రాజస్థాన్ రాయల్స్ ఛాన్స్ ఆశ చూపించి రూ.23లక్షలు కొట్టేసిన సైబర్ మోసగాళ్లు!
చిక్కోడి తాలూకాకు చెందిన రాకేష్ యదురే అనే కుర్రాడు రాష్ట్ర స్థాయిలో క్రికెట్ ఆడుతున్నాడు.;
ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ దేశాన్ని ఊపేస్తోంది. క్రికెటర్లు కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే, కొందరు మోసగాళ్లు ఆ పేరు చెప్పుకుని అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. 19 ఏళ్ల యువ క్రికెటర్ రాకేష్ యదురేకు రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ జట్టులో చోటు కల్పిస్తామని నమ్మించి, ఏకంగా 23 లక్షల రూపాయలకు పైగా కొట్టేశారు. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చిక్కోడి తాలూకాకు చెందిన రాకేష్ యదురే అనే కుర్రాడు రాష్ట్ర స్థాయిలో క్రికెట్ ఆడుతున్నాడు. 2024 మే నెలలో హైదరాబాద్‌లో జరిగిన ఒక టోర్నమెంట్‌లో రాకేష్ అదరగొట్టాడు. అతని ఆట తీరు చూసి పెద్ద అవకాశాలు వస్తాయని అందరూ ఆశించారు. కానీ, 2024 డిసెంబర్‌లో రాకేష్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ వచ్చింది. అందులో "రాజస్థాన్ రాయల్స్ జట్టులో మీకు చోటు దక్కింది" అని ఉంది. ఆ మెసేజ్‌తో పాటు ఒక ఫామ్ నింపమని, మొదట రూ.2,000 ఫీజు కట్టమని అడిగారు.
పాపం, రాకేష్ ఆ మెసేజ్‌ను నిజమని నమ్మి, ఫామ్ నింపి డబ్బులు కట్టాడు. ఆ తర్వాత మోసగాళ్లు వాడితో ఎప్పుడూ టచ్‌లో ఉంటూ, ప్రతి మ్యాచ్‌కి రూ.40,000 నుంచి రూ.8 లక్షల వరకు ఫీజు ఇస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. 2024 డిసెంబర్ 22 నుండి 2025 ఏప్రిల్ 19 వరకు, రాకేష్ చాలాసార్లు ఆన్‌లైన్‌లో డబ్బులు పంపించాడు. మొత్తం రూ.23,53,550 కట్టేశాడు. చివరికి, మోసగాళ్లు అదనంగా రూ.3 లక్షలు కావాలని అడగడం అయినా కూడా ఎలాంటి కిట్, జెర్సీ లేదా టికెట్లు పంపకపోవడంతో రాకేష్‌కు తాను మోసపోయానని అర్థమైంది. ఆ తర్వాత, ఆ సైబర్ నేరగాళ్లు రాకేష్‌ను అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో బ్లాక్ చేశారు.
రాకేష్ తండ్రి కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కొడుకు క్రికెట్ కలలు నిజం చేయడానికి ఆయన ఏకంగా దాదాపు రూ.24 లక్షలు అప్పు చేసి మరీ మోసగాళ్లకు పంపించాడు. ఈ డబ్బు కోసం ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడింది. డబ్బులు బ్యాంకు ఖాతాలో పడగానే మోసగాళ్లు వాటిని వెంటనే డ్రా చేసుకున్నారని కుటుంబ సభ్యులు పోలీసుల ముందు వాపోయారు.
ప్రాథమిక దర్యాప్తులో మోసగాళ్లు రాజస్థాన్ నుంచి ఈ మోసాలు చేసినట్లు తెలిసింది. వారిని పట్టుకోవడానికి సైబర్ క్రైమ్ టీమ్ రాజస్థాన్‌కు బయలుదేరింది. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు, ముఖ్యంగా క్రికెట్ అభిమానులు, యువత చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏ ప్రొఫెషనల్ క్రికెట్ జట్టు కూడా సెలక్షన్ కోసం డబ్బులు అడగదని ప్రజలు గుర్తుంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.