విభీషణులు ఎవరు...వైసీపీ సీరియస్ ఫోకస్ !

వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే చాలా మంది పెద్ద నాయకులు పార్టీని వీడారు. వారిలో పునాదుల నుంచి ఉన్న వారు కూడా గేటు దాటేశారు.

Update: 2026-09-09 01:01 GMT

వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే చాలా మంది పెద్ద నాయకులు పార్టీని వీడారు. వారిలో పునాదుల నుంచి ఉన్న వారు కూడా గేటు దాటేశారు. అలా అప్పట్లో కొన్ని నెలల పాటు ఈ విధంగా సాగింది. బలమైన నాయకులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు ఇలా ఎంతో మంది వైసీపీకి రాం రాం అనేశారు. ఇక ఆ తరువాత ఈ వలసల పర్వం ఆగింది. దాంతో వైసీపీ కూడా తేరుకుంది. ఇక మీదట వైసీపీ నుంచి పోయేవారు ఎవరూ ఉండరు, అంతా వచ్చేవారే అని కూడా అంచనా వేసుకుంటున్న వేళ ఉత్తరాంధ్రాలో బలమైన నాయకుడే వైసీపీకి భారీ షాక్ ఇచ్చేశారు. అనూహ్యంగా చిన్న శ్రీను వైసీపీకి రాజీనామా చేసి అధినాయకత్వానికి గుక్క తిప్పుకోనీయకుండా చేశారు.

ఆపరేషన్ ఆకర్ష్ :

ఇక ఆపరేషన్ ఆకర్ష్ మరో విడత ఏపీలో మొదలైంది అని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని కోలుకోలేని దెబ్బ తీయడానికి కూటమి మరీ ముఖ్యంగా టీడీపీ చూస్తోంది. దాంతో వైసీపీలో ముఖ్య నేతలు ప్రజలలో పట్టు కలిగిన నేతల మీద దృష్టి సారించింది అని అంటున్నారు. దాంతో అనేక జిల్లాలలో వైసీపీ నేతల మీద ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం పనిచేస్తోంది అని అంటున్నారు. కూటమి అధికారంలో ఉండడం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటూ అధికార పక్షానికే మొగ్గు ఉండడం వంటి పరిణామాల పాటు తమకు కనుక మంచి అవకాశం లభిస్తే తప్పకుండా పార్టీ మారేందుకు అనేక మంది ఉమ్మడి పదమూడు జిల్లాలలో ఉన్నారని అంటున్నారు. టీడీపీ కూడా బలమైన నేతలను సామాజిక వర్గ సమీకరణలను ఆధారంగా చేసుకుని ఎంపిక చేసి మరీ తీసుకుంటోంది అని తెలుస్తోంది.

ఇంకా వస్తారన్న చిన్న శ్రీను :

ఇదిలా ఉంటే వైసీపీ నుంచి ఇంకా అనేక మంది నేతలు టీడీపీలో చేరుతారు అని చిన్న శ్రీను హింట్ ఇచ్చారు. టీడీపీలో చేరిన తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని అన్నారు. ఉత్తరాంధ్రా జిల్లాల అభివృద్ధి టీడీపీ హయాంలో శరవేగంగా జరుగుతోంది అని అన్నారు. దానికి ఆకర్షితుడు అయి పార్టీ మారాను అన్నారు. తనలాగానే ఆలోచించేవారు వైసీపీలో ఇంకా ఉన్నారని అంటున్నారు. దాంతో ఈ వ్యాఖ్యలతో వైసీపీ అలెర్ట్ అయింది. విజయనగరం జిల్లా నుంచి టీడీపీలో చేరే నేతలు ఎవరు అని ఆరా తీసే పనిలో పడింది అంటున్నారు.

బల నిరూపణతోనే :

విజయనగరం జిల్లాలో తన పట్టుని నిరూపించే క్రమంలో చిన్న శ్రీను ఇపుడు వైసీపీలో ఉన్న అనేక మంది నేతలను టీడీపీ బాట పట్టిస్తారు అని అంటున్నారు. ఇక చిన్న శ్రీను టీడీపీలో చేరడం కూడా ఆషామాషీగా జరగలేదు, విజయనగరం జిల్లాకు చెందిన ముఖ్య నేతలు మంత్రులు అంతా హాజరయ్యారు. చంద్రబాబు కూడా ఆయనకు ఇచ్చిన ప్రాధాన్యత బట్టి చూస్తే వైసీపీ నుంచి మరింత మందిని టీడీపీలోకి తెచ్చే బాధ్యత ఆయన మీదనే పెట్టినట్లు అయింది అని అంటున్నారు. జిల్లాకు వెళ్ళిన తరువాత మరిన్ని విషయాలు చెబుతాను అని చిన్న శ్రీను అన్నారు. దాంతో వైసీపీలో ఇంకా ఎంత మంది విభీషణులు ఉన్నారో అని వైసీపీ కలవరపడుతోంది. కేవలం విజయనగరం జిల్లా మాత్రమే కాదు ఉత్తరాంధ్రాలో మిగిలిన జిల్లాలతో పాటు ఏపీలో ఇతర జిల్లాలలోని వైసీపీలో బలమైన నేతలు కూటమిలో చేరుతారు అని అంటున్నారు. మరి వారిని ఆపేందుకు వైసీపీ ఏ రకమైన ప్రయత్నం చేస్తుంది అన్నదే చూడాల్సి ఉంది.

Tags:    

Similar News