కాంగ్రెస్ నామినేషన్ పై బీజేపీ డామినేషన్.. ఇండోర్ లో సూరత్ కుతంత్రం

గత వారం గుజరాత్ లోని సూరత్ లో ఏం జరిగిందో అందరూ చూశారుగా..? ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో నాటకీయ పరిణామాల మధ్య సూరత్ బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు.

Update: 2024-04-29 09:44 GMT

గత వారం గుజరాత్ లోని సూరత్ లో ఏం జరిగిందో అందరూ చూశారుగా..? ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో నాటకీయ పరిణామాల మధ్య సూరత్ బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. అయితే, దీనిపై ఎన్నో వివాదాలు రేగాయి. కాంగ్రెస్ సూరత్ అభ్యర్థి నీలేశ్ కుంభానీ నామినేషన్‌ ను ఈసీ తిరస్కరించింది. దీంతో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గమనార్హం ఏమంటే.. సూరత్ లో నామినేషన్ వేసిన ఇతర పార్టీల వారూ ఉపసంహరించుకోవడం. దీనివెనుక ఏదో గూడుపుఠాణీ ఉందన్న అనుమానాలు వచ్చాయి. సరిగ్గా ఇలాంటి వ్యూహాన్నే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో బీజేపీ తెరపైకి తెచ్చిందా? అనే అనుమానాలు ప్రబలుతున్నాయి. ఇండోర్ నుంచి కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన అక్షయ్ బామ్ వెనక్కుతగ్గారు. అయితే, ఇంకా 21మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సూరత్‌ లో మాదిరిగానే వీరినీ ఉపసంహరించుకునేలా చేసి, మరోసారి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. పైగా నామినేషన్‌ కు ఈరోజే చివరి రోజు కావడంతో ఉత్కంఠ నెలకొంది.

నేరుగా బీజేపీ ఆఫీసుకు..

ఇండోర్ లో నామినేషన్ వెనక్కుతీసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ నేరుగా బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. ఆయన బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ వ్యవహారం అంతా మంత్రి కైలాష్ విజయవర్గీయ ఆధ్వర్యంలో సాగినట్లు తెలుస్తోంది. ఈయన ఇండోర్ -1 ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతేకాక ‘ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్‌కు బీజేపీలోకి స్వాగతం’ అని ట్వీట్ కూడా చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో లాగే 13న పోలింగ్

Read more!

తెలుగు రాష్ట్రాల తరహాలోనే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో మే 13న పోలింగ్ జరగనుంది. బీజేపీ ఇక్కడ సిటింగ్ ఎంపీ శంకర్ లల్వానీకి టికెట్ ఇచ్చింది. అయితే, అక్షయ్ ఇచ్చిన షాక్ నుంచి కాంగ్రెస్ తేరుకోలేకపోయింది. ఇది మంచి సంప్రదాయం కాదని వ్యాఖ్యానించింది.

కొసమెరుపు: అక్షయ్ బమ్ పై హత్యాయత్నం కేసు 17 ఏళ్లుగా విచారణలో ఉంది. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముంగిట ఆయన అధికార బీజేపీలో చేరడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్న అక్షయ కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు.

Tags:    

Similar News