గాజా గజ గజ: విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌... యూఎస్ హెచ్చరిక ఇదే!

24 గంటల్లో 450 లక్ష్యాలపై బాంబు దాడులు జరిగాయంటే హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయేల్ సైన్యం ఏ స్థాయిలో విరుచుకుపడుతుందనేది అర్ధం చేసుకోవచ్చు.

Update: 2023-10-12 04:15 GMT

యుద్ధం వాళ్లు మొదలుపెట్టినా.. పూర్తి చేసేది మాత్రం మేమే. ఇజ్రాయేల్ శత్రుదేశాలకు కొన్ని దశాబ్ధాల పాటు గుర్తుండిపోయేలా ఈ యుద్ధం ముగిస్తాం. మానవ మృగాలతో యుద్ధం చేస్తున్నాం కాబట్టి.. మా నిర్ణయాలు అందుకు తగ్గట్లుగానే ఉంటాయి. అంటూ ఇజ్రాయేల్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు, ఇచ్చిన స్టేట్ మెంట్స్ కూ తగ్గట్లుగానే ఆ దేశ సైన్యం విరుచుకుపడుతుంది. గడిచిన 24 గంటల్లో గాజాను గజ గజ లాడించింది ఇజ్రాయేల్ సైన్యం.

24 గంటల్లో 450 లక్ష్యాలపై బాంబు దాడులు జరిగాయంటే హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయేల్ సైన్యం ఏ స్థాయిలో విరుచుకుపడుతుందనేది అర్ధం చేసుకోవచ్చు. అష్టదిగ్బంధనంలో భాగంగా ఇప్పటికే ఆహారం, విద్యుత్తు, ఇంధన సరఫరాలను నిలిపేసిన ఇజ్రాయేల్... ఒక కాలనీ వెంట మరో కాలనీలపై బాంబు దాడులు చేసుకుంటూ భవనాలను నేలమట్టం చేస్తూ వెళ్తోంది.

ఫలితంగా 2,50,000 మంది ఇళ్లను వదిలి వెళ్లగా.. 4,00,000 మందికి నీరు, శానిటేషన్‌ సౌకర్యాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం జనరేటర్లపై నడుస్తున్న ఆఫీసులు, ఆసుపత్రులు ఇంధనం కోసం అల్లాడుతున్నాయి. ఇదే సమయంలో నడుస్తున్న ఒకే ఒక్క విద్యుత్తు ప్లాంటులో కూడా ఇంధనం కొరత కారణంగా మరికొన్ని గంటల్లో గాజా అంతా అంధకారం నెలకొనే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తుంది.

అవును... ఇజ్రాయెల్‌ పై హమాస్‌ మిలిటెంట్లు మొదలుపెట్టిన దాడితో భగ్గుమన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తత రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే గాజాను అష్ట దిగ్బంధం చేసిన ఇజ్రాయెల్‌.. వైమానిక దాడులతో ఆ నగరంపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇందులో భాగంగా... శనివారం ప్రారంభమైన ఘర్షణతో ఇప్పటిదాకా 2,265 మంది మరణించారు.

వీరిలో ఇజ్రాయెల్‌ లోనే 1,200 మంది చనిపోగా.. గాజాలో 1,050 మంది మరణించారని అంటున్నారు. వీరిలో 260 మంది పిల్లలు, 230 మంది మహిళలు ఉన్నారు. ఇదే సమయంలో గాజాపై గ్యాప్ ఇవ్వకుండా బాంబుల వర్షం కురిపిస్తోన్న ఇజ్రాయేల్ సైన్యం... మిలిటెంట్లకు శిక్షణ ఇస్తోందని ఆరోపిస్తూ ఇస్లామిక్‌ విశ్వవిద్యాలయంపైనా దాడులు చేసింది.

కాగా... హామాస్ దాడుల వెనుకున్న మాస్టర్ మైండ్ మహమ్మద్ డెయిఫ్ లక్ష్యంగా ఇజ్రాయేల్ సైన్యం చెలరేగిపోతోంది. ఇందులో భాగంగా ఖాన్‌ యూనిస్‌ ప్రాంతంలో హమాస్‌ కీలక నేత మహమ్మద్‌ డెయిఫ్‌ ఇంటిపై ఇజ్రాయెల్‌ బాంబు దాడులు చేసింది. దీంతో అతడి తండ్రి, సోదరుడు, మరో ఇద్దరు బంధువులు మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డెయిఫ్ ఆచూకీ కోసం వేట కొనసాగుతోంది.

మరోవైపు లెబనాన్‌, సిరియా నుంచి ఇజ్రాయేల్ పై మిలిటెంట్ల దాడులు మొదలయ్యాయి. దీంతో ఈ ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో అగ్రరాజ్యం అమెరికా ఎంటరయ్యింది. ఈ ఘర్షణలో ఇతర దేశాలు, గ్రూపులు తలదూర్చవద్దని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ హెచ్చరించారు.

వారి హెచ్చరిక అలా ఉంటే... అటు అమెరికాకూ రివర్స్ లో హెచ్చరికలు రావడం గమనార్హం. ఇందులో భాగంగా.. ఇజ్రాయేల్ కు హమాస్ కు మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటే అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్‌ మద్దతిచ్చే ఇరాక్‌ లోని మిలిటెంట్‌ గ్రూప్‌ కతైబ్‌ హెజ్‌ బొల్లా మిలీషియా హెచ్చరించింది. దీంతో... వ్యవహారం మరింత చర్చనీయాంశం అయ్యింది.

Tags:    

Similar News