సభ నుండి సస్పెండ్.. మండలి నుండి వాకౌట్!
తెలంగాణ శాసనసభ సమావేశాల నుండి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
తెలంగాణ శాసనసభ సమావేశాల నుండి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. శాసనసభ సమావేశాలకు నల్ల టీషర్టులతో వస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో స్పీకర్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని మొదలయిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేె లను సస్పెండ్ చేయడం వరకు వచ్చింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ శాసనసభలో బీఆర్‌ఎస్ సభ్యుల తీరుపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. సభా నియమావళిని ప్రతి సభ్యుడు పాటించాల్సిన బాధ్యత ఉందని, బీఆర్‌ఎస్ సభ్యులు పదేపదే వెల్‌లోకి వచ్చి సభాపతితో వాగ్వాదానికి దిగడం, ఆయన సూచనలను పట్టించుకోకపోవడం సరికాదని భట్టి విక్రమార్క అన్నారు.
సభను సజావుగా నిర్వహించేందుకు సభ్యులందరూ సహకరించాలని, ఈ సభ, ఈ రాష్ట్రం ఆత్మగౌరవంపై ఏర్పడిందని. ఆత్మగౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలు మంచిది కాదు. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలోనే సభను అడ్డుకుంటున్న సభ్యుల సస్పెన్షన్‌కు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు సిఫారసు చేయగా, స్పీకర్ ఆమోదించారు. సస్పెన్సన్ జాబితాలో హరీశ్‌రావు, కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, గంగుల, కౌశిక్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కోవా లక్ష్మి, మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, విజయుడు, వివేకానంద, కె.సంజయ్, తలసాని, అనిల్ జాదవ్ ఉన్నారు.
అయితే స్పీకర్ సభ నుండి సస్పెండ్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతున్నది. ప్రజా సమస్యల మీద నిలదీస్తామనే సభ నుండి సస్పెండ్ చేశారని, ఇది బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ కాదు, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సస్పెన్షన్ అని, నియంతృత్వం ఎంత పెరిగితే, ప్రజల తిరుగుబాటు అంత బలపడుతుందన్న విషయం గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీష్ రావు అన్నారు.
అటు శాసనమండలిలో నిన్న ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. ఇటు శాసనసభ నుండి స్పీకర్ సస్పెండ్ చేయగా, అటు శాసనమండలి నుండి వాకౌట్ చేయడం గమనార్హం. అనంతరం శాసనసభ లోపల, బయట జరిగిన పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి లోక్ భవన్ కు వెళ్లిన కేటీఆర్ గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ వివాదం ఏ మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి.