ఇండిగో అదరగొట్టేసింది.. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎయిర్ లైన్స్

విమానయాన రంగంలో దేశీయంగా తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే ఇండిగో సంస్థ బుధవారం ఆసక్తికర స్థానానికి చేరుకుంది.;

Update: 2025-04-10 05:30 GMT

విమానయాన రంగంలో దేశీయంగా తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే ఇండిగో సంస్థ బుధవారం ఆసక్తికర స్థానానికి చేరుకుంది. కొద్దిసేపు మాత్రమే అయినా.. మార్కెట్ విలువ ప్రకారంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎయిర్ లైన్స్ గా అవతరించింది. నెంబరు వన్ స్థానంలో నిలిచింది. అయితే.. షేర్ ధర ఆధారంగా నిర్ణయించే ఈ స్థానంలో కాసేపు ఉన్న ఇండిగో తర్వాత రెండో స్థానానికి పరిమితమైంది. దీంతో.. ప్రపంచంలో అత్యంత మార్కెట్ విలువ ఉన్న విమానయాన సంస్థగా ఇండిగో రెండు స్థానంలో నిలిచింది.

ఇండిగో బ్రాండ్ మీద కార్యకలాపాల్ని నిర్వహించే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ షేరు ధర బుధవారం మధ్యాహ్నం రూ.5265కు చేరుకుంది. దీంతో.. ఈ సంస్థ మార్కెట్ విలువ 23.24 బిలియన్లకు చేరింది. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.2,01,514 కోట్లు. అదే సమయంలో అమెరికా విమానయాన సంస్థ డెల్టా మార్కెట్ విలువ రూ.2,00,994 కోట్లు మాత్రమే. అంటే.. డెల్టా కంటే ఇండిగో అధిక్యంలో నిలిచింది. దీంతో.. మార్కెట్ విలువ ఆధారంగా టాప్ వన్ స్థానానికి ఇండిగో చేరింది.

అయితే.. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఇండిగో షేరు రూ.5194కు తగ్గటంతో మార్కెట్ విలువ మళ్లీ తగ్గింది. దీంతో.. ఇండిగో మార్కెట్ విలువ రూ.2,00,698 కోట్లుగా నిలిచింది.దీంతో.. రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. అయితే.. ప్రపంచ విమానయాన సంస్థల్లో మార్కెట్ విలువ ఆధారంగా రెండో స్థానంలో నిలిచింది ఇండిగో. ప్రపంచంలో టాప్ 10 విమానయాన సంస్థ స్థానాన్ని సొంతం చేసుకున్న ఏకైక భారతీయ ఎయిర్ లైన్స్ ఇండిగో కావటం విశేషం.

అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్ లైన్స్ తన కార్యకలాపాల్ని 1929లో ప్రారంభిస్తే.. ఇండిగో ప్రయాణం 2006లో మొదలైంది.ఆరేళ్ల క్రితం డెల్టా మార్కెట్ విలువ 36.67 బిలియన్ డాలర్లు కాగా.. ఇండిగో మార్కెట్ విలువ కేవలం 7.72 బిలియన్ డాలర్లే. అయితే.. చాలా వేగంగా ముందుకు వెళుతోంది. ఇండిగో వద్ద ప్రస్తుతం 437 విమానాలు ఉండగా.. వారానికి ఈ సంస్థ 15,768 సర్వీసుల్ని నడుపుతోంది. 982 విమానాలు ఉన్న డెల్టా ప్రస్తుతం వారానికి 35,114 సర్వీసుల్ని నడుపుతోంది.

మార్కెట్ విలువ ఆధారంగా ప్రపంచంలో టాప్ 5 విమానయాన సంస్థల్ని చూస్తే..

ఎయిర్ లైన్స్ సంస్థ పేరు దేశం మార్కెట్ విలువ (బి.డా)

డెల్టా ఎయిర్ లైన్స్ అమెరికా 23.18

ఇండిగో భారత్ 23.16

రియనైర్ ఐర్లండ్ 22.15

యునైటెడ్ ఎయిర్ లైన్స్ అమెరికా 19.22

సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ అమెరికా 15.48

Tags:    

Similar News