కుట్రలను పెకలిస్తాం.. రేవంత్.. అసెంబ్లీ ఘటనలపై విచారణ
సోమవారం ఉదయం అసెంబ్లీవర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యం లో సభలో దీనికి సంబంధించిన అంశాలపై చర్చ చేపట్టాలని నిర్ణయించారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సంబంధించి చోటు చేసుకున్న అన్ని ఘటనలపై విచారణకు ఆదేశిస్తూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. విచారణ అధికారిగా.. సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్‌ను నియమిం చారు. ఆయనతోపాటు ఈ కమిటీలో 10 మంది అధికారులు ఉండనున్నారు. వీరు అసెంబ్లీ బయట చోటు చేసుకున్న ఘటనల పై విచారణ చేయనున్నారు. అనంతరం నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించనున్నారు.. మరోవైపు.. అసెంబ్లీలోపల చోటు చేసుకున్న ఘటనలపై ఇప్పటికే స్పీకర్ చర్యలు తీసుకున్నారు. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను ప్రస్తుత సమావేశాలు జరిగే వరకు సస్పెండ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సోమవారం నుంచి బుధవారం వరకు అంటే మూడు రోజుల పాటు చోటుచేసుకున్న ఘటనలపై విచారణకు ఆదేశిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దళితులపై అణచివేత, దురాగతాలకు పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. కుట్రలు చేసిన వారితో పాటు, అమలుచేసిన వారిని కోర్టులో నిలబెట్టి శిక్షించాలని నిర్ణయించామని తెలిపారు. సభను సజావుగా సాగకుండా చేయాలన్న దురుద్దేశంతోనే ఈ విధంగా వ్యవహరించారని.. పోలీసులపై దాడులు చేశారని, వారి గొంతు పిసికే ప్రయత్నం చేశారని పేర్కొన్న విషయం తెలిసిందే.
అసలు ఏం జరిగింది?
సోమవారం ఉదయం అసెంబ్లీవర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యం లో సభలో దీనికి సంబంధించిన అంశాలపై చర్చ చేపట్టాలని నిర్ణయించారు. అయితే.. అదే రోజు.. రాష్ట్రంలో వెయ్యి రోజుల చీకటి పాలన పేరుతో బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు.. నల్ల టీషర్టులు ధరించి.. గన్ పార్క్ నుంచి నిరసనగా.. అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించారు. అయితే.. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర వివాదం చోటు చేసుకుంది. మహిళా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను పోలీసులు అవమానించారని.. పేర్కొంటూ.. బీఆర్ ఎస్ నిరసనకు దిగింది. అదేసమయంలో పురుష ఎమ్మెల్యేలపైనా పోలీసులు దాడి చేశారని పేర్కొంది.
అయితే.. పోలీసులపైనే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు దాడులు చేశారని అధికార పక్షం..ఫొటోలు, వీడియోలను రిలీజ్ చేసింది. మహిళా పోలీసులపై పురుష ఎమ్మెల్యేలు చేతులు వేశారని.. ఆరోపిస్తూ.. మంత్రి సీతక్క మరో వీడియోను సభలో ప్రదర్శించారు. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే ఎమ్మెల్సీలు.. తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలు.. చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కార్నర్ చేసుకుని వారు చేసిన వ్యాఖ్యలతో తీవ్ర అలజడి రేగింది. పోలీసులు వారిని అరెస్టు చేయడం, కోర్టు రిమాండ్‌ను తిరస్కరించడం తెలిసిందే. అయితే.. వారిని మండలి నుంచి సస్పెండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారాలతో మూడు రోజుల పాటు సభా కాలం సమసిపోయింది. ఇప్పుడు ఈ ఘటనలపై విచారణకు ఆదేశిస్తూ.. సీఎం నిర్ణయించడం గమనార్హం.