వైసీపీ ఊహించలేకపోయిందా? చిన్న శ్రీను వెళ్లినా ఓకే అనుకుందా?!
స్థానిక ఎన్నికల వేళ ఎవరూ ఊహించని విధంగా విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడంపై ఆ పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది.
స్థానిక ఎన్నికల వేళ ఎవరూ ఊహించని విధంగా విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడంపై ఆ పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. పార్టీ సీనియర్ నేత బొత్స మేనల్లుడు అయిన చిన్న శ్రీను తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయాన్ని వైసీపీ కేడర్ జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు. పార్టీ స్థాపించిన ఆరేళ్ల తర్వాత బొత్సతోపాటు చిన్న శ్రీను వైసీపీలో చేరినా, పార్టీ అధినేత జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పనిచేసిన ఆయన ఆకస్మికంగా పార్టీ నుంచి ఎందుకు వైదొలగాల్సివచ్చిందనేదే ఎవరికీ అంతుచిక్కడం లేదని అంటున్నారు.
జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను సీనియర్ నేత బొత్స మేనల్లుడిగా రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, వైసీపీలో చేరిన తర్వాత ఆయన వ్యక్తిగత సామర్థ్యం, పనితీరుతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి దగ్గరయ్యారని అంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ఉత్తరాంధ్రలో అన్నీతానై వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా మంత్రిగా బొత్స బిజీగా ఉంటే జిల్లాలో పార్టీ వ్యవహారాలు అన్నీ చిన్న శ్రీను మాత్రమే చూసుకునేవారని అంటున్నారు. అందుకే ఆయనకు జిల్లా అధ్యక్ష పదవితోపాటు ఉత్తరాంధ్ర వ్యవహారాల కో-కన్వీనర్, భీమిలి ఇంచార్జి వంటి పదవులు ఒకేసారి ఇచ్చారని చెబుతున్నారు. ఇలాంటి స్థితిలో ఉన్న చిన్న శ్రీను ఎవరికీ చెప్పకుండా పార్టీకి రాజీనామా చేయడంతో అంతా షాక్ తిన్నారని అంటున్నారు.
జిల్లాపరిషత్ చైర్మన్ చిన్న శ్రీను పార్టీకి రాజీనామా చేస్తారనే అంశాన్ని వైసీపీలో ఎవరూ ముందుగా ఊహించకపోవడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా ఉందని అంటున్నారు. పార్టీలో ముఖ్య నేత ఒకరు పక్క చూపులు చూస్తున్నారనే సమాచారం లేకపోవడం అంటే పార్టీలో సమాచార లోపం ఎక్కువగా ఉన్నట్లు భావించాల్సివుంటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి బొత్స ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు పార్టీ మారతారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే బొత్స కుటుంబంపై నమ్మకంతో పార్టీ అగ్ర నాయకత్వం ఈ ప్రచారాన్ని నమ్మలేకపోయిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ అధిష్టానానికి ఉన్న ధీమానే చిన్న శ్రీను అవకాశంగా మార్చుకున్నారని అంటున్నారు. అదును కోసం ఎదురుచూసిన ఆయన ఎలాంటి హడావుడి లేకుండా విజయనగరం నుంచి విజయవాడ చేరుకుని ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవ్వడానికి కేవలం గంట ముందుగానే రాజీనామా ప్రకటన చేశారని అంటున్నారు. దీంతో ఆయనను నిలువరించే అవకాశం కూడా లేకపోయిందని చెబుతున్నారు.
తన రాజీనామాను ముందుగా లీక్ చేస్తే ఎదురయ్యే ఒత్తిడిని గ్రహించడం వల్లే చిన్న శ్రీను సైలెంటుగా పార్టీ మారే ఆపరేషన్ పూర్తి చేశారని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను వైసీపీలో ఉండటం శ్రేయస్కరం కాదని భావనకు వచ్చిన తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చునని అంటున్నారు. దీంతో వైసీపీలో కొన్నాళ్లుగా ఆయన అసంతృప్తికి లోనవుతున్నట్లు భావిస్తున్నారు. అయితే చిన్న శ్రీను అసంతృప్తిని గుర్తించడంలో అధిష్టానం ఎక్కడో విఫలమైందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వైసీపీలో క్షేత్రస్థాయి నుంచి అధినేత వరకు అనేక విభాగాలలో నేతలు వివిధ బాధ్యతల్లో పనిచేస్తుంటారు. వీరిలో చాలా మందితో చిన్న శ్రీను నిత్యం టచ్ లో ఉంటారని కూడా చెబుతున్నారు. అయినప్పటికీ చిన్న శ్రీను చాలా గోప్యంగా తన వ్యూహాన్ని అమలు చేయడమే రాజకీయంగా ఆసక్తి రేపుతోందని అంటున్నారు.