ఉత్తరాంధ్రా మీద టీడీపీ రాజకీయ పట్టు !

విజయనగరం జిల్లాను పూసపాటి వంశీకులు రాజకీయంగా శాసిస్తూ వచ్చారు. అశోక్ గజపతిరాజు మాట మీదనే పార్టీ మొదటి నుంచి గట్టిగా నిలబడుతూ వచ్చింది.

Update: 2026-09-10 02:30 GMT

విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైసీపీకి ఆ జిల్లాలో వెన్నెముక లాంటి నాయకుడు అయిన చిన్న శ్రీనుని సైకిలెక్కించిన వైనం చూస్తే తెలుగుదేశం పార్టీ బహుముఖమైన వ్యూహాలను అమలులోకి పెట్టింది అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఉత్తరాంధ్రాలో రాజకీయంగా గట్టి బలం ఉంది. ఆ పార్టీకి మూడు ఉమ్మడి జిల్లాలలో ప్రతీ జిల్లాలో బలమైన నేతలు ఉన్నారు. అంతే కాదు ప్రతీ సామాజిక వర్గంలో కీలక నేతలు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే వెలమ సామాజిక వర్గానికి చెందిన ఎర్రన్నాయుడు నుంచి ఆ కుటుంబం అలా కొనసాగుతోంది. మరో కీలక సామాజిక వర్గం కాళింగుల నుంచి తమ్మినేని సీతారాం మొదట్లో ఉండేవారు, ఆ తరువాత ఆయన మేనల్లుడు కూన రవికుమార్ అలాగే ఇచ్చాపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ వంటి వారు ఉన్నారు. తూర్పు కాపుల నుంచి కిమిడి కళా వెంకటరావు తదితరులు ఉన్నారు.

విశాఖలో సైతం :

అదే విధంగా విశాఖ జిల్లాలో చూసుకుంటే కాపులు ప్లస్ వెలమలు, గవరలు యాదవులు ఇలా టీడీపీకి ప్రతీ సామాజిక వర్గంలో దిగ్గజ నేతలు ఉన్నారు. అయ్యన్నపాత్రుడు గంటా శ్రీనివాసరావు దాడి వీరభద్రరావు, పల్లా శ్రీనివాసరావు వంటి వారు టీడీపీకి బలమైన నేతలుగా ఉన్నారు. అలాగే కమ్మ నేతలు చూస్తే దివంగత ఎంవీవీఎస్ మూర్తి నుంచి మొదలై ఆయన మనవడు ప్రస్తుతం విశాఖ ఎంపీగా ఉన్న శ్రీ భరత్, విశాఖ తూర్పు నుంచి నాలుగు సార్లు గెలిచిన వెలగపూడి రామక్రిష్ణబాబు వంటి వారు ఉన్నారు. వీరే కాదు ఇతర వర్గాల నుంచి గుర్తింపు కలిగిన నేతలు ఉన్నారు. అయితే విజయనగరం జిల్లా రాజకీయాలు మొదటి నుంచి రాజుల ఆధీనంలో సాగుతూ వచ్చాయి.

అక్కడే లోటుగా ఉంది :

విజయనగరం జిల్లాను పూసపాటి వంశీకులు రాజకీయంగా శాసిస్తూ వచ్చారు. అశోక్ గజపతిరాజు మాట మీదనే పార్టీ మొదటి నుంచి గట్టిగా నిలబడుతూ వచ్చింది. బీసీలు ఎక్కువ మంది ఉన్నా కూడా రాజుల హవాయే కొనసాగింది. అయితే ఇపుడు అశోక్ గజపతి రాజు రాజకీయాల నుంచి తప్పుకుని గోవా గవర్నర్ గా నియమితులు అయ్యారు. దాంతో జిల్లాలో బీసీలకు రాజకీయంగా అవకాశాలు ఇవ్వాలని టీడీపీ ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో బీసీకి విజయనగరం ఎంపీ సీటు తొలిసారి ఇచ్చింది. అలాగే బీసీకి మంత్రి పదవి ఇచ్చింది. అలాగే బీసీ నేతకే జిల్లా పగ్గాలు అప్పగించింది. వీరంతా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. ఇపుడు అదే సామాజిక వర్గంలో బలవంతుడైన చిన్న శ్రీనుని తీసుకుని రావడం వెనక కూడా టీడీపీ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు.

బాలెన్స్ చేయడానికే :

ఉత్తరాంధ్రాలో తూర్పు కాపులు అధికంగా ఉన్నారు, గతంలో ఆ సామాజిక వర్గం నుంచి నేతలు ఉన్నా వారంతా సీనియర్లుగా మారి తెర వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితులలో చిన్న శ్రీనుని తెచ్చి టీడీపీ ఆ సామాజిక వర్గం ఫేస్ గా పార్టీ జనంతో పాటు ప్రజల ముందు ఉంచుతోంది. దీని వల్ల వెలమ తూర్పు కాపులు ఇతర బీసీ సామాజిక వర్గాలు అన్నీ కూడా టీడీపీ వెన్నటి ఉన్నాయన్న సంకేతాలను తెలియచేయడం ముఖ్య ఉద్దేశ్యంగా చెబుతున్నారు. అదే సమయంలో తూర్పు కాపులలో దిగ్గజ నేత బొత్స సత్యనారాయణ వైసీపీలో ఉన్నారు. ఆయనను దెబ్బ తీయడం ద్వారా వైసీపీని వీక్ చేయాలన్నది వ్యూహంగా ఉంది. దాని వల్ల విజయనగరం జిల్లాను వైసీపీ 2019 మాదిరిగా క్లీన్ స్వీప్ చేసే చాన్స్ లేకుండా చేశారని అంటున్నారు.

Tags:    

Similar News