ‌న కూడా ఆయా వ‌ర్గాల‌కు ఉండి ఉంటుంద‌ని అంటున్నారు.

Tags:    

Similar News