ఫ్లైట్ డిలే/క్యాన్సిల్?.. ఎయిర్‌లైన్స్ ఇవ్వాల్సిన సౌకర్యాలు ఏంటో తెలుసా?
విమానం ఆలస్యమైతే ఎయిర్‌లైన్స్ బాధ్యత వహించాలి. ఫ్లైట్ బయలుదేరే సమయం నుంచి 2 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే, ప్రయాణికులకు ఉచితంగా టీ, కాఫీ, టిఫిన్ లేదా భోజనం అందించాలి.
మనం ఎప్పుడైనా విమానాశ్రయానికి వెళ్లి లగేజ్ చెకింగ్ కూడా పూర్తయ్యాక సడన్‌గా ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని బోర్డు మీద పడితే ఎలా ఉంటుంది? గుండె ఆగినంత పనవుతుంది కదూ! అర్జెంట్ మీటింగ్స్, ముందే బుక్ చేసుకున్న ట్రిప్స్ అన్నీ ఒక్కసారిగా గాల్లో కలిసిపోతాయి. ఎయిర్‌పోర్ట్‌లో గంటల తరబడి ఏం చేయాలో తోచక విమాన సంస్థల చుట్టూ తిరుగుతుంటాం. అయితే ఇలాంటి సమయంలో మనకున్న హక్కులేంటో, ఎయిర్‌లైన్స్ నుంచి ఏం డిమాండ్ చేయవచ్చో చాలామందికి తెలియదు. ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.
ఉచిత ఆహారం, మంచినీళ్లు ఎప్పుడు ఇస్తారు? :
విమానం ఆలస్యమైతే ఎయిర్‌లైన్స్ బాధ్యత వహించాలి. ఫ్లైట్ బయలుదేరే సమయం నుంచి 2 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే, ప్రయాణికులకు ఉచితంగా టీ, కాఫీ, టిఫిన్ లేదా భోజనం అందించాలి. ఇక ఎంత సమయం ఆలస్యమైతే దానికి తగినట్లుగా రిఫ్రెష్‌మెంట్స్ ఇవ్వడం ఎయిర్‌లైన్స్ ప్రాథమిక బాధ్యత.
క్యాన్సిల్ అయితే రూట్ మార్పు లేదా ఫుల్ రీఫండ్:
విమానం రద్దయితే ప్రయాణికులకు రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి, ఏ ఒక్క రూపాయి అదనంగా తీసుకోకుండా మరో ఫ్లైట్‌లో సీటు కేటాయించడం. రెండు, విమాన టికెట్ పూర్తి డబ్బులను ప్రయాణికుడికి తిరిగి ఇచ్చేయడం. ఇక ఇది పూర్తిగా ప్రయాణికుడి ఇష్టానికే వదిలేయాలి.
రాత్రి వేళ హోటల్ వసతి పొందే హక్కు:
ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల లేదా విపరీతంగా ఆలస్యం కావడం వల్ల రాత్రి సమయంలో ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండాల్సి వస్తే, ప్రయాణికులకు ఉచితంగా హోటల్ రూమ్ వసతి కల్పించాలి. ఇక అంతేకాదు, ఎయిర్‌పోర్ట్ నుంచి ఆ హోటల్‌కు వెళ్లి రావడానికి ప్రయాణ ఖర్చులు కూడా సదరు ఎయిర్‌లైన్స్ సంస్థే భరించాలి.
నష్టపరిహారం ఎంత వస్తుంది?:
సాంకేతిక లోపాలు లేదా సొంత కారణాల వల్ల విమాన సంస్థలు చివరి నిమిషంలో ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే, ప్రయాణికులకు రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా హఠాత్తుగా రద్దు చేస్తే ఈ పరిహారం పొందవచ్చు. అయితే వాతావరణం బాగోలేకపోతే ఈ నియమం వర్తించదు.
ఇక ఏవియేషన్ నిబంధనల ప్రకారం ప్రయాణికుల సౌకర్యం చాలా ముఖ్యం. తదుపరిసారి మీరు ఎప్పుడైనా ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటే, కంగారు పడకుండా నేరుగా ఎయిర్‌లైన్ కౌంటర్‌కి వెళ్లి మీకున్న హక్కుల ప్రకారం రావాల్సిన సౌకర్యాలను ధైర్యంగా అడిగి పొందండి.