ఈ ట్రంప్ వద్దు.. ఆయన చేసే కంపు వద్దు.. జనాలు డిసైడ్ అయిపోయారు

రెండోసారి గద్దెనెక్కిన డోనాల్డ్ ట్రంప్ తాత తన మార్కు నిర్ణయాలతో అమెరికన్ల ఫ్యూజులు ఎగరదీస్తున్నారు.

Update: 2026-09-09 11:30 GMT

రెండోసారి గద్దెనెక్కిన డోనాల్డ్ ట్రంప్ తాత తన మార్కు నిర్ణయాలతో అమెరికన్ల ఫ్యూజులు ఎగరదీస్తున్నారు. "మళ్లీ అధ్యక్షుడినైతే ప్రపంచంలో శాంతి దూతగా వెలిగిపోతా.. దేశాన్ని స్వర్గం చేస్తా" అని హామీలిస్తే.. కట్ చేస్తే ఇప్పుడు అమెరికా ఓటర్లు "బాబోయ్.. ఈ నయా ట్రంపిజం మాకొద్దురా నాయనా" అని గుండెలు బాదుకునే పరిస్థితి వచ్చింది. రాబోయే మధ్యంతర ఎన్నికలు రిపబ్లికన్లకు పెద్ద పరీక్షగా మారగా ఓటర్ల మూడ్ చూస్తే ట్రంప్‌కి 'రిటర్న్ గిఫ్ట్' ఇచ్చేలా ఉన్నారు.

ఓటర్ల మూడ్ మారుతోందా?

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు అధ్యక్షుడి పాలనకు ఒకరకంగా ప్రజాభిప్రాయ పరీక్షగా నిలుస్తాయి. అధ్యక్షుడి పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఓటర్లు ఇచ్చే తీర్పు.. తదుపరి రెండేళ్ల రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో ట్రంప్‌కు సంబంధించిన ప్రజాభిప్రాయ అంచనాలు రిపబ్లికన్లలో ఆందోళన పెంచుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ, జీవన వ్యయం, ఉద్యోగాలు, విదేశాంగ విధానం వంటి అంశాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంటే.. ఎన్నికలు కేవలం డెమొక్రాట్లు వర్సెస్ రిపబ్లికన్ల పోరుగా కాకుండా.. ‘ట్రంప్ పాలనకు ఓటర్ల మార్కులు ఎన్ని?’ అనే అంశంగా మారుతున్నాయన్నమాట.

జేబులు గుల్ల చేస్తున్న ‘అమెరికా ఫస్ట్’ సర్కస్

‘అమెరికా ఫస్ట్’ అంటూ స్థానిక పరిశ్రమలను కాపాడటానికి ట్రంప్ గారు దిగుమతులపై సుంకాల బాదుడు మొదలుపెట్టారు. దెబ్బకి విదేశీ వస్తువులతో పాటు దేశీయ వస్తువుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. "దిగుమతులపై పన్నులు పెంచితే ఆ భారం చివరకు మా జేబులకేగా పడేది తాతా" అని సామాన్య అమెరికన్లు లబోదిబోమంటున్నారు. దేశభక్తి మాట ఎలా ఉన్నా పొద్దున్నే కాఫీ నుంచి సాయంత్రం గ్రాసరీ వరకు ప్రతిచోటా బిల్లు చూసి జనాలు బిక్కమొహమేస్తున్నారు.

మధ్యంతర ఎన్నికల్లో అసలు పోటీ ఇక్కడే!

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడి పేరు నేరుగా బ్యాలెట్‌పై ఉండకపోయినా.. అధ్యక్షుడి పనితీరు మాత్రం ఓటర్ల నిర్ణయంపై ప్రభావం చూపుతుంది. రిపబ్లికన్ అభ్యర్థులకు ఓటు వేయడం అంటే ట్రంప్ విధానాలకు మద్దతు ఇవ్వడంగానే కొంతమంది ఓటర్లు భావించే పరిస్థితి ఏర్పడితే.. అది అధికార పార్టీకి సమస్యగా మారవచ్చు. మరోవైపు డెమొక్రాట్లు కూడా ఇదే అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘ట్రంప్‌కు చెక్ పెట్టాలి’ అనే ప్రచారాన్ని బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంది.

ప్రపంచ శాంతి.. అమెరికన్లకు గుండెకోత

ప్రపంచ యుద్ధాలను ఆపేస్తానని ప్రచారం చేసుకున్న ట్రంప్.. తీరా పీఠం ఎక్కాక మధ్యప్రాచ్యంలో జరుగుతున్న రచ్చను ఆపలేక చేతులెత్తేశారు. "మా పన్నుల డబ్బులు పట్టుకెళ్లి పక్క దేశాల ఘర్షణలకు తగలేయడం ఏంటి? ముందు మా ఇంట్లో తలనొప్పులు తీర్చండి" అని అమెరికన్లు నిలదీస్తున్నారు. 'సూపర్ పవర్' బిల్డప్ పక్కనబెట్టి ముందు మన బ్రతుకులు చూడండని ఓటర్లు గట్టిగానే సౌండ్ చేస్తున్నారు.

యూత్ డిస్‌కనెక్ట్.. నినాదాలు వద్దు.. ఉద్యోగాలు ముద్దు..

ఒకప్పుడు ట్రంప్‌ను ‘సిస్టమ్‌ను మార్చే విప్లవ వీరుడు’గా చూసిన కుర్రకారు ఇప్పుడు రూటు మార్చారు. గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే చేతిలో భారీ రుణాలు, చేతికి చిక్కని ఉద్యోగాలు, సొంతిల్లు కొనాలంటే చుక్కలు కనిపిస్తుంటే.. యూత్‌కి ట్రంప్ పైత్యం మీద విరక్తి పుడుతోంది. సోషల్ మీడియా డైలాగులు కడుపు నింపవని గ్రహించిన కుర్రాళ్ళు ఇప్పుడు ట్రంప్‌కి ఓటుతో బుద్ధి చెప్పేందుకు రెడీ అవుతున్నారు.

మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ బొమ్మ నేరుగా బ్యాలెట్ మీద ఉండకపోవచ్చు.. కానీ ఈసారి పడబోయేది ఆయన మార్కు పాలనకే మార్కులు.. డెమొక్రాట్లు ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు కాచుకుని కూర్చున్నారు. మరి ట్రంప్ మావ తన పాత మ్యాజిక్ రిపీట్ చేసి గట్టెక్కుతారా? లేక ‘హస్తం’ గాలిలో కొట్టుకుపోతారా? అనేది కాలమే చెప్పాలి.

అందుకే ఇప్పుడు ట్రంప్ ముందున్న అసలు సవాలు.. ప్రత్యర్థులను ఓడించడం మాత్రమే కాదు. తనపై అసంతృప్తిగా మారుతున్న ఓటర్లను మళ్లీ తనవైపు తిప్పుకోవడం... మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇదే ప్రశ్న మరింత కీలకంగా మారనుంది. ‘ట్రంప్ మాకొద్దు’ అనే అసంతృప్తి నిజంగా ఓటుగా మారుతుందా? లేక ఎన్నికల నాటికి ట్రంప్ మళ్లీ తన రాజకీయ మ్యాజిక్‌తో పరిస్థితిని మార్చేస్తారా? అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు దీనికి సమాధానం చెప్పనున్నాయి

Tags:    

Similar News