ఒకప్పుడు దానం చేసిన అమెరికానే ఇప్పుడు భారత్ సాయం కోరుతోంది!

ఒకప్పుడు అంతరిక్ష ప్రయోగాల కోసం ఇతర దేశాల సాయం తీసుకున్న భారత్.. నేడు ఆ దేశాలకే తన రాకెట్లతో ఉపగ్రహాలను ప్రయోగించే స్థాయికి ఎదిగింది.;

Update: 2025-08-11 07:10 GMT

ఒకప్పుడు అంతరిక్ష ప్రయోగాల కోసం ఇతర దేశాల సాయం తీసుకున్న భారత్.. నేడు ఆ దేశాలకే తన రాకెట్లతో ఉపగ్రహాలను ప్రయోగించే స్థాయికి ఎదిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) త్వరలో అమెరికాకు చెందిన 6,500 కిలోల బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్‌ను స్వదేశీ రాకెట్‌తో అంతరిక్షంలోకి పంపనుంది. ఈ ప్రయోగం రాబోయే రెండు నెలల్లో జరగనుంది.

ఇటీవల నాసా-ఇస్రో సంయుక్తంగా రూపొందించిన ‘నైసర్’ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఉత్సాహంతో ఇస్రో మరో చారిత్రక మైలురాయిని చేరుకోబోతోంది. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ ఈ విషయాన్ని ప్రకటించారు. “ఆరు దశాబ్దాల క్రితం మనం అమెరికా నుంచి ఒక చిన్న రాకెట్‌ను పొందాము. ఇప్పుడు అదే అమెరికా తయారు చేసిన భారీ ఉపగ్రహాన్ని మన రాకెట్‌తో మన భూభాగం నుంచి అంతరిక్షంలోకి పంపబోతున్నాం. ఇది అద్భుతమైన ప్రగతి” అని ఆయన గర్వంగా పేర్కొన్నారు.

1963లో మొదలైన భారత అంతరిక్ష ప్రయాణం, ఆరంభంలో అభివృద్ధి చెందిన దేశాల కన్నా సాంకేతికంగా వెనుకబడి ఉండేది. ఆ ఏడాది నవంబర్ 21న అమెరికా అందించిన చిన్న రాకెట్ ప్రయోగంతోనే ఈ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. 1975లో అమెరికా శాటిలైట్ డేటా సహాయంతో దేశంలోని 2,400 గ్రామాల్లో ‘మాస్ కమ్యూనికేషన్’ ప్రయోగాన్ని విజయవంతం చేయడం ఒక కీలక ఘట్టంగా నిలిచింది.

జూలై 30, 2025న ఇస్రో–నాసా సంయుక్తంగా రూపొందించిన నైసర్ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వి-ఎఫ్16 రాకెట్‌తో విజయవంతంగా ప్రయోగించడం ద్వారా భారత అంతరిక్ష సామర్థ్యాన్ని మరింత బలంగా చాటింది. ఈ మిషన్ ఖచ్చితత్వంపై నాసా శాస్త్రవేత్తలు సైతం ప్రశంసలు కురిపించారు.

గత 50 ఏళ్లలో ఇస్రో అనూహ్యమైన ప్రగతిని సాధించింది. ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 433 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగిస్తూ, ప్రపంచ అంతరిక్ష మార్కెట్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపింది. ఒకప్పుడు ‘సహాయం తీసుకున్న దేశం’గా ఉన్న భారత్, నేడు ‘సహాయం అందించే దేశం’గా మారింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Tags:    

Similar News