చిన్న శ్రీను మీద బొత్స కామెంట్స్ వైరల్ !

అంతకంటే ఆయన ఎక్కువ చెప్పలేదు కానీ చిన్న శ్రీను వైసీపీ గూడు వీడిపోవడం వెనక అయితే మేనల్లుడి స్వార్ధ రాజకీయం ఉంది అని క్లారిటీ ఇచ్చారు అని అంటున్నారు.

Update: 2026-09-09 14:34 GMT

తన సొంత మేనల్లుడు తనను కాదని తాను ఉన్న పార్టీని కాదని తన దారి తాను చూసుకోవడం మీద సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఏపీ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే బొత్స నీడగా ఆయన కుడి భుజంగా ఉన్న చిన్న శ్రీను వైసీపీ పుష్కర కాలంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాజకీయ ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీలో చేరడం అంటే అది వైసీపీ నేతలు క్యాడర్ మొత్తం జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపధ్యంలో బొత్స స్పందన కోసం వైసీపీ నేతలు కూడా వేచి చూస్తున్నారు. మొత్తానికి బొత్స ఎట్టకేలకు తన మేనల్లుడు పార్టీ మారడం మీద స్పందించారు. అయితే ఆయన లైట్ గానే తీసుకున్నట్లుగా ఈ కామెంట్స్ ఉన్నాయి. అదే సమయంలో సూటిగా స్పష్టంగా ఆయన ఒక్క మాట చెప్పారు. అదే స్వార్థం అని. ఈ పదం చాలా పెద్దది అని అంటున్నారు.

స్వార్ధంతోనే అన్నట్లుగా :

ఇక బొత్స చిన్న శ్రీను విషయంలో కేవలం రెండే రెండు మాటలు మాట్లాడారు. అయితే అందులోనే సీరియస్ నెస్ అంతా ఉంది. ఆయన ఇంతకీ అన్నది ఏంటి అంటే మ‌నిష‌న్న వాడికి స్వార్థం ఉంటుంది అని, రాజ‌కీయ పార్టీల్లోకి మ‌నుషులు వ‌స్తుంటారు పోతుంటారు చివరికి పార్టీలు మాత్రమే శాశ్వ‌తం అని బొత్స చెప్పుకొచ్చారు. అంటే తన స్వార్ధం కోసమే మేనల్లుడు పార్టీ మారారు అన్నది బొత్స ధృవీకరించారు అన్న మాట. అంతకంటే ఆయన ఎక్కువ చెప్పలేదు కానీ చిన్న శ్రీను వైసీపీ గూడు వీడిపోవడం వెనక అయితే మేనల్లుడి స్వార్ధ రాజకీయం ఉంది అని క్లారిటీ ఇచ్చారు అని అంటున్నారు.

వైసీపీలో చాన్స్ లేదా :

అయితే పదవుల విషయంలోనే మేనల్లుడు పార్టీ మారితే బొత్స లాంటి దిగ్గజ నేత మొత్తం ఉత్తరాంధ్రా రాజకీయాలను చక్కబెడుతున్న సీనియర్ నాయకుడు తన మేనల్లుడికి పదవులు ఇప్పించుకోలేకపోయారా అన్నదే చర్చగా వస్తోంది. విజయనగరం జెడ్పీ చైర్మన్ పదవి కూడా గతంలో ఉత్తరాంధ్రా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా పనిచేసిన విజయసాయిరెడ్డి వల్లనే చిన్న శ్రీనుకు దక్కింది అని చెబుతున్నారు. నిజానికి స్వార్థం లేకుండా ఎవరూ పని చేయరు అని అంటున్నారు. పదవులు దక్కితే వైసీపీలోనే చిన్న శ్రీను ఉండేవారు కదా అని అంటున్నారు. ఆయనకు ఎమ్మెల్యే కానీ ఎంపీ టికెట్ కానీ ఇప్పించి ఉంటే ఈ విధంగా ఫిరాయించి ఉండేవారు కాదు కదా అని అంటున్నారు. అంతే కాదు 2029 ఎన్నికల్లో భరోసా ఆయనకు దక్కేలా చూసి ఉన్నా వైసీపీలో ఇంతటి రాజకీయ ఉప్రద్రవం సంభవించేది కాదు కదా అని అంటున్నారు.

భీమిలీ మీద అయిష్టత :

విజయనగరం జిల్లాకు చెందిన చిన్న శ్రీనుకు భీమిలీ అసెంబ్లీ సీటు వైసీపీ ఇంచార్జి బాధ్యతలు ఇచ్చారు. అది టీడీపీకి కంచుకోటగా ఉంది. దాంతో అక్కడ ఆయన రాజకీయం పండదని కూడా అర్థం అయిపోయింది అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం అసెంబ్లీ సీటు మీద చిన్న శ్రీనుకు కన్ను ఉందని కూడా ప్రచారం సాగింది. అలాగే ఎస్ కోట నుంచి అయినా ఆయనను బరిలోకి దించవచ్చు, అంతే కాదు విజయనగరం నుంచి ఎంపీగా నిలబెట్టవచ్చు, మరి ఆ విధంగా చేయకపోవడం వల్లనే ఆయన ఈ రోజు పార్టీ గేటు దాటుకుని ప్రత్యర్ధి శిబిరంలోకి చేరిపోయారు అని అంటున్నారు. ఏది ఏమైనా బొత్స మాటలు అయితే వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News