ఆ ఇద్దరు ఎమ్మెల్సీల సస్పెన్షన్.. ఏం జరుగుతుంది?
బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను సస్పెండ్ చేస్తూ.. శాసన మండలి తీర్మానం చేసింది.
బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను సస్పెండ్ చేస్తూ.. శాసన మండలి తీర్మానం చేసింది. ఈ తీర్మానంపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. మూజువాణి ఓటు(చెయ్యి ఎత్తడం ద్వారా) నిర్వహించారు. ఈ నేపథ్యంలో మెజారిటీ సభ్యులు చెయ్యి ఎత్తి తమ అంగీకారం తెలిపారు. దీంతో వారిని సస్పెండ్ చేస్తూ.. గుత్తా సుఖేందర్ రెడ్డి తీర్మానం చదివి వినిపించారు. దీనికి ముందు.. సదరు ఇద్దరు ఎమ్మెల్సీల వైఖరిపై సభలో మాట్లాడిన మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనరసింహలు.. వారి ప్రవర్తన, స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
అదే విధంగాపలువురు సభ్యులు కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవ ప్రదమైన , రాజ్యాంగబద్ధమైన స్పీకర్‌పదవిలో ఉన్న వారిని ఉద్దేశించి దూషణలకు దిగడం.. మాతృమూర్తిని దూషించడం వంటివి తీవ్రమైన ఘటనలని పలువురు అభిప్రాయ పడ్డారు. ఇవి సభా సంప్రదాయానికి అత్యంత విఘాతమని తెలిపారు. ఇలాంటివారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అయితే.. ఈ చర్చ సుమారు 2 గంటలపాటు సాగిన తర్వాత.. ప్రస్తుతం జరుగుతున్న సెషన్ వరకు ఎమ్మెల్సీలు.. తాతా మధు, నవీన్ రెడ్డిలను సస్పెండ్ చేస్తున్నామని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.
అయితే.. ఏంటి?
మండలి నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు ఎమ్మెల్సీలపై ఎలాంటి ప్రభావం పడుతుందన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం జరు గుతున్న సెషన్ పూర్తిగా వారు సభకు వచ్చే అవకాశం ఉండదు. అలాగే.. వారికి ఈ సభా కాలంలో మంజూరు చేసే అన్ని అల వెన్సులు కూడా కట్ చేస్తారు. అలానే.. ఈ నెలకు సంబంధించిన వేతనంలోనూ కోత పెడతారు. ఇక, సభ రికార్డుల్లోనూ.. ఈ విషయాన్ని పేర్కొనడం ద్వారా.. వారి సస్పెన్షన్ వ్యవహారం రికార్డుల్లో ఉంటుంది. అలానే.. ఎందుకు? అనే కారణాలను కూడా పేర్కొంటారు. ఇక, సదరు ఎమ్మెల్సీలకు ఉన్న అన్ని అధికారాలు.. తదుపరి సెషన్ వరకు సస్పెండ్ అవుతాయి.
బీఆర్ఎస్ నిరసన..
మండలిలో తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డిలపై గుత్తా సుఖేందర్ రెడ్డి సస్పెన్షన్ వేటు వేసిన అనంతరం.. బీఆర్ ఎస్ ఎమ్మెల్సీలు.. అక్కడే బైఠాయించి తమ నిరసన తెలిపారు. మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమసభ్యులు తప్పు చేయలేదని.. స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. అంతేకాదు.. తమ పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు వారు విచారం కూడా వ్యక్తం చేశారని తెలిపారు. ఇలాంటి సమయంలో వారిపై సస్పెన్షన్ వేటు వేయడం సమంజసం కాదన్నారు. ప్రజల సమస్యలు ప్రస్తావిస్తున్నందుకే తమపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.