భీమిలీ వైసీపీకి ఇదేమి శాపం ?

మరో వైపు చూస్తే భీమిలీ వైసీపీ నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగించినా కూడా వారు తప్పుకుంటున్నారు. దాంతో విశాఖ జిల్లాలో రాజకీయంగా ఎంతో కీలకమైన ఈ నియోజకవర్గంలో వైసీపీ ఇపుడు అయోమయంలో పడిపోయినట్లు అవుతోంది.

Update: 2026-09-09 00:30 GMT

విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అన్నది తెలిసిందే. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటిదాకా మొత్తం పది సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏడు సార్లు టీడీపీ భీమిలీలో గెలిచింది. కాంగ్రెస్ ప్రజారాజ్యం, వైసీపీ ఒక్కోసారి గెలిచాయి. ఇక భీమిలీలో 2019లో వైసీపీ గెలిచినా రాజకీయంగా పట్టు సాధించలేకపోయింది. మూడు వర్గాలు ఆరు గ్రూపులు అన్నట్లుగా సీన్ తయారు అయింది. మరో వైపు చూస్తే భీమిలీ వైసీపీ నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగించినా కూడా వారు తప్పుకుంటున్నారు. దాంతో విశాఖ జిల్లాలో రాజకీయంగా ఎంతో కీలకమైన ఈ నియోజకవర్గంలో వైసీపీ ఇపుడు అయోమయంలో పడిపోయినట్లు అవుతోంది.

చిన్న శ్రీను తప్పుకున్నాక :

భీమిలీ వైసీపీ ఇంచార్జిగా చిన్న శ్రీనుకి బాధ్యతలను 2024 డిసెంబర్ లో అధినాయకత్వం అప్పగించింది. దాదాపుగా రెండేళ్ల పాటు ఆయన పార్టీ బాధ్యతలను చూస్తూ వచ్చారు. అంగబలం అర్ధ బలం ఉండడంతో పాటు బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయన భీమిలీలో వైసీపీని పటిష్టం చేసేందుకు ఎంతో కొంత కృషి చేశారు. ఆయనే 2029 ఎన్నికల్లో భీమిలీ నుంచి ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున చేస్తారు అని కూడా అంతా అనుకున్నారు. కానీ స్థానిక ఎన్నికల్లో ఆయన సడెన్ గా ఫ్యాన్ నీడ నుంచి బయటకు వచ్చి సైకిలెక్కేశారు. దాంతో లోకల్ ఫైట్ దూసుకొస్తున్న వేళ వైసీపీ ఇక్కడ నాయకత్వ లేమితో సతమతమవుతోంది.

అంతా దూరంగానే :

వైసీపీ గడచిన మూడు ఎన్నికల్లో ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది. అందులో 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన కర్రి రాము అయితే అప్పట్లో ఓడిపోగానే వైసీపీకి రాజీనామా చేసి దూరంగా జరిగారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ గెలిచి మంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో కూడా ఆయనే పోటీ చేశారు. తీరా ఓటమి చెందగానే పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ప్లేస్ లో చిన్న శ్రీనుని ఎంపిక చేస్తే సరిగ్గా స్థానిక ఎన్నికల వేళ ఆయన కాడె వదిలేసి వెళ్ళిపోయారు.

ఏకపక్షంగానేనా :

వైసీపీ అయితే ఏకగ్రీవాలు వద్దే వద్దు అంటోంది.కానీ భీమిలీ లాంటి చోట ఏకంగా ఇంచార్జి నాయకుడే లేడు అని అంటున్నారు. ఒకవేళ ఇప్పటికిపుడు ఎవరిని తెచ్చి పెట్టినా కూడా ఎన్నికల వేళ ఏమి సాధించగలరు అని అంటున్నారు. మరో వైపు మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన అన్ని విధాలుగా రాజకీయంగా పట్టు బిగించి ఉన్నారు. దానికి తోడు భీమిలీలో జనసేన టీడీపీ రెండూ కూడా బలంగా ఉన్నాయి. దాంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఏకపక్షంగానేనా అన్న చర్చ వస్తోంది. అదే కనుక జరిగే వైసీపీకి భీమిలీలో కోలుకోలేని దెబ్బ అవుతుంది అని అంటున్నారు. క్షేత్ర స్థాయి నుంచి కూటమి మరింతగా బలపడితే 2029 ఎన్నికల్లో వారికే అడ్వాంటేజ్ అవుతుందని కూడా అంటున్నారు.

చూడాలి మరి భీమిలీ నియోజకవర్గం విషయంలో వైసీపీ ఏ రకమైన నిర్ణయం తీసుకుని పార్టీని బలోపేతం చేస్తుంది అన్నది.

Tags:    

Similar News