బాబు రూట్లో విజయ్...తమిళనాడులో అన్నీ కొత్తగానే !

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నాలుగు నెలల పాలన పూర్తి చేసుకున్నారు. అయితే ఆయన అభివృద్ధి పాలన సంక్షేమం వంటి వాటి విషయంలో తన మార్క్ ని చూపిస్తున్నారు.

Update: 2026-09-09 03:51 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నాలుగు నెలల పాలన పూర్తి చేసుకున్నారు. అయితే ఆయన అభివృద్ధి పాలన సంక్షేమం వంటి వాటి విషయంలో తన మార్క్ ని చూపిస్తున్నారు. గతంతో పోలిస్తే రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలను కూడా గట్టిగానే ఎక్కు పెడుతున్నారు. తన ప్రభుత్వం స్థిరత్వం మీద నమ్మకం పెంచుకోవడంతో పాటు జాతీయ స్థాయిలోనూ టీవీకే పార్టీ ప్రభావాన్ని చూపించాలని చూస్తున్నారు. ఇక ఆయన ఇపుడు మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడుని ఇప్పటిదాకా ఏలిన ఏ ముఖ్యమంత్రికీ కలుగని ఆలోచన ఆయన చేస్తున్నారు. దాంతో విజయ్ హయాంలో తమిళనాడుకు కొత్త అసెంబ్లీ కొత్త సచివాలయం అద్భుతమైన తీరులో రూపుదిద్దుకోబోతున్నాయి.

మెరీనా బీచ్ ప్రాంతంలో :

తమిళనాడు మెరీనా బీచ్ సమీపంలో పట్టినంబాక్కంలో పాతిక ఎకరాల స్థలంలో కొత్తగా సచివాలయం అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని విజయ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని సంబంధించిన కసరత్తు కూడా మొదలైంది అని అంటున్నారు. ప్రస్తుతం చూస్తే తమిళనాడులోని అసెంబ్లీ సెక్రేటేరియట్ రెండూ కూడా బ్రిటిష్ వారి హయాంలో నిర్మించిన చారిత్రాత్మక సెయింట్ జార్జి కోటలో నడుస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో గతంతో పోలిస్తే తీవ్రమైన రద్దీ నెలకొంది. అలాగే వాహనాల రాకపోకలు అధికం అవుతున్నాయి. ప్రజలతో హెవీ ట్రాఫిక్ ఉంది. దాంతో పార్కింగ్ కి సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతోనే కొత్త అసెంబ్లీ కొత్త సెక్రటేరియట్ ని నిర్మించాలని విజయ్ ప్రభుత్వం నిర్ణయించింది అని అంటున్నారు.

అద్భుతమైన విధంగా :

ఇక పట్టినంబాక్కంలో పాతిక ఎకరాల స్థలంలో అద్భుతమైన విధంగా సరికొత్త డిజైన్లతో శాసన సభ సచివాలయం నిర్మించడానికి విజయ్ ప్రభుత్వం ఉత్సాహం చూపిస్తోంది. ఇందుకోసం 1200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ప్రధాన భవనాన్ని 20 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో పదిహేను అంతస్తుల ఎత్తులో అత్యాధునికంగా నిర్మించ తలపెడుతున్నారు. అనేక ప్రాంతాలలో ఖాళీ భూములను విజయ్ ప్రభుత్వం పరిశీలించి ఎట్టకేలకు పట్టినంబాక్కంలో పాతిక ఎకరాల స్థలం ఎంచుకుంది. ఈ భూమి తమిళనాడు హౌసింగ్ బోర్డు పరిధిలో ఉంది. ఇక్కడ చూస్తే చదరపు అడుగు మార్కెట్ విలువ 22 వేలుగా ఉంది. మొత్తం భూమి విలువ దాదాపుగా రెండు వేల కోట్లుగా చెబుతున్నారు.

ప్రభుత్వానికి ఇచ్చిన బోర్డు :

రాష్ట్ర ప్రభుత్వం కొత్త అసెంబ్లీ సచివాలయం నిర్మిస్తామని భావిస్తున్న నేపథ్యంలో విలువైన ఈ భూముని తమిళనాడు హౌసింగ్ బోర్డు ఇచ్చేసింది. ప్రజా ప్రయోజనాల కోసం దీనిని ఇస్తున్నామని పేర్కొంది. ఇక ఈ పాతిక ఎకరాల భూమిలో భవనాలు అందంగా విశాలంగా ఆధునికంగా నిర్మించడమే కాకుండా మిగిలిన భూమిని రోడ్ల వినియోగానికి వాడతారు. దానికి చెన్నై కార్పోరేషన్ రెవిన్యూ శాఖ సైతం ఆమోదం ముద్ర వేయడంతో ఇక లాంచనాలు అన్నీ పూర్తి అయినట్లే అంటున్నారు. ప్రస్తుతం పట్టినంబాక్కంలో పాతిక ఎకరాల స్థలంలో పాత శిధిలమైన క్వార్టర్లు ఉన్నాయి. వాటిని కూల్చి వేసి మరీ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు హౌసింగ్ బోర్డు రెడీ అవుతోంది.

బాబు మాదిరిగానే :

ఇక ఏపీలో అత్యాధునికంగా అసెంబ్లీ సచివాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పూనుకున్నారు. ఈ విషయంలో ఆయన అనేక రకాలైన డిజైన్లను పరిశీలించి బ్రహ్మాండమైన నిర్మాణాలను చేపడుతున్నారు. ఇపుడు విజయ్ సైతం బాబు బాటలోనే సరికొత్త సచివాలయం అసెంబ్లీలను తన హయాంలో నిర్మించడం ద్వారా శాశ్వత కీర్తిని పొందాలని చూస్తున్నారు. అంతే కాదు భవిష్యత్తులో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కూడా రానున్నందువల్ల మరింత విశాలంగా నిర్మించాలని చూస్తున్నారు.

Tags:    

Similar News