స్థానిక ఎన్నికల వేళ సీఎం కీలక వ్యాఖ్యలు.. మూడేళ్ల క్రితం అరెస్టుపై సంచలన ప్రకటన

మూడేళ్ల క్రితం అప్పటి వైసీపీ ప్రభుత్వం చేసిన అరెస్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తీవ్రంగా స్పందించారు. ఏ తప్పూ చేయకపోయినా తాను జైలులో గడపాల్సివచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2026-09-09 09:41 GMT

మూడేళ్ల క్రితం అప్పటి వైసీపీ ప్రభుత్వం చేసిన అరెస్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తీవ్రంగా స్పందించారు. ఏ తప్పూ చేయకపోయినా తాను జైలులో గడపాల్సివచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అరెస్టును మరోసారి ప్రస్తావించడం ద్వారా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని టార్గెట్ చేసినట్లుగా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు వల్లే గత ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించగా, ఇప్పుడు స్థానిక ఎన్నికల వేళ అదే ఉదంతాన్ని మరోసారి గుర్తుచేయడం ద్వారా ప్రజల్లో నాటి కసి రగిల్చేలా సీఎం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.

కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ మూడేళ్ల క్రితం నాటి ఘటనను మళ్లీ గుర్తు చేసుకున్నారు. ‘‘గొడ్డలి పార్టీ పాలకులు మూడేళ్ల క్రితం నన్ను అన్యాయంగా అరెస్టు చేసిన విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. మూడేళ్ల క్రితం సెప్టెంబరు 9 తేదీన నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు. ఏ తప్పు లేకుండా అరెస్ట్ చేయడం బాధ కలిగించింది. 48 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నాను. 31 ఏళ్ల క్రితం తొలిసారి సీఎం అయ్యాను. విలువలతో కూడిన రాజకీయం చేయాలని... పేద ప్రజలకు, తెలుగు జాతికి న్యాయం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాను. చాలా మంది నాపై ఆరోపణలు చేశారు. కోర్టులకు వెళ్లారు. నాపై చేసిన ఆరోపణల్ని రుజువు చేయలేక పోయారు... అదే నా నిబద్ధత.’’ అంటూ సీఎం వ్యాఖ్యానించారు.

రాజకీయంపై కుటుంబం ఆధారపడకూడదనే 36 ఏళ్ల క్రితం ఫ్యామిలీ బిజినెస్ ప్రారంభించాం. అప్పట్లో ఆర్ధిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందున కుటుంబ వ్యాపారాన్ని నా సతీమణికి అప్పగించా. నాకు ధన వ్యామోహం లేదు. కేవలం తెలుగు జాతి బాగుండాలనే నేను నిరంతరం ఆలోచన చేస్తా అంటూ తనపై గత ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణలపై వివరణ ఇచ్చారు. ‘‘నంద్యాలలో ఓ సమావేశానికి వెళ్లిన నన్ను అరెస్టు చేస్తామని అర్ధరాత్రి వచ్చారు. నాపై ఆరోపణలు ఏమిటో చెప్పాలని అడిగితే... అరెస్టు చేసిన తర్వాత చెబుతామని అన్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రిని ఉన్న పళంగా అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. నా జీవితంలో ఎన్నడూ అనుకోని సంఘటన ఓ దుర్మార్గమైన వ్యక్తి ఆలోచనల వల్ల జరిగింది.’’ అంటూ నాటి ఘటనను గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేను జైల్లో ఉన్న సమయంలో నాకేం జరుగుతుందోనని తెలుగు జాతి మొత్తం రోడ్లపైకి వచ్చింది. హైదరాబాద్ లో కొందరు అడ్డుపడినా టెకీలు కూడా ముందుకు వచ్చి నిరసనలు తెలిపారంటూ బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఎండగట్టారు. దేశవిదేశాల్లోని తెలుగు వారంతా కదలి వచ్చారు. పవన్ కళ్యాణ్ నాకు సంఘీభావం తెలిపేందుకు వస్తుంటే ఆయననూ అడ్డుకున్నారు. ఏమాత్రం వెనక్కు తగ్గకుండా పవన్ కళ్యాణ్ నాకు సంఘీభావం తెలిపారు. గత పాలకులు పెట్టిన కేసులను కోర్టులు కొట్టేశాయి. ఈడీ లాంటి సంస్థలు కూడా ఇందులో ఏమీ లేదని తేల్చింది. గతంలో అచ్చెన్నాయుడు లాంటి నేతల్ని బలవంతంగా అరెస్టు చేశారు వేధించారు. పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్తే ఆయన్ను అక్కడి నుంచి బలవంతంగా వెనక్కు పంపేశారు. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని గత ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో తనకు సహనం ఎక్కువని ప్రతీకారం తీర్చుకోవాలంటే ఒక్క నిమిషం చాలంటూ తేల్చిచెప్పారు. కానీ నేను ఆ పని చేయలేదని గుర్తు చేశారు.

జగన్ నైజంపై రోశయ్య వ్యాఖ్యలు

ఇక మాజీ సీఎం జగన్ పేరును ప్రస్తావిస్తూ సీఎం తీవ్రవ్యాఖ్యలు చేశారు. ‘‘వైఎస్ఆర్ కు ఆయన కొడుకు విషయంలో జాగ్రత్తలు తీసుకోమని ఆ నాడే చెప్పాను. గొడ్డలి పార్టీ అధ్యక్షుడ్ని ఆయన తండ్రి వైఎస్ఆర్ చదువుకోడానికి అమెరికా పంపిస్తే తిరుగుటపాలో వచ్చేశాడు... ఈ విషయం స్వయంగా వైఎస్సే చెప్పాడు. కొడుకుతో బాధలు భరించలేక అతన్ని వైఎస్సార్ బెంగళూరులోనే ఉంచారని తల్లి విజయమ్మ మాజీ సీఎం రోశయ్యకు చెప్పుకుని బాధపడ్డారు... రోశయ్యే స్వయంగా ఈ విషయం చెప్పారు. ఓ సీఎంగా ఉన్న వ్యక్తి తన కుమారుడిని బెంగుళూరు లాంటి చోట పెట్టాడు అంటే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఎలాంటి వాడో అర్థం చేసుకోండి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కొడుకును ఎప్పుడూ ఏపీకి రానీయలేదు.’’ అంటూ మాజీ సీఎం జగన్మోహనరెడ్డి వైఖరిని చంద్రబాబు ఎండగట్టారు. ‘‘బాబాయి వివేకాను గొడ్డలి వేటుతో కిరాతకంగా చంపేశారు. తెల్లవారితే సీఎంగా ఉన్న నాపై నింద వేసి తన పత్రికలో రాయించారు.’’ అంటూ ఆరోపించారు. తన చెల్లి సునీతను ఏమార్చారు. ఆ రోజే దోషులందరినీ అరెస్టు చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉండేదా. ఇప్పుడు తల్లిని, చెల్లినీ కూడా ఆస్తి కోసం మోసం చేస్తున్నారు. అలాంటి వ్యక్తులతో రాజకీయం చేయాల్సిన దుస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News