పోటీ : ఏఐని ఉపయోగించగల మనిషి vs ఏఐని ఉపయోగించలేని మనిషి
‘ఏఐ వస్తోంది.. ఇక ఉద్యోగాలు ఉండవు’ అనే భయంతో కెరీర్‌ను మార్చుకోవడం కంటే ఏఐని ఉపయోగించగల నైపుణ్యాలను పెంచుకోవడం ప్రస్తుతానికి మరింత ఆచరణాత్మకమైన మార్గంగా కనిపిస్తోంది.
ఏఐ వస్తోంది.. ఉద్యోగాలు పోతాయా? ఈ ప్రశ్న గత కొంతకాలంగా యువతను వెంటాడుతోంది. ఇప్పుడు చాట్‌జీపీటీ ఆస్ట్రా 6 పేరుతో వస్తున్న కొత్త తరం ఏఐ సామర్థ్యాలపై చర్చ మొదలవడంతో ఈ భయం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే దీన్ని కేవలం ‘ఉద్యోగాలు పోయే ప్రమాదం’గా చూడాలా? లేక మనిషి చేసే పనిని ఏఐ మరింత వేగంగా పూర్తి చేసే కొత్త దశగా అర్థం చేసుకోవాలా? అసలు చర్చ ఇక్కడే మొదలవుతోంది.
ఐదు గంటల పని.. మూడు నిమిషాల్లోనే?
ఇప్పటి వరకు ఏఐతో సమాచారం వెతకడం, కంటెంట్ తయారు చేయడం, కోడింగ్ వంటి పనులు చేయించుకోవడం చూశాం. కానీ ఆస్ట్రా 6 విషయంలో ప్రత్యేకంగా చర్చకు వస్తున్న అంశం ఏఐ స్వయంగా కంప్యూటర్‌పై పని చేయగలగడం. బ్రౌజర్‌లో సమాచారం వెతకడం, వెబ్‌సైట్లలో నావిగేట్ చేయడం, ఆన్‌లైన్ ఫారాలు నింపడం, రీసెర్చ్ చేయడం, డాక్యుమెంట్లు తయారు చేయడం వంటి అనేక దశలను ఒకే వర్క్‌ఫ్లోలో నిర్వహించే సామర్థ్యం దీనికి ఉన్నట్లు చెబుతున్నారు.
ఓపెన్‌ఏఐ నిర్వహించిన ఒక పరీక్షలో మనిషికి సుమారు ఐదు గంటలు పట్టే జాబ్-సెర్చ్ సంబంధిత పనిని 2 నిమిషాల 51 సెకన్లలో పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఇదే విషయం ఇప్పుడు యువతలో అసలు ప్రశ్నను లేవనెత్తుతోంది.. ‘ఏఐ మన పనిని సులభం చేస్తుందా? లేక మన స్థానాన్నే తీసుకుంటుందా?’ అన్నది ప్రధాన ప్రశ్న.
ఉద్యోగం కంటే ‘పని’కే ముప్పా?
ఇక్కడ గమనించాల్సిన కీలకమైన విషయం ఒకటి ఉంది. ఏఐ ప్రతి ఉద్యోగాన్ని ఒక్కసారిగా భర్తీ చేయడం కంటే.. ఆ ఉద్యోగంలో మనిషి చేసే పునరావృత పనులను ముందుగా ఆటోమేట్ చేసే అవకాశం ఎక్కువ. ఉదాహరణకు డేటాను సేకరించడం, ఒకే రకమైన రిపోర్టులు తయారు చేయడం, సమాచారాన్ని వర్గీకరించడం, ప్రాథమిక కస్టమర్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం వంటి పనులను ఏఐ వేగంగా చేయగలిగితే.. ఉద్యోగి పాత్ర కూడా మారవచ్చు. అంటే రేపటి ఉద్యోగంలో ‘ఎంత వేగంగా పని చేస్తారు?’ అనే ప్రశ్నతో పాటు ‘ఏఐతో కలిసి ఎంత సమర్థంగా పని చేయగలరు?’ అనేదీ కీలకంగా మారే అవకాశం ఉంది.
ఐటీ యువత ఎందుకు ఆందోళన చెందుతోంది?
కోడింగ్, డేటా అనాలిసిస్, కస్టమర్ సపోర్ట్, రీసెర్చ్, అడ్మినిస్ట్రేటివ్ పనులు వంటి రంగాల్లో ఇప్పటికే ఆటోమేషన్ ప్రభావం కనిపిస్తోంది. కొత్త మోడల్స్ సమాచారం చదవడం మాత్రమే కాకుండా.. దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే స్థాయికి వెళ్తుండటంతో ఈ ఆందోళన మరింత పెరుగుతోంది. ఇప్పటివరకు ఉద్యోగి ఒక పనిలో పది దశలు చేయాల్సి వస్తే ఏఐ వాటిలో ఎక్కువ దశలను స్వయంగా నిర్వహించగలిగితే సంస్థలకు అవసరమైన మానవ శ్రమ కూడా మారవచ్చు. అందుకే సోషల్ మీడియాలో కొందరు యువత ‘ఐటీ ఉద్యోగం కంటే సొంత ఊరికి వెళ్లి వ్యవసాయం చేయడమే బెటర్’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇది కేవలం జోక్‌గా కనిపించినా.. ఏఐపై పెరుగుతున్న ఉద్యోగ భద్రత ఆందోళనకు ఒక ఉదాహరణగా చూడవచ్చు.
మార్కెట్‌లోనూ అలజడి
ఆస్ట్రా విడుదలపై చర్చ కేవలం ఉద్యోగులకే పరిమితం కాలేదు. ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ కంపెనీల భవిష్యత్ వ్యాపారంపై కూడా మార్కెట్‌లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. మంగళవారం సేల్స్‌ఫోర్స్, ఇంట్యూట్ షేర్లు దాదాపు 4 శాతం చొప్పున పడిపోగా సర్వీస్‌నౌ సుమారు 5 శాతం నష్టపోయింది. అమెరికా సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ ఇండెక్స్ కూడా 1.4 శాతం తగ్గింది. అయితే ఈ షేర్ మార్కెట్ కదలికలను కేవలం ఆస్ట్రా విడుదలకు మాత్రమే ఆపాదించడం సరైనది కాదు. మార్కెట్‌లో కంపెనీల పనితీరు, వాల్యుయేషన్లు, పెట్టుబడిదారుల అంచనాలు, టెక్ రంగంపై ఉన్న విస్తృత ఆందోళనలు వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి.
మరి యువత ఏం చేయాలి?
‘ఏఐ వస్తోంది.. ఇక ఉద్యోగాలు ఉండవు’ అనే భయంతో కెరీర్‌ను మార్చుకోవడం కంటే ఏఐని ఉపయోగించగల నైపుణ్యాలను పెంచుకోవడం ప్రస్తుతానికి మరింత ఆచరణాత్మకమైన మార్గంగా కనిపిస్తోంది. ఒకప్పుడు కంప్యూటర్ రావడంతో కొన్ని పనులు ఆటోమేట్ అయ్యాయి. ఇంటర్నెట్ రావడంతో మరికొన్ని పనుల స్వరూపం మారింది. ఇప్పుడు ఏఐ అదే మార్పును మరింత వేగంగా తీసుకొస్తోంది. కాబట్టి భవిష్యత్‌లో విలువైన ఉద్యోగి అంటే కేవలం తన పని తెలిసిన వ్యక్తి కాకుండా.. తన రంగంపై అవగాహనతో పాటు ఏఐని ఉపయోగించి మరింత వేగంగా, మెరుగ్గా ఫలితాలు సాధించగల వ్యక్తి కావచ్చు.
అసలు పోటీ మనిషి vs ఏఐ కాదు
ఆస్ట్రా 6 చుట్టూ జరుగుతున్న చర్చలో అసలు ఆసక్తికరమైన కోణం ఇదే. రేపటి పోటీ ‘మనిషి వర్సెస్ ఏఐ’గా ఉండకపోవచ్చు. ఏఐని ఉపయోగించగల మనిషి vs ఏఐని ఉపయోగించలేని మనిషి మధ్య పోటీగా మారే అవకాశం ఉంది. అందుకే యువతకు ఇప్పుడు ఎదురవుతున్న అసలు ప్రశ్న ‘నా ఉద్యోగాన్ని ఏఐ తీసుకుంటుందా?’ అనేది మాత్రమే కాదు. ‘ఏఐ వచ్చిన తర్వాత కూడా నా విలువ ఎందుకు ఉండాలి?’ అనేదే. దానికి సమాధానం కొత్త నైపుణ్యాలు, సృజనాత్మకత, నిర్ణయ సామర్థ్యం, రంగంపై లోతైన అవగాహన, ఏఐతో కలిసి పనిచేసే సామర్థ్యంలో ఉండొచ్చు.
ఆస్ట్రా ఉద్యోగాలను వెంటనే మాయం చేస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం.. ఉద్యోగ ప్రపంచం మారబోతోందన్న సంకేతాలు మాత్రం బలపడుతున్నాయి.