రోజుకు రూ.8–12 లక్షల ఖర్చు.. అసెంబ్లీలో ప్రజా సమస్యపై చర్చ ఏది?
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. 6 రోజులు నిర్వహించాలని నిర్ణయించారు.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. 6 రోజులు నిర్వహించాలని నిర్ణయించారు. అంటే.. ఈ గురు, శుక్ర, శనివారంతో ఈ సభలకు ముగింపు పలకనున్నారు. కీలకమైన బిల్లులను ఈ సభలో ప్రవేశ పెట్టి ఆమోదించుకోవాలని ప్రభుత్వం పక్షం నిర్ణయించుకుంది. అలాగే.. వెయ్యిరోజుల పాలన పై కూడా చర్చించి.. ప్రజలకు ఏయే మేళ్లు చేశారు.. ఏమేరకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు.. అనే విషయాలను కూడా వివరించాలని నిర్ణయించారు. అజెండాలోనూ వీటిని పేర్కొన్నారు.
ఇక, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ విషయానికి వస్తే.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను.. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, హైడ్రా కమిషనర్ వ్యవహారం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, ఎల్ నినో ప్రభా వం సహా.. ఇతర అంశాలను కూడా ప్రస్తావించాలని నిర్ణయించుకుంది. తద్వారా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని తొలుత నిర్ణయించింది. కానీ, అనూహ్యంగా అసెంబ్లీ వాతావరణమే మారిపోయింది.
మూడు రోజుల అసెంబ్లీలో ఒక్కటంటే ఒక్క సమస్య కూడా ప్రస్తావనకురాలేదు. అటు అధికార పక్షం, ఇటు ప్రధాన ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగు కోవడమే సరిపోయింది. అసెంబ్లీ తొలి రోజు సోమవారం.. వెయ్యి రోజుల పాలనలో ఏమీ జరగలేదని చెబుతూ.. నల్ల టీషర్టులు ధరించి నిరసన వ్యక్తం చేయడం నుంచి స్పీకర్‌పై బీఆర్ ఎస్ ఎమ్మెల్సీలు.. చేసిన వ్యాఖ్యలు సభను కుదిపి వేశాయి. పోనీ రెండో రోజైనా సర్దుకున్నాయా? అంటే.. లేదు. ఎమ్మెల్సీల వ్యవహారం.. ఇరుపక్షాల మాటల దాడితోనే సభా సమయం కరిగిపోయింది.
మూడో రోజు కూడా ఇదే తంతు సభలో కొనసాగింది. తమపైనే దాడి చేశారంటూ.. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల పై కాంగ్రెస్ పార్టీ, కాదు.. మీరే మమ్మల్ని అవమానించారని.. మహిళలపైనా దాడులు చేశారని బీఆర్ ఎస్ నేతలు యుద్ధాన్ని తలపించేలా సభలో వాగ్యుద్ధం చేసుకున్నారు. ఫలితంగా.. సభలో రభస తప్ప.. మరేమీ కనిపించలేదు. రోజుకు 8- 12 లక్షల రూపాయల మేరకు ఖర్చు చేస్తున్న సభలో ఒక్క ప్రజా సమస్యపైనా.. నాయకులు నోరు విప్పకపోవడం గమనార్హం.
ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ఎల్ నినో.. రాజధానిలో అడుగంటుతున్న శాంతి భద్రతలు..(డీజీపీ ఆనందే వెల్లడించారు) వంటి అంశాలపై ఒక్కరు సైతం మాట్లాడకపోవడం గమనార్హం. మరి రభస ఎవరి కోసం.. రేపు సభ అయిపోయిన తర్వాత.. ఎవరి మానాన వారు తమ తమ పనుల్లో ఉంటారు. మరి ప్రజా సమస్యలపై చర్చించేది ఎప్పుడు? అనేది ధర్మసందేహం.!