71 ఏళ్ల వయస్సులో నీట్ పరీక్ష.. తల్లి ఆఖరి కోరిక తీర్చేందుకు సిద్ధమైన కొడుకు..
జీవితంలో కలలు కనడానికి వయసుతో సంబంధం లేదని తరుచూ వింటాం.. కానీ అప్పుడప్పుడు మాత్రమే చూస్తాం.. ఇలాంటిదే మనకు చూపించాడు.;
జీవితంలో కలలు కనడానికి వయసుతో సంబంధం లేదని తరుచూ వింటాం.. కానీ అప్పుడప్పుడు మాత్రమే చూస్తాం.. ఇలాంటిదే మనకు చూపించాడు. ఒక వ్యక్తి ఆ మాటను అక్షరాలా నిజం చేసి చూపించడమే కాకుండా, తన 71 ఏళ్ల వయసులో ప్రపంచమే విస్తుపోయే సాహసం చేశారు. మనవడి వయసున్న విద్యార్థుల మధ్య కూర్చొని, తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన చూపిన అచంచల పట్టుదల వెనుక ఉన్న ఆసక్తికర కథ తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. సమాజం విధించిన వయసు పరిమితులను తుడిచివేస్తూ, ఒక గొప్ప లక్ష్యం కోసం ఆయన చేసిన ప్రయాణం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.
కలలు కనడానికి వయసు అడ్డంకి కాదని, వాటిని నిజం చేసుకోవడానికి ఎప్పుడూ ఆలస్యం కాదని నిరూపించారు లక్నోకు చెందిన 71 ఏళ్ల అశోక్ బహార్. ఆయన తన తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఈ వయసులో వైద్య విద్య ప్రవేశ పరీక్ష అయిన నీట్ కు హాజరయ్యారు.
కొడుకు నిబద్ధత
అశోక్ బహార్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక బలమైన సెంటిమెంట్ ఉంది. అశోక్ బహార్ ను ఒక డాక్టరుగా చూడాలనేది ఆయన తల్లి ఆఖరి కోరిక. తన తల్లి ఆశయాలను నెరవేర్చడమే లక్ష్యంగా ఆయన ఈ వయసులో పుస్తకాలు పట్టి మళ్లీ విద్యార్థిగా మారారు. వయసు పెరిగినా, బాధ్యతలు ముగిసినా తన తల్లికి ఇచ్చిన మాట మాత్రం ఆయన మరచిపోలేదు. పరీక్షా కేంద్రంలో 71 ఏళ్ల వృద్ధుడు పరీక్ష రాయడానికి రావడంతో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు: 17, 18 ఏళ్ల విద్యార్థుల మధ్య కూర్చుని ఆయన ఏకాగ్రతతో పరీక్ష రాశారు. ఆయన పట్టుదలను చూసి తోటి విద్యార్థులు, పరీక్షా సిబ్బంది సైతం అభినందించారు.
ఓడిపోయామని ఆగిపోయే వారికి ఒక పాఠం
ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న చిన్న పరీక్షలో తప్పితేనే కుంగిపోయే యువతకు అశోక్ బహార్ కథ ఒక పెద్ద ఇన్‌స్పిరేషన్. కలలు కనడానికి, వాటిని నిజం చేసుకోవడానికి వయసు ఎప్పుడూ అడ్డు కాదని ఆయన నిరూపించారు. వయసు అయిపోయిందని ఆశలు వదులుకునే వారికి ఈ పెద్దాయన ఒక సజీవ సాక్ష్యంలా నిలిచారు. ఓడిపోయామని ఆగిపోకుండా, కొత్తగా ప్రయత్నించే గుణం మనిషిని ఎప్పుడూ యవ్వనంగా ఉంచుతుందని ఆయన చాటిచెప్పారు.
అశోక్ బహార్ నీట్ పరీక్షలో విజయం సాధిస్తారా లేదా అన్నది పక్కన పెడితే, ఆయన చూపిన చొరవ మరియు తల్లిపై ఆయనకున్న అనురాగం నిజంగా శ్లాఘనీయం. లక్షల మంది పోటీ పడే ఈ కఠినమైన పరీక్షను ఎదుర్కోవడానికి ఆయన సిద్ధపడటమే ఒక పెద్ద విజయం.